రామచంద్రం పోయాడని తెలిసిన వెంటనే అతడి ఆఫీసులో ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే జీవితాంతం పిసినారిలా, ఎవరితోనూ కలవకుండా బతికాడతను. అతనికి సంతాపం చెప్పేవాళ్ళు కూడా కరువయ్యారు. కానీ అతని ఆఫీసులో ఓ ముగ్గురు మాత్రం మానవతాదృక్పథంతో ప్రవర్తించారు. అసలింతకీ రామచంద్రం ఎలాంటివాడు? లోకాభిప్రాయంలో నిజం ఎంతుంది?

=========

 

‘‘నీకు తెలుసా!... రామచంద్రం పోయాట్ట’’ అని సీట్లో కూర్చుంటూ చెప్పాడు సుధాకరం.‘‘ఎప్పుడు?’’ అన్నాను విస్తుబోతూ.‘‘నిన్న గుండెపోటుతో పోయాడని విశాఖనుంచి బ్రాంచి మేనేజరు వసుధారావు ఫోను చేశాడు.. పాపం ఇంకా ఏడాది సర్వీసు ఉంది’’ అని నిట్టూర్చాడు సుధాకరం.రామచంద్రం పోయినవార్త మా ఆఫీసంతా పాకింది. నేను కొద్దిగా చలించినమాట నిజమే! మా ఇన్స్యూరెన్స్‌ కంపెనీలో చాలాకాలం పనిచేశాడు. తర్వాత తన సొంతూరు విశాఖ దగ్గర పల్లెటూరికి మకాం మార్చాడు. అక్కడ పిల్లల చదువుల నిమిత్తం స్థిరపడ్డాడు.రామచంద్రం గురించి పట్టించుకున్న వాళ్ళెవరూ నాకు కనిపించలేదు. ఆపాటి ఈపాటి వివరాలు తెలిసింది నాకే! అతడి గురించి సంతాపం వెలిబుచ్చుదామని ఒత్తిడి తెచ్చింది నేనూ, సుధాకరమే.

‘‘ఎందుకు సంతాపం ప్రకటించాలి, ఏం ఊడబొడిచాడని? ఎవరికి ఉపయోగపడ్డాడుగనుక, ప్రతీ పైసాకి, పరక్కి కక్కుర్తిపడేవాడు. లెక్కడొక్కా అడిగేవాడు. అటువంటివాడికి సభలు, సమావేశాలు శుద్ధ దండుగ’’ అని తెగేసి చెప్పాడు సూపర్నెంటు సుధీరమూర్తి.నిజానికి అతగాడి మాటల్లో నిజం లేకపోలేదు. రామచంద్రానికి, డబ్బుకీ లంకె. ఆఫీసులో కూడా తన పిసినారితనం పోగొట్టుకునేవాడు కాదు. క్యారేజీలో కూడా ప్రత్యేక పదార్థాలు తెచ్చేవాడు కాదు. ఒకవేళ ఏమైనా తెచ్చుకున్నా ఒక్కడూ వేరేగా కూర్చుని బుక్కేవాడు. ఎవరైనా చనువుకొద్దీ ‘‘మీ ఐటమ్‌ మాకు రుచి చూపిస్తారా?’’ అని అడిగి తీసుకోబోతే ‘‘నా పదార్థాలు ముట్టుకోవద్దు’’ అని నిర్మొహమాటంగా చెప్పేసేవాడు.ఓ రోజున వాళ్ళమ్మాయి పెద్ద మనిషయిందని తెలిసి పార్టీ అడిగారు స్టాఫ్‌.‘‘మా ఇంట్లో వాళ్ళతో సింపుల్‌గా చేసుకుంటున్నాను. మీకెందుకు ఇవ్వాలి’’ అని ఎదురు తిరిగి జవాబిచ్చాడు.అయితే ఇవేవీ లెక్కలోకి తీసుకోకుండా ఏ పార్టీ జరిగినా సరే అతన్ని ఆహ్వానించటం మానలేదు. ఏవైనా కలక్షన్సు, దసరా మామూళ్ళు వంటివి అందరం డబ్బులు ఎత్తుకుంటే తను మాత్రం పైసా తీసేవాడు కాదు. మామూళ్ళివ్వాల్సిన అవసరం లేదంటూ ఖండించేవాడు. కార్తీకమాసంలో వనభోజనాలప్పుడు కూడా విరాళమిచ్చేవాడు కాదు. పోనీ అతగాణ్ణి వదిలి వెళ్ళటమెందుకని మాతో తీసుకెళ్ళే వాళ్ళం. రోజూ ఆఫీసుకు ఇంటినుండి నడుచుకునివచ్చి చెమటలు కక్కేవాడు. మళ్ళా ఇట్నుంచీ అంతే! ఏమని అడిగితే ఆరోగ్యానికి మంచిదంటూ కప్పి పుచ్చుకునేవాడు.