రక్షణ పరిశోధనాసంస్థలో ఆమె తండ్రి గొప్ప పరిశోధకుడు. ఆయన సాధించిన విజయాలు వింటూ డిన్నర్‌ టేబుల్ దగ్గర ఆ కుటుంబం పరవశించిపోతోంది. అప్పుడు ఆయన తన పిల్లల్ని ఉద్దేశించి, ‘మీలో ఏ ఒక్కరూ జీనియస్‌ కాదు రా’ అన్నాడు. అప్పటినుంచీ కూతురు దీర్ఘాలోచనలో పడింది. జీనియస్‌ అనే పదానికి అర్థం ఏమిటో వెదకిచూసింది. దాని గురించే ఆలోచిస్తూ ఒక జ్ఞాన ప్రపంచంలోకి ప్రవేశించింది. అక్కడ ఏం జరిగిందంటే..

...................................................

మళ్ళీ అదే దృశ్యం.రాత్రి ఎనిమిదీముప్పై నిమిషాలు. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర నాన్న అబ్రహం, అమ్మ అరుంధతి, అక్క ఎలిజబెత్‌, అన్న రామ్మోహన్‌, సుశీల అనబడే నేను...అందరం నిశ్శబ్దంగా ‘డిన్నర్‌’ చేస్తున్న సందర్భం. హైదరాబాద్‌లోని డి.ఆర్‌.డి.ఎల్‌ ల్యాబ్‌లో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న నాన్న ఆ రోజే భారతదేశపు ఆర్మీలో యుద్ధ సమయంలో అత్యంత కీలకమైన రాత్రివేళల్లో రాడార్‌ సిస్టంలో పనికొచ్చే ఒక ప్రత్యేకమైన సెన్సర్‌ను తన టీం డిజైన్‌ చేసిన విజయంగురించీ, దేశ ప్రధానమంత్రి నుండి పొందిన ప్రశంసగురించీ చెబుతున్నప్పుడు ఆయన ముఖంలోని వెలుగునూ, తృప్తినీ, ఒక విజయాన్ని సాధించినప్పుడు ఒకవ్యక్తి పొందే అద్భుతమైన ఆత్మానందాన్నీ గమనిస్తూ పొంగిపోతున్న తరుణంలో, అన్నాడు మళ్ళీ అదే వాక్యం...‘‘నాన్నా, మీలో ఎవరూ ‘జీనియస్‌’ కారురా. అదే నన్ను ఎప్పుడూ వేధిస్తూంటుంది’’ అని.

జీనియస్‌, జీనియస్‌, జీనియస్‌...! ఏమిటి జీనియస్‌ అంటే. డిక్షనరీ అర్థం. జీనయస్‌ అంటే, కౌశలమైన బుద్ధిగలవాడు, మేధావి, కుశాగ్ర బుద్ధి కలవాడు...ఇలా ఉన్నాయి అర్థాలు.అక్క ఎలిజబెత్‌ అప్పటికే పి.జి లో బంగారుపతకం సాధించి ఢిల్లీలోని జె.ఎన్‌.యులో లెక్చరర్‌గా పనిచేస్తోంది. అన్న రామ్మోహన్‌ ఎం.టెక్‌. మెకానికల్‌ ఇంజనీరింగ్‌. ప్రొడక్షన్‌ టెక్నాలజీలో రోబట్స్‌ రంగంలో స్పెషలిస్ట్‌. మారుతి ఉద్యోగ్‌ లిమిటెడ్‌, గురుగాంలో పనిచేస్తున్నాడు. ఇక తను సుశీల.. ఉస్మానియాలో సైకాలజీలో పి.జి.చేసి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సెల్వేనియాలో పి.హెచ్‌.డి.లో అడ్మిషన్‌ను సాధించి పది రోజుల్లో చేరబోతోంది. ఈ సీట్‌ దక్కడం ఒక అద్భుతమైన విజయమే. అంత సుళువైన విషయం కాదు 1740లో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ స్థాపించిన అమెరికాలోని ఆధ్యాత్మికనగరం ఫిలడెల్షియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సెల్వేనియాలో డాక్టోరల్‌ సీట్‌ సంపాదించడం. తమ కుటుంబంచుట్టూ ఉన్న అనేకమందిప్రముఖులు ఈ విజయాలను సాధిస్తున్న తమ ముగ్గురినీ చూచి వాళ్ళవాళ్ళ కుటుంబాల్లో ఒక ఉదాహరణగా ఉటంకిస్తూ ప్రశంసిస్తుంటారు బహిరంగంగానే. కానీ, నాన్న మాత్రం...‘‘మీలో ఏ ఒక్కరూ జీనియస్‌ కాదురా’’ అనడం మాత్రం మాననే లేదు.