వాళ్ళంతా స్నేహితులు. పండుగలు, నోములు, వ్రతాలు లాంటి ప్రతి సందర్భంలోనూ చాలా పద్ధతిగా వాయినాలిచ్చి పుచ్చుకోవడం, పోటీలు పెట్టుకోవడం వాళ్ళకి అలవాటు. కానీ వాళ్ళను చూసినప్పుడల్లా సుజాత భర్త ‘టై మొ చూ జా గు’ అంటూ ఏడిపిస్తుంటాడు. దాని అర్థమేంటో వాళ్ళకి చాలా ఏళ్ళుగా అంతుబట్టడంలేదు. అదొక మిష్టరీగా మారిపోయింది. అదేంటో మీరూ తెలుసుకోండి. 

‘టైమొచూజాగు....! టైమొచూజాగు–’ ఏదో మంత్రోచ్ఛారణలా పాడుకుంటున్నాడు సుధాకర్‌.‘టైమొచూజాగునా? అంటే...?’ ఆశ్చర్యంగా అడిగింది సుజాతని స్నేహితురాలు ఇందిర.‘అవును. టైమొచూజాగునే! ఆయనలా పిచ్చివాడిలా ఆయన్లో ఆయన అలాగే గొణుక్కుంటూ ఉంటాడులే, వదిలేయ్‌’ అంది అసహనంగా సుజాత.‘వదిలేస్తాగానీ... అంటే ఏమిఁటో ముందుచెప్పు నాకు’ మళ్ళీ అడిగింది ఇందిర.‘నా బొంద, అంటే ఏమిటో నాకు తెలిసిచస్తే కదా... నువ్వే అడుగు సుధాకర్‌ని’ చిరాగ్గా అంది సుజాత.‘టైమొచూజాగు అంటే ఏమిటి సుధాకర్‌ గారూ!’ ఉత్సుకతో అడిగింది ఇందిర.‘టైమొచూజాగునే...!’ అన్నాడు సుధాకర్‌ పేపర్‌ చదువుకుంటూ ఆ పని మీదే ఉండి.

‘అదే బడాయి. వదిలెయ్యవే ఇందిరా. మనం చేసుకోవాల్సిన పనులు లక్ష ఉన్నాయి. పద, డాబామీద కూర్చుని మాట్లాడుకుందాం. రాధ, మణిమాల, శారద మరో ఐదునిమిషాల్లో వచ్చేస్తారు. ఈ సీజన్లో మనం వెళ్ళాల్సిన పేరంటాలూ, ఇచ్చుకోవాల్సిన వాయినాలూ, పుచ్చుకోవాల్సిన వాయినాలూ చాలా ఉన్నాయి’ అంటూ స్నేహితురాలిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సుజాత.‘హ... హ... హ... టైమొచూజాగు!’ అనుకుంటూ నవ్వుకున్నాడు సుధాకర్‌ పేపర్లోంచి తల బైటికి పెట్టి. ‘నీ దగ్గర ఎఱ్ఱవో యాభై ఉన్నాయా, నా దగ్గర ఆకుపచ్చవి డెబ్బై ఎక్స్‌ట్రా ఉన్నాయి.

ఎక్స్ఛేంజి చేసుకుందాం’ సుజాత ఇందిరనడిగింది.‘అలాగే’ అంది ఇందిర. వెంటనే చిన్నపిల్లలు స్టాంపులూ, కాయిన్సూ ఎక్ఛ్సేంజ్‌ చేసుకున్నట్టు బ్లౌజుపీసులు మార్చుకున్నారు స్నేహితురాళ్ళిద్దరూ. ఆనక అలాగే, రాధ, మణిమాల, శారద కూడా తమ దగ్గర ఎక్కువ ఎక్కువగా ఉన్న నీలం, పసుపు, గోధుమరంగు బ్లౌజుపీసుల్ని్ ఎక్ఛ్సేంజ్‌ చేసుకున్నారు.ఇప్పుడు ఆ ఐదుగురు స్నేహితురాళ్ళు సుజాత, ఇందిర, రాధ, మణిమాల, శారద స్నేహితులందరి దగ్గరా ఇంచుమించు సరిసమానమైన రంగుల్లో బ్లౌజుపీసులున్నాయి. వాయినాలు ఇచ్చుకోడం, పుచ్చుకోడం మొదలుపెట్టారు.