మనవడితో కలిసి ఓ తాతగారు విహారయాత్రకు వెళ్ళారు. ఆ పర్వతాలు, ప్రకృతి వారిని ఎంతో పరవశింపజేసింది. ఆ కొత్త వాతావరణంలో కేరింతలు కొడుతూ ఆడుకున్నారు తాతా మనవలు. అంతలోనే మనవడు కాలుజారి గాయపడ్డాడు. కేరింతలు కాస్తా వికటించి ఏడుపు ప్రారంభించాడు మనవడు. ఆ కొండలన్నీ తనను పరిహసిస్తున్నాయని తాతకు చెప్పాడు. నిజంగా అది నిజమే అయితే ఆ మనవణ్ణి కొండలెందుకు పరిహసించినట్టు?

‘సుశీలా...! బెడ్రూములో నా సెల్లు మోగుతున్నట్టుంది కొంచెం తెచ్చిపెట్టు’ ఆఫీసు నుండివచ్చి టీ.వీలో న్యూస్‌ చూస్తున్న ప్రసాదరావు భార్య సుశీలతో అన్నాడు.‘అవ్వ ఆఫీసు నుండి ఇలా వచ్చారో లేదో అప్పుడే ఫోనులు. రోటరీ క్లబ్‌ సెక్రటరీకాదుగానీ, ఇది మొదలు ఇంక రాత్రి పడుకునేవరకు మీకా ఫోనుతోనే సరిపోతోంది’ చిన్నగా విసుక్కుంటూ అంది సుశీల.‘అబ్బా ఏంటి సుశీలా, ఊరికే ఎవరు ఫోను చేస్తారుచెప్పు. ఏదో అవసరం ఉండో లేక ఏదైనా ఇబ్బందితోనో మనకి ఫోను చేస్తారు. అయినా నలుగురికీ చేతనైన సహాయం చెయ్యమని మా తాతయ్య నాతో అనేవాడు. పెళ్ళైన దగ్గర నుండి అది నీకు నేను చెబుతూనే ఉన్నాను’ నవ్వుతూ అన్నాడు ప్రసాదరావు.‘అవును లెండి, రోటరీ క్లబ్‌ సెక్రటరీగారు ఊరికే సాయం చేస్తానంటే దారిన పోయే దానయ్య కూడా మీ సాయం కోసం వస్తాడు’ భర్త చేతికి ఫోను ఇస్తూ అంది సుశీల.

‘ఏమోయ్‌ ఇది నువ్వు అనుకుంటున్నట్టు వేరెవరి ఫోనో కాదు, స్వయానా మన పుత్రరత్నం ఫోను అమెరికా నుండి ‘అమెరికా’ అన్న మాట సాగదీస్తూ అన్నాడు ప్రసాదరావు.‘చాల్లెండి, వేళాకోళాలు ఆపి ముందు ఆ ఫోను ఎత్తండి, వాడు మాత్రం ఊరికే చేస్తాడా ఏమిటి’ అంది సుశీల.‘నిజమే నువ్వన్నది కరక్టే. ఓ... ఇవాళ శనివారం కదా! వీకెండ్‌... అందుకే పాపం అబ్బాయిగారికి తీరిక దొరికి మనం గుర్తొచ్చి ఉంటాం, అందుకే ఫోను చేశాడు. వారమంతా గుర్తురాని తల్లిదండ్రులు వారాంతంలో మాత్రం గుర్తుకు వస్తారు’ భార్యతో అని, ‘ఊ...చెప్పరా రవీ, ఎలా ఉన్నారు? మనవడు ఏం చేస్తున్నాడు? వాడి తెలుగు ఎంతవరకు వచ్చింది?’ కొడుకు రవిని అడిగాడు.