‘‘అవును సర్‌.. నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. నిజమే, పెళ్లయిన ఆరునెలలు తిరగక ముందే .. కరక్టే మా వూళ్లోనే ..’’ ఆగింది.విశ్వనాధరాజు సత్యవాణినే గమనిస్తున్నాడు. ముప్పై సంవత్సరాలు.. ముహంలో, కళ్లలో దాచుకున్న బాధ కోపంగానో .. కోపం బాధగానో .. బయటకి ఉరుకుతోంది. అతను నోరు తెరిచి మాటాడబోతుండగానే ఆమె తిరిగి అందుకుంది.

‘‘ఒప్పుకుంటాను .. నేనందుకు కుంగిపోవాలి. ఎవరైనా ఆ ప్రసక్తి తెస్తే భోరుమని ఏడవాలి. అప్పుడైనా కొందరికి.. ఇంతజేసీ ఇంకా ఏడుస్తోంది.. అనిపించవచ్చు. ఇప్పుడైనా పశ్చాత్తాపపడుతోంది.. అని కొందరికి అనిపించవచ్చు. యా.. మీ మనసు కరిగి.. దీనికి కాస్త హృదయం ఉందనిపిస్తుంది. మీరు మేధావులు కదా.. నాకు మనసుందని పసిగడతారు. సంస్కరణ వాదులు కూడా కదా.. నాకు మంచి మార్కులు వేస్తారు ఈ వైవాలో.. సురేంద్ర సర్‌ నిర్ణయానికి మద్దతు లభిస్తుంది. దాంతో నాకు మళ్లీ పెళ్లి అనే మహత్తర కానుక అందుతుంది. గుడ్‌.. నేను మీకు కాఫీ తెస్తాను.. అందాకా ఆలోచించుకోండి.. ఎన్ని మార్కులు వెయ్యాలో..’’ అంటూ లేచి అంతకుముందు ఇచ్చిన మంచినీళ్ల గ్లాసూ, ట్రేనీ తీసుకుని వంటగది వైపు నడిచింది.కాస్త దిగ్ర్భాంతి కలిగినా.. వెంటనే తేరుకున్నాడు 76 ఏళ్ల రాజు.వ్యతిరేకభావం కలగాలి గదా.. కలగలేదు. అప్పటిదాకా అడిగిన ప్రతిదానికీ సౌమ్యంగానే జవాబులిచ్చింది.

ఆ గొంతులోని ఆవేశకావేషాలను గమనించాలని అతనికి తోచలేదు. వచ్చిన దగ్గర నుంచీ జరిగిన మాటలనూ తన అంచనాలనూ కలబోసుకుంటూ కళ్లు మూసుకున్నాడు.‘చనిపోయినవారు నిర్దోషులు. బ్రతికున్నవారు దోషులు.’ ఇటువంటి సందర్భాలలో లోకం సాధారణాభిప్రాయం అది. కారణాలు వెతికే రాజుకి మనుషుల నిస్సహాయతలు కనిపించినంతగా వారి ఉద్ద్దేశాలు కనిపించవు.కాఫీ తీసుకువచ్చి బల్ల మీద ఉంచింది.‘‘నీ కోపం నేను అర్థం చేసుకోగలనమ్మా..’’‘‘లేదు సర్‌.. మీరిది కోపంగానే అర్థం చేసుకోగలరు. తప్పు నాదే. సురేంద్ర సర్‌ మీ గురించి ఇంప్రెస్‌ చేసారనో.. మీరు ఎక్స్‌ ఫాకల్టీ అనో.. ఈ వైవాకు ఒప్పుకున్నాను.’’‘‘తల్లీ..’’ అడ్డుపడబోయాడు.‘‘పెళ్లిమీద నాకే లోభం .. ఆశ.. ఇంకా ఉన్నాయేమో..’’ తన ధోరణి కొనసాగించబోయింది.