శ్రీరామ్మూర్తిగారిల్లు చూడముచ్చటగా ఉంటుంది. అదేమీ ఇంద్రభవనం కాదు. మామూలు పెంకుటిల్లు. ఆ పల్లెలో శ్రీరామ్మూర్తిగారికి అందరూ ఆత్మీయులే శ్రీరామ్మూర్తిగారికి నలుగురు ఆడపిల్లలు. భార్యాభర్తలు ఆ ఇంట్లో కళకళ్ళాడుతూ ముఫ్పైఏళ్ళు కాపురం చేశారు.పెరట్లో కొబ్బరిచెట్లు, జామచెట్లు, పూలచెట్లు, అందంగా అల్లుకున్న సన్నజాజి పందిరి, గిలకబావి దగ్గర చిన్నపాకలో ఆవు, దూడ, పెరట్లోకి ఎవరు వచ్చినా అంబా అని పలకరిస్తూ వారిమనసుల్ని ఆనందపరిచేవి. కాలంఎప్పుడూ ఒక్కలా ఉండదుకదా. ఆడపిల్లల పెళ్ళిలై వెళ్ళిపోయారు. వృద్ధాప్యంతో శ్రీరామ్మూర్తిభార్య కన్నుమూశారు. ఇప్పుడాఇల్లు ఎవరికీ అక్కర్లేకపోయింది. అందరూ ఆడపిల్లలవడంతో ఇల్లు అమ్మకానికిపెట్టారు.

ప్రక్కింటివాళ్ళు కలిసి వస్తుందని పెరట్లోంచి గుమ్మం పెట్టుకుంటే పెద్ద ఇల్లవుతుందని భావించి, కొనటానికి ప్రయత్నించారు. ఊళ్ళో కొంతమంది ఇంకా ఎక్కువ డబ్బిచ్చి కొంటామని పోటీకి వచ్చారు. మరికాస్త ఖరీదు ఎక్కువపెట్టి ప్రక్కింటి వెంకటేశ్వర్లు కొనేశాడు. ఊళ్ళో కొంతమందికి ఇది కొంచెం బాధగా అనిపించింది. వెంకటేశ్వర్లుమీద ఏవో గుసగుసలు చెప్పుకోసాగారు. ఆఖరికి రచ్చసావిడి మీద కూడా ఇదే చర్చ. వెంకటేశ్వర్లు వీధిలో వెళ్తుంటే చూసినవాళ్ళంతా ఏక నిట్టూర్పులు..నవ్వులు.. పాపులంటూ ఎగతాళి చూపులు ఎదురవుతున్నాయి. వెంకటేశ్వర్లుకి ఇవన్నీ చూస్తే అర్థంకాని బాధ వచ్చేది.

ఎందుకిలా ఉంటున్నారు, ఏం జరిగిందని వెంకటేశ్వర్లు అడిగితే ఎవరూ ఉన్నమాట చెప్పేవారు కాదు. చివరికి ఒకరోజు రచ్చబండ దగ్గర ఒక ఆసామి వెంకటేశ్వర్లుతో, ‘‘ఏమిటయ్యా ఆ కొనక కొనక ఆ ఇల్లు కొన్నావేంటయ్యా’’ అన్నాడు.‘‘ప్రక్కిల్లు కలిసొస్తుందికదా అని కొన్నాను. కొంటే ఏమయింది! ఎందుకిలా అందరూ నామీద పడి ఏడ్వడం’’ అన్నాడు. ‘‘మేము కాదయ్యా ఏడ్చేదీ, నువ్వే ఏడవాలి అది కొన్నందుకు’’ అన్నాడు ఆసామి.