ముందురోజు రాత్రి పోలీసులకు పట్టుబడిన కుర్రాడు బక్కపల్చగా, లేతగా, నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఏడుకానాల వంతెనపై అతని చేతుల్ని తాడుతో వెనక్కి విరిచికట్టి నిలబెట్టారు. అతని చురుకు చూపు, నూనూగు మీసాలు, హవాయి చెప్పులు, లూజు పేంటు, టెర్రీకాట్‌ షర్టు చూస్తే అతడొక గ్రామీణ హైస్కూల్‌ లేదా హైయ్యర్‌ సెకెండరీ స్కూల్‌ విద్యార్థి అని తెలుస్తోంది. మహా అయితే పద్ధెనిమిదేళ్లు.

పేరుకి ఏడుకానాల వంతెనే గాని, నాలుగే మిగిలాయి. ఎప్పుడో బ్రిటీషువాళ్లు కట్టించినది. నల్లటి రాతికట్టుడు స్తంభాల మీద పిచ్చిమొక్కలూ, గడ్డీ, గాదరా. తుప్పెక్కిన పట్టాలు - స్లీపర్లతో సహా గాలిలో వేలాడుతూ. పక్కనే కట్టిన కొత్తవంతెన మీదనే రైళ్లు వెళతాయి. హౌరా మెయిల్‌ రావడానికి రెండు గంటలుంది. మెడ్రాస్‌ మెయిల్‌ ఎప్పుడో వెళ్లిపోయింది.‘‘పిలవగానే రాకుండా ఎక్కడరా తిరుగుతున్నావు? గాడిదా ... ఇప్పుడింకా ఏవయినా ట్రైన్లు వస్తాయా... సరిగ్గా చెప్పరా, అడ్డగాడిదా!’’ అని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, రైల్వే గేట్‌మేన్ని గద్దించాడు చిరాగ్గా, కోపంగా. ఇన్‌స్పెక్టర్‌ చాలా టెన్షన్‌లో ఉన్నాడని తెలుస్తూనే ఉంది.‘‘గంట లోపల రెండు గూడ్సు బళ్లు రావాలి సార్‌.

ఒకటి అప్పు, ఒకటి డౌను. ఏడు తరవాత మళ్లీ ఈస్టుకోస్టు. అదెప్పుడూ లేటే... దాంతరవాత పూరీ పాసింజరు... అదేరోజెప్పుడొస్తుందో భగవంతుడికే తెలియాలి...’’ చెప్పుకుపోతున్నాడు ఎర్ర, ఆకుపచ్చ జెండాలు చుట్టి చంకలో పెట్టుకున్న సోడాబుడ్డీ కళ్లద్దాల రైల్వే ఉద్యోగి.‘‘సరే, సరే ... నువ్వెళ్లి కేబిన్లో కూర్చో. ఒకవేళ రైలేదయినా వస్తే గనక ఆపుచెయ్యి; నేను చెప్పేంతవరకూ సిగ్నల్‌ ఇవ్వకు.’’‘‘చిత్తం’’ అని వెళ్లిపోయాడు గేట్‌మేన్‌. వెర్రిబాగులవాడిలా కనిపిస్తాడుగాని అతనికంతా అర్థం అవుతూనేఉంది. ‘జనశక్తి’ చదువుతాడు. నాగిరెడ్డి గ్రూపుకి సానుభూతిపరుడు. ఇక్కడేదో తేడాగా ఉందనీ, అర్జెంటుగా ఏదో ఒకటి చెయ్యమనీ పక్కూర్లో ఉన్న కామ్రేడుకి చీటీరాసి, కొడుకు చేతికిచ్చి హడావుడిగా వచ్చాడు.

క్లోజ్రేంజిలో త్రీ-నాట్‌-త్రీ రైఫిల్‌ తో కాల్చి చంపడం కొంచెం అతిగా ఉంటుందని సీఐకి అనిపించింది. పోస్టుమార్టంలో నానా కంగాళీ అవుతుంది. తన సర్వీస్‌ రివాల్వర్‌ వాడడమే పకడ్బందీగా ఉంటుందని అతని భావన. అతనేంచేసినా బాగా ఆలోచించి చేస్తాడని డిపార్టుమెంటులో పేరు గడించాడు. అయినదానికీ, కానిదానికీ అతిగా ఆలోచించి పీకల మీదకి తెచ్చుకుంటాడని కిట్టనివాళ్లంటారు. ఈసారి మాత్రం నిజంగానే మంచి పథకం వేసుకున్నాడు; నమ్మశక్యంగా ఉండే కథనం ఒకటి తయారుచేసి పెట్టుకున్నాడు: