త్వరగా గమ్యం చేరాలనే ఆత్రం! గాలిలో తేలిపోతూ కారు నడుపుతున్నాడతను. ఆ సందడిలో దారితప్పాడు. అంతలోనే పెనుగాలులు, వర్షం. రోడ్డుకడ్డంగా చెట్టుకూలింది. గమ్యం తెలియని చీకటిలో కారు ఆగిపోయింది. ఏం చెయ్యాలి? దూరంగా ఏదో దీపం! సహాయంకోసం అటుగా వెళ్ళాడతను. ఆ నిర్మానుష్య ప్రదేశంలో చిన్న ఇంట్లో ఓ స్ర్తీ మూర్తి!! ఆమెను చూసి హతాశుడయ్యాడతను!!

ఆకాశం నల్లగా మేఘావృతమై ఈదురుగాలులతో వర్షం మొదలైంది. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నాడు నరేంద్ర. తలచుకుంటేనే ఒంట్లో ఉత్సాహం పరుగులెడుతోంది. ఆరున్నర దాటాకా గ్యారేజ్‌లోంచి రేంజ్‌రోవర్‌ బయటికి తీశాడు. సెల్ఫ్‌డ్రైవింగ్‌కి ఆ కార్‌ వాడతాడు కాబట్టి డ్రైవర్‌ మోహన్‌కి అర్థమైపోయింది తన అవసరంలేదని. అయ్యగారే స్వయంగా డ్రైవ్‌చేసుకుని వెళతారని, ఆకాశంవైపు ఒకసారి, నరేంద్రవైపు ఒకసారి చూసి నిశ్శబ్దంగా నిలబడిపోయాడు చేతులుకట్టుకుని. నరేంద్ర ఎవరిమాటా వినడు. అతడు కొనదేలిన మీసం పట్టుదలకు చిహ్నమని బంధువులు స్నేహితులు, మేన్లీనెస్‌కు చిహ్నమని గర్ల్‌ఫ్రెండ్స్‌, అతని కఠినత్వానికి చిహ్నమని పనివాళ్ళు సేవకులు ఎవరి అనుభవాలని బట్టి వాళ్ళు అనుకుంటుంటారు.నరేంద్ర నెమ్మదిగా డ్రైవ్‌ చేసుకుంటూ అందుకోబోయే విందు గురించి, అనుభవించబోయే ఆనందం గురించి ఊహించుకోసాగాడు.

నరేంద్ర ఫ్రెండ్‌ మదన్‌ ఫామ్‌ హవుస్‌లో పార్టీ ఏర్పాటుచేశాడు. మదన్‌ ఆ ఫామ్‌హవుస్‌ కొని రెండునెలలు కావస్తోంది. అందులో ఇదే మొదటి పార్టీ. ఊరి సరిహద్దులు దాటి జనావాసానికి దూరంగా విసిరేసినట్టుంటుంది బంగళా. చుట్టూ చెట్లు తోటలు ఉండడంవల్ల అక్కడ బంగళా ఉందని బయటివాళ్ళకు తెలియదు. పార్టీకి దాదాపు పదిమందివరకు వస్తారు. స్నేహితులందరికీ విందులో అన్నిరకాల సదుపాయాలు కల్పించడంలో మదన్‌ సిద్ధహస్తుడు. అందుకే మిగిలిన ఫ్రెండ్స్‌ ఇచ్చే పార్టీలకన్నా మదన్‌ ఇచ్చే పార్టీకి క్రేజ్‌ ఎక్కువ.

అతను సమకూర్చే సదుపాయాలు, ఆనందాలు మరొకరివల్ల కాదు. దానికితోడు ఊహకిఅందని సర్‌ప్రైజులు అబ్బురపెడుతుంటాయి. ఉల్లాసవీధుల్లో విహరింపజేసే అంశాలెన్నో ఉంటాయి.‘‘వారం రోజులనుంచీ ఊరిస్తున్న పార్టీ ఈ రోజులోకొచ్చేసరికి ఇలా వర్షం మొదలైంది. అయినా వెళ్ళితీరాలి. గెస్ట్‌హౌస్‌కు చేరిపోతే చాలు’’ అనుకున్నాడు నరేంద్ర. ఆ ప్రపంచమే వేరు. ఏ తుఫానూ గుర్తుకురాదు. ఇళ్లు ఒళ్ళు అన్నీ మరచిపోతారు. రాత్రంతా పార్టీ అయ్యాక మర్నాడు సాయంత్రం వరకు అక్కడే రెస్ట్‌ తీసుకుంటాడు నరేంద్ర.