పెళ్లయి పట్టుమని పది రోజులు కూడా కాలేదు. కాళ్ల పారాణింకా ఆరనే లేదు. సినిమా హాల్లోంచి కొత్త పెళ్లికూతురు అత్యంత నాటకీయంగా మాయమైపోయింది. కొద్ది నిమిషాల ముందు వరకూ ఆమె ప్రక్కనే కూర్చుని సినిమా చూసిన భర్త ఫణికి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. సినిమాల్లో కంటే నిజజీవితంలో మలుపులు ఎక్కువగా ఉంటాయన్న సత్యం అతనికి ఆలస్యంగా బోధపడింది.

ఫణి కొద్దిగా తేరుకున్నాక, అసలేమైందా అని ఆలోచించాడు. ఇటీవల తన జీవితంలో జరిగిన సంఘటనలను నెమరు వేసుకున్నాడు.ఫణి ఓ కార్పొరేట్‌ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసరుగా హైదరాబాదులో పని చేస్తున్నాడు. అతని చదువు సంధ్యలన్నీ కాకినాడలోనే. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ వచ్చి మూడేళ్లయింది. ప్రేమా, దోమా లాంటి మాటలతనికి సరిపడవు. చాలా ప్రాక్టికల్‌ మనిషి. తల్లిదండ్రులకంటే పిల్లల బాగు కోరుకునేదెవరని వాళ్లు కుదిర్చిన సంబంధాన్నే ఓకే చేశాడు.అమ్మాయిది సామర్లకోట. పేరు ఐశ్వర్య. సార్థకనామధేయురాలే అనవచ్చు. ఎందుకంటే వాళ్ల ఆర్థిక స్థితిగతులని బట్టి మధ్యతరగతికి ఎక్కువ, ఆ పై తరగతికి తక్కువ అన్నట్లుగా ఉంటుంది. ఎలాగోలా డిగ్రీ పూర్తయిందనిపించింది. పీజీ చేయడమంత ఈజీ కాదని ఓ నిర్ణయానికొచ్చేసి, ఏవో పోటీ పరీక్షలకు తయారవుతూ ఉంది.ఫణి దృష్టిలో పెళ్లిచూపులనేవి ఓ ఫార్మాలిటీ మాత్రమే! ముందుగా ఫణి తల్లిదండ్రులు అమ్మాయిని చూశారు.

వాళ్లకి అమ్మాయి అన్నివిధాలా నచ్చిందని చెప్పగానే ఫణిక్కూడా ఆటోమేటిగ్గా ఐశ్వర్య మీద ఇష్టం కలిగి పోయింది, ఆమెనింకా అతను చూడకపోయినా!బ్యాంకు ఉద్యోగి కాబట్టి, ఫణికి పెళ్లి కోసమని వారం రోజుల సెలవు దొరకడమే గగనమైపోయింది.పెళ్లయిన నాలుగోరోజునే కొత్త దంపతులతో బాటు ఫణి తల్లిదండ్రులు హైదరాబాద్‌ బయల్దేరి వచ్చేశారు. ప్రారంభంనుండీ ఐశ్వర్య ముభావంగానే ఉంటూ ఉంది. ‘మొదటిసారిగా అమ్మానాన్నలను వదిలిపెట్టి రావడంవల్ల, ఆడపిల్లకి ఆ మాత్రం బెంగ సహజమే కదా!’ అని అనుకున్నాడు ఫణి.పెళ్లయిన ఎనిమిదో రోజున మొదటిసారిగా నోరు తెరిచి ‘‘సిన్మాకి వెడదామండీ’’ అని ఐశ్వర్య అడిగేసరికి, ఫణికి పగలే వెన్నెలలా, జగమే ఊయలలా అనిపించి, వెంటనే ఆన్‌ లైన్లో ‘కల్యాణ వైభోగమే’ ఫస్ట్‌ షోకి టికెట్లు బుక్‌ చేశాడు.