ప్రేమాతిశయాలమధ్య ఆ ఇంట్లో ఎంతో హాయిగా బతికేస్తున్నాడు రెక్స్‌. కానీ ఓ ముసలాడు ఆ ఇంట్లో కాలుపెట్టాడోలేదో రెక్స్‌కి మనశ్శాంతి కరువైంది. రెక్స్‌ ఇష్టాలు పట్టించుకోకుండా అన్నీ తన ఇష్టప్రకారమే చెయ్యాలనేవాడు. చివరకు రెక్స్‌ లవ్‌ ఎఫైర్‌లో కూడా వేలుపెట్టి, కలిసిన మనసుల్ని జాతిపేరుతో విడదీశాడు ఆ ముసలాడు. రెక్స్‌ ప్రేమను మొగ్గలోనే తుంచేశాడు. వాడికేంపోయేకాలం? అసలు వాడికి ఎందుకాపట్టింపులంట?

––––––––––––––––––––––––

కుక్క బ్రతుకు అని అందరూ అంటుంటే వినడమేగానీ ఎందుకలా అంటారో నాకు తెలియదు. దానికి తోడు ఎవ్విరీ డాగ్‌ హాజ్‌ ఇట్స్‌ డే (అంటే ప్రతి కుక్కకీ ఒకరోజు వస్తుంది అని అర్థంట) అన్నమాట విన్నా నాకు అయోమయంగా ఉంటుంది.ఎందుకంటే నా యజమాని నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు నన్ను మా అమ్మ దగ్గరనుంచి తీసుకొచ్చేశారని కాస్త కోపంగా అనిపించినా, నన్ను ప్రేమగా చూసుకుంటూ ఉండటంతో అమ్మ ప్రేమ మరుపుకి వచ్చింది. నా ఆలనాపాలనా చాలా శ్రద్ధగా చూసుకుంటాడు. నాకు రెక్స్‌ అని పేరుపెట్టాడు. రెక్స్‌ అంటే రాజు అని అర్థంట. ఎవరికో చెప్తుంటే విన్నాను. నన్ను ఓ మోస్తరు రాజాలాగానే చూసుకుంటాడు నా యజమాని. ఆఫీసుకి వెళ్ళేటప్పుడు భార్యకి చెప్పడం మరచినా, నాకు మాత్రం బై చెప్తాడు. లేకపోతే నేను ఊరుకుంటానా, గట్టిగా పిలిచి మరీ బై చెప్పించుకుంటాను.

అది వేరే విషయం అనుకోండి!యజమాని పిల్లలతో నాకు చాలామంచి స్నేహం. వాళ్ళిద్దరూ స్కూల్‌నుంచి వచ్చాక నేను వాళ్ళతో బాగా ఆడుకుంటాను. వాళ్ళ ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడేటప్పుడు నేను ఆ బాల్‌ నోట్లో పట్టుకుని ఎవరికీ దొరక్కుండా పరుగెడతాను చూడండి, ఆ సీను నాకు బాగా ఇష్టం. కాని యజమాని పిల్లల స్నేహితులు నన్ను పట్టుకోలేక విసుక్కుంటాను. అయితే యజమాని పిల్లలు మాత్రం నన్ను పట్టుకుని నా నోట్లో నుంచి ఆ బంతిని ఊడబెరుకుతారు.‘‘ఆ బాల్‌ కడిగారా? అలాగే ఆడితే వీపు చిట్లగొడతాను’’ అంటూ అటుగా వచ్చే మా యజమాని భార్య పిల్లలమీద అరుస్తుంటుది. ఆమె అంటే నాకు కాస్తభయం, కాస్త కోపం. అందుకే నేను దూరంగా ఉంటాను ఆమెకి.