‘‘ధర్మరాజు గారు ఎక్కడ ఉంటారు సార్‌?’’ రాజు మొదటి ప్రశ్నవేసాడు. రాజు తన కొత్త ఉద్యోగంలో చేరడానికి వచ్చేడు. చేరవలసిన కంపెనీకి, తను చేరవలసిన డిపార్ట్‌మెంట్‌కి చేరాడు.రాజు మధ్య తరగతి కుటుంబీకుడు. రెక్కాడితే కాని డొక్కాడని వాడు. కొత్త ఉద్యోగంలోకి రావడంతో కొత్త పెళ్లికొడుకు లాగ తయారయి వచ్చేడు.రాజు వెళ్ళిన గదిలో ఆరు టేబిల్స్‌ ఆరు కుర్చీలు, వాటి మీద కంప్యూటర్స్‌ ఉన్నాయి. ఇవాళ–రేపు, ఏ పనికి అయినా కంప్యూటర్‌ అవసరమేమో!

‘‘నా సీటు ఈ గదిలోదా?’’ తనకి తను మనసులో లెక్క వేసుకున్నాడు రాజు.ఆ గదిలో ఒకే ఒకవ్యక్తి కూర్చొని ఉన్నాడు. దీక్షగా తన మనసులో ఉన్నది తన కంప్యూటర్‌లో టైప్‌ చేసుకొంటున్నాడు. మిగిలిన అయిదు టేబిల్స్‌ వద్దా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఆ కుర్చీల శాల్తీలు, బస్సులు దిగి పావుగంట అయింది. వస్తూనే బాత్రూమ్‌లో దూరి అందాలు సరిదిద్దుకొంటున్నారు.అక్కడ కూర్చున్న ఆ ఒకే ఒక వ్యక్తిని రాజు మరొకసారి అడిగేడు.‘‘ధర్మరాజుగారు ఎక్కడ ఉంటారు సార్‌?’’ఆ వ్యక్తి రాజుని చూసాడు.‘‘ధర్మరాజు గారు ఎందుకు?’’ ఆ వ్యక్తి తన పని ఆపి రాజువైపు చూసి అడిగేడు.‘‘నేను ఇవాళ ఉద్యోగంలో జాయిన్‌ అవుతున్నాను. నా పేరు ఏ.బి.‍‍సి.డి. రాజు. ఈ ‘‘స్టోర్స్‌’’లో ‘‘రిసీప్ట్స్‌’’ సెక్షన్‌లో జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇవ్వాలిసార్‌’.‘‘శుభం... నా పేరు శివప్రసాదరావు. జాయినింగ్‌ రిపోర్టు ధర్మరాజు గారికి ఇవ్వలేరు. వారు నిన్న ‘ఒంగోలు’ ప్లాంటుకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు.

సుబ్బరాజుగారు ఇవాళ ఈ ‘‘స్టోర్సు’’ డిపార్ట్‌మెంట్‌ని టేక్‌ఓవర్‌ చేసుకొంటున్నారు. వారు ఈపాటికి జి.ఎం. గారి వద్ద రిపోర్టింగ్‌లో ఉండి ఉంటారు’’.‘‘వారు వచ్చేవరకు నేను ఇక్కడ కూర్చోవచ్చా?’’ రాజు వినయంగా అడిగేడు.‘‘సుబ్బరాజు గారు వచ్చేవరకూ మీరు వెయిట్‌ చెయ్యనక్కరలేదు. పక్కగదిలో కూర్చోండి. సూరిబాబు గారు వస్తారు. సూరిబాబు గారు మా స్టోర్సుకి అసిస్టెంట్‌ మేనేజరు. సుబ్బరాజు గారు మాకు మేనేజర్‌ గారు. మీరు సూరిబాబు గారికి రిపోర్టింగ్‌ ఇవ్వండి. తర్వాత ఏం చెయ్యాలో వారు చెప్తారు.