‘‘ఒరేయ్‌ అబ్బాయీ, రాత్రినుంచీ గుండెల్లో నొప్పిగా ఉందిరా. మీ అమ్మేమో, ‘వాళ్లని లేపకండి. అలసిపోయి వస్తారు. అదేదో ‘గ్యాస్‌’ నొప్పి అంతే. మీకు ఇదివరకూ వచ్చేదిగా’ అంటూ చల్లనిపాలిచ్చి, అమృతాంజనం రాసింది. కానీ ఏం తగ్గలేదు.’’ అన్నాడు రామారావు కినుకుగా.రాత్రినుంచి తనింత బాధపడుతుంటే ఎవరూ..ముఖ్యంగా భార్య పట్టించుకోలేదని అతనికి కోపం.

‘‘కాఫీ, టిఫిన్‌లు అయ్యాయిగా. ఇప్పుడైనా డాక్టర్‌ దగ్గరకు తీసికెళ్తావా’’ అన్నాడు వ్యంగ్యంగా.‘‘అది ఒట్టి గ్యాస్‌నొప్పే నాన్నగారు. నిజంగా గుండెనొప్పి అయితే మీరింతసేపు ఇలా ఉండలేరు. జెలూసిల్‌ త్రాగితే...’’ అనబోయి ఊరుకున్నాడు శేఖరం.‘అసలే తనని ఎవరూ పట్టించుకోవటంలేదని బాధపడుతున్నాడు తండ్రి. పోనీ కొన్ని డబ్బులు ఖర్చుచేసి చూపిస్తే, ఆయనకీ తమకీ మనశ్శాంతి. ఒకవేళ నిజంగా ఏమైనా ఉండి ఉంటే, డాక్టర్‌కి చూపించక పోతే తరువాత తామూబాధపడాలి’ అనుకున్నాడు.‘‘పదండి’’ అంటూ హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. అనుకున్నట్లే గ్యాస్‌ నొప్పి. కానీ ఈ రోజుల్లో హాస్పిటల్స్‌ మనకున్న రోగాన్ని అంత సింపుల్‌గా చెప్పవుగా. గుండెకి, లంగ్స్‌కి సంబంధించిన అనేకరకాల పరీక్షలుచేసి వేలరూపాయలు వదిలించి చివరకు ‘‘జెలూసిల్‌ సిరప్‌’’ త్రాగమని సలహా ఇచ్చారు.

అదే తాగాడు. గుండెల్లో నొప్పి తగ్గిపోయింది రామారావుకి.నాలుగు రోజులు ప్రశాంతంగా గడిచాయి. ఐదోరోజు ‘‘ఒరేయ్‌ శేఖర్‌. నేను పళ్లు కట్టించుకోవాలనుకుంటున్నానురా. పైన కింద రెండుదంతాలూ ఊడిపోయాయి. మరోనాలుగు పళ్ళు కొంచెం కదులుతున్నాయి. ఏమీ సరిగా తినలేకపోతున్నాను. అప్పారావుగారేమో, పళ్ళన్నీ తీయించేసుకుని, కొత్తవి కట్టించుకోండి. ఒక్కసారే చేయించుకుంటే డబ్బులు కలిస్తొయంటున్నాడు. అదీనిజమేకదా. ఆ మిగిలినపళ్ళైనా ఎలాగో ఊడిపోయేవేగా. మళ్లీ పళ్ళు రావటానికి నేనేం చిన్నపిల్లాడిని కాదుగా’’ అన్నాడు రామారావు.