‘‘ఆవిడ కళాత్మకమైన సంభాషణ నాకు విసుగు పుట్టిస్తోంది. చిత్రాలు పాకుతూ ఉన్నాయంటుంది. అవేమన్నా ఫంగస్‌ అనుకుందా ... పెరగటానికీపాకటానికీ ...’’ అన్నాడు క్లోవిస్‌ తన జర్నలిస్టు స్నేహితునితో.‘‘ఆమె మాటలు వింటుంటే నాకు హెన్రీ డెప్లిస్‌ కథ గుర్తొచ్చింది. నీకెప్పుడైనా చెప్పానా అది?’’ అన్నాడుజర్నలిస్టు స్నేహితుడు.లేదన్నట్టు తల ఊపాడు క్లోవిస్‌.‘‘హెన్రీ డెప్లిస్‌ గ్రాండ్‌ డచీ ఆఫ్‌ లక్సంబర్గులో పుట్టాడు. వ్యాపార రీత్యా నిత్యం అనేక దేశాలు తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి అతను ఉత్తర ఇటలీలోని ఒక చిన్న ఊళ్లో ఉండగా దూరపు బంధువెవరో అతనికి కాస్త ఆస్తి రాసిచ్చి చనిపోయాడని తెలిసింది. అది పెద్ద ఆస్తేమీ కాదు. డెప్లిస్‌ కూడా దాన్ని పెద్ద అదృష్టంగా ఏమీ భావించలేదు.

కానీ ఆ డబ్బు రావటం మూలంగా అతనిలో కళాభిమానం చిగిర్చింది. పచ్చబొట్లు పొడవటంలో నిపుణుడైన ఏండ్రియాస్‌ పిన్‌సిని అతని దృష్టికి వచ్చాడు. ఇటలీ దేశమంతటిలో పచ్చబొట్లు పొడిచే విద్యలో పిన్‌సిని చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఇప్పుడతని ఆర్థిక పరిస్థితి ఏమంత బాగుండలేదు. అందువల్ల కేవలం ఆరువందల ఫ్రాంకులకే డిప్లిస్‌ మొత్తం వీపు నిండా ఇకారస్‌ పతన దృశ్యాన్ని చిత్రీకరించాడు. అయితే ఆ బొమ్మ డెప్లిస్‌కి పెద్దగా నచ్చలేదు. అది ముప్పయి సంవత్సరాలు యుద్ధం చేసి వాలెన్‌స్టెయిన్‌ పట్టుకున్న ఇకారస్‌ కోట అంటే డెప్లిస్‌కి నమ్మబుద్ధి కాలేదు. ఐనా పిన్‌సిని కళకు అతను సంతృప్తి పడ్డాడు. చూసిన వాళ్లంతా దాన్ని గొప్ప కళాఖండం అన్నారు.గొప్పదే కాక అది ఆయన చివరి కళాఖండం కూడా అయింది. అయితే డబ్బులు వసూలు కాకముందే అతను చనిపోవడంతో పిన్‌సిని భార్య వాటిని వసూలు చెయ్యటానికి పూనుకుంది.

అప్పటినుంచి డెప్లిస్‌ జీవితంలో కష్టాల పరంపర ప్రారంభమయ్యింది. బంధువు మరణం ద్వారా సంక్రమించిన డబ్బులో అప్పటికే చాలా భాగం హరించుకుపోయింది. పిన్‌సిని భార్య కివ్వటానికి అతని వద్ద 430 ఫ్రాంకులు మాత్రమే మిగిలాయి. అవి చూసి పిన్‌సిని భార్య కోపంతో దహించుకుపోయింది. మిగిలిన 170 ఫ్రాంకులకు నోటు రాసివ్వమంది. ఈ మాటలు జరుగుతున్న వారంలోనే 430 ఫ్రాంకులు 405కు తగ్గిపోయాయి. అది తెలిసి పిన్‌సిని భార్య కోపానికి హద్దుల్లేకుండా పోయింది. ఆమె తన భర్త డెప్లిస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి, బెర్గామో మున్సిపాలిటీ వారికి ఆ కళాఖండంపై హక్కులు ఇచ్చేసింది. అది తెలిసి డెప్లిస్‌ ఎవరికీ చెప్పకుండా పక్క ఊరికి పారిపోయాడు. ఆ తర్వాత వ్యాపార నిమిత్తం రోమ్‌ వెళ్లి అక్కడ తననెవరూ గుర్తించలేరని ధీమాగా బతకసాగాడు.