‘‘భూలోక నాంచారి..విద్య నేర్పినవాడా ఓరి వీరమల్లు...ఛల్‌’’ అంటూ సీనుగాడు పాటందుకుంటే సూడాలె. పల్లె పట్నానికి ఉత్తకాళ్లతో నడిచొస్తది. బడిలో బాలునిగా ఉన్నప్పటినుండే సీనుగాడు పాటగాడు. అందుకే సీనుగానిపేరు ‘సింగర్‌ సీనుగాడు’ అయ్యింది. వాడు పెరుగుతుంటే వాని పాటల మైదానం వాడిలాగే పెరుగుతూ, విస్తరిస్తూనే వచ్చింది.

జెండా వందనం దగ్గరనుండి ఛాయ్‌ హోటల్‌ పార్టీలదాకా సీనుగాని పాటలేని సందర్భం లేదు. ఊళ్ళో అందరూ పాటల సీనని పిలిస్తే, యూనివర్సిటీలో మాత్రం ‘సింగర్‌ సీను’ పేరు స్థిరపడిపోయింది. దీంతో సీనుగానికి కొంచెం పేరు, గౌరవం కూడా పెరగనే పెరిగింది. ఏవేవో పాటలుపాడే సీనుగాడు మెల్లగా ఓ మంచి పాటగాడైండు. ఎవరో రాసిన పాటలుకాదు, తాను కూడా మెల్లగా పాటలు అల్లడం నేర్చుకున్నాడు. అది వానికి పుట్టుకతోనే వచ్చిందని కొందరు, వాళ్ల అమ్మానాయినవల్ల వచ్చిందని మరికొందరు వాదులాడుతుంటారు.ఏది ఏమైనా సీనుగాడు మాత్రం కేవలం పాటగానిగా మాత్రమే కాదు, పాటలు రాసే ఒడుపు కూడా నేర్చుకున్న చిన్నపాటి వాగ్గేయకారుడయ్యాడు. ఇంకేమున్నది. చెయ్యి విరగేంత లేదుగాని, ఓ మాదిరిగా రాసి పాడే వాడయ్యాడు.

దేనిమీద రాయిమంటే దానిమీద రాయడందాకా ఎదిగాడు. కానీ, మంది చెప్తే రాసుడుకాదు, తన మనసులో పుట్టిన ఆలోచనమీదే పాట రాయాలనుకున్నాడు. అంటే అచ్చంగా తనకు నచ్చినపాటే రాయాలనుకున్నాడు. ఎవరో దేనికోసమే రాయిమంటే రాయడం వద్దు అనుకున్నాడు.ఎందుకో తెలియదు. కొన్నిపాటలు రాసినంక సీనుగానికి ఉన్నట్టుండి వాళ్ల అయ్యమీద పాట రాయాలనే కోరిక పుట్టింది. నడిచి నడిచి వెనక్కి తిరిగి చూసుకున్నట్టు ఈ కొత్తకోరిక పుట్టింది. పాట రాయడానికి సిద్ధమయ్యాడు. వారంరోజులనుండి సీనుగానికి, నాన్న పాట తప్ప మరో ధ్యాసలేదు. యూనివర్సిటీ హాస్టల్ల ఇనుప మంచంమీద నడుంవాల్చి కండ్లు మూసుకున్నాడు.