పుట్టుకతోనే భయంకర రూపంతో జన్మించాడు ఆ బాలుడు. అడవిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకనాడు ఓ బాటసారిని అటకాయించాడు. అతడి దగ్గరున్న అద్దంలో తన రూపం చూసుకుని కెవ్వుమని కేకపెట్టాడు. ఆ బుల్లిపెట్టెలో రాక్షసుడున్నాడని భయపడ్డాడు. బాటసారి మెల్లిగా భయం నుండి తేరుకుని ఆ భయంకరరూపి వివరాలన్నీ రాబట్టాడు. ఆనక తెలివిగా ఒక పథకం వేశాడు. ఏమిటా పథకం? అసలెవరా బాటసారి?

=================

నూరుకట్ల పిశాచం కథలు రచనః వసుంధర

అనగా అనగా వింధ్యారణ్య ప్రాంతాల్లో ఓ పల్లెటూరు. ఆ ఊళ్లో శివుడు, పార్వతమ్మ అనే దంపతులున్నారు. వారికి ఎంతకాలానికీ బిడ్డలు కలగలేదు. అప్పుడు ఆ దంపతులు వింధ్యారణ్యంలోనికి వెళ్ళి, వెతికి వెతికి ఓ ఋషిని కనుగొన్నారు. అతడికి తమ బాధ చెప్పుకున్నారు. ఋషి బాగా ఆలోచించి, ‘‘బిడ్డలు కలగాలని బ్రహ్మదేవుడు మీ నొసట వ్రాయలేదు. కొంతవరకూ సాయపడగలను కానీ నా శక్తి పరిమితమైనది. అందువల్ల, బాగా ఆలోచించుకుని చెప్పండి. అప్సరసలా ఉండి, పదహారేళ్ళు మాత్రమే బ్రతికే కూతురు కావాలా, పరమ వికారంగా ఉండే మహాబలుడూ, చిరాయువూ అయిన కొడుకు కావాలా మీకు?’’ అన్నాడు.దంపతులిద్దరూ బాగా ఆలోచించి, ‘‘కాకిపిల్ల కాకికి ముద్దంటారు. ఎలా ఉంటేనేం, కలకాలం బ్రతికే కొడుకునే కోరుకుంటున్నాం!’’ అని చెప్పారు. ‘‘తథాస్తు’’ అన్నాడు ఋషి.

వాళ్ళు తిరిగి తమ ఊరికి వెళ్ళిపోయారు.కొంతకాలానికి ఆ దంపతులకు ఓ కొడుకు కలిగాడు. ఋషి చెప్పినట్లే శిశువు ముఖం చాలా వికారంగా ఉన్నది. ఊళ్లో వారందరూ ఆ శిశువు గురించి విడ్డూరంగా చెప్పుకున్నారు. విషయం గ్రామాధికారికి కూడా తెలిసింది. ఆ దంపతులకూ, గ్రామాధికారికీ చాలాకాలంగా గొడవలున్నాయి. అందుకని ఆయన వాళ్ళింటికి వెళ్ళి ఆ శిశువును బాగా పరిశీలనగా చూసి, ‘‘ఇలాంటి శిశువు పుట్టడం ఊరికి అరిష్టం.

ఈ శిశువు రాక్షస సంజాతుడు. కాబట్టి మీరు ఈ శిశువును అడవిలోనైనా వదిలి పెట్టండి. లేదా మీరు ఈ గ్రామం వదిలి వెళ్ళిపొండి. ఇది నా శాసనం’’ అన్నాడు.ఆ శిశువును చూడగానే రాక్షస సంజాతుడనే అనిపిస్తుంది. శిశువు కురూపే కాదు, భయంకరంగా కూడా ఉన్నాడు. అందుకని ఈ విషయంలో ఊళ్లో చాలామంది గ్రామాధికారిని సమర్థించారు. చూస్తూచూస్తూ, ఏ తల్లిదండ్రులు తమబిడ్డను వదులుకుంటారు? అందులోనూ లేకలేక కలిగిన బిడ్డ కదా! అందుకని ఆ దంపతులు తమ బిడ్డను తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయారు. అక్కడ ఓ కొండగుహలో నివాసం ఏర్పరచుకుని, అడవిలోని కందమూలాలూ అవీ తెచ్చుకుని తింటూ కాలం గడపసాగారు.