పుట్టింటికెళ్ళిన నీ తల్లిని పొలిమేర దాటి రాకుండా గ్రామదేవత అడ్డం పడుతోందని చెప్పాడు తండ్రి. నా చిన్నప్పట్నుంచీ ఇలాగే చెప్పావ్‌, ఈ కథలాపి అసలు నిజం చెప్పు, అమ్మ ఏమైంది? నిలదీశాడు కొడుకు. కానీ తండ్రినోట మళ్ళీ అదే మాట. మూఢనమ్మకాలకు కట్టుబడిన తండ్రితో వాదించి లాభంలేదని స్వయంగా తనే తాతగారి ఊరెళ్ళాడు. ఇంతకూ తండ్రి చెప్పింది నిజమేనా లేక ఆ కొడుక్కి సరికొత్త నిజాలేమైనా తెలిశాయా?

ఆరెకరాల్‌ చేనిస్తా–అంటుమామిడి తోపిస్తా–పోయమ్మా నా కూతురా – పోయింటికి కీర్తితేవమ్మాఆరెకరాల్‌ చేనిస్తా–ఆవులప్పను నీజతకిస్తా–పోయమ్మా నాకూతురా–పోయూరికి కీర్తితేవమ్మాపోనమ్మా నేను పోనమ్మ–పోతే తిరుగుటలేదమ్మా–పోనమ్మా నేను పోనమ్మ–పోతే తిరుగుట లేదమ్మాఆరుమంది అన్నగార్లూ–కడగొట్టోడే గంగులప్ప–వానికి నాకు కాదమ్మా–పోనమ్మ నేను పోనమ్మాఏడుమందే అక్కసెల్లెళ్ళు–కడగొట్టుదీ కమలమ్మ–దానికి నాకు కాదమ్మా–పోనమ్మా నేను పోనమ్మానాగరబిళ్ల సేపిస్తా–నాగులప్పను నీజతకిస్తా–పోయమ్మ నా కూతురా..పోనమ్మా నేను పోనమ్మా...మంద్రస్వరంలో తనలోతనే తాదాత్మ్యం చెందుతూ పాడుకుంటున్న జానపదగీతాన్ని, గదిలోకి ఎవరో వచ్చిన అలికిడవడంతో పాట ఆపేసి ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు గురుమూర్తి. ఎదురుగా తననే తదేకంగా చూస్తున్న మధుని చూడగానే కాస్త తబ్బిబ్బయ్యాడు.మధు చిన్నగా నవ్వుతూ తండ్రిపక్కకెళ్ళి కూర్చుని, ‘‘ఈ పాటంటే అమ్మకి ఇష్టంకదా నాన్నా..’’ అన్నాడు.

నెమ్మదిగా తలూపాడు గురుమూర్తి. తండ్రి చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ, ‘‘ఇవాళ ఏమైనా సరే నువ్వు నాకు అమ్మగురించి చెప్పి తీరాల్సిందే’’ అన్నాడు మధు.చిన్నగా నిట్టూర్చాడు గురుమూర్తి. ‘‘కొత్తగా ఏముంది చెప్పడానికి నీకు తెలిసిందేకదా. మీ అమ్మకి అత్తారింటికి రావడం కుదరదు అంతే..’’‘‘అదే ఎందుకు?’’ కాస్త గట్టిగా అడిగాడు.‘‘వాళ్ళ ఊర్లో ఆడపిల్లలు అత్తారింటికి వెళ్ళరట, ఊహూ..ఆ గ్రామదేవత ఆ ఊరు ఆడపడుచులను గ్రామందాటి పోనివ్వదట. అందుకే ఎంత రావాలనుకున్నా మీ అమ్మ రాలేకపోయింది’’.తలపట్టుకున్నాడు మధు. ‘‘నా చిన్నప్పటినుంచీ ఈమాట చెబుతూనే ఉన్నావు. నేను వింటూనే ఉన్నాను. ఇప్పుడు నాకు పాతికేళ్ళు. చదువుపూర్తయి ఉద్యోగంలో జేరబోతున్నాను. ఇంకా నన్ను మభ్యపెట్టాలని చూడకు. నీకూ, అమ్మకీ మధ్య అసలు ఏం జరిగిందో ఇవాళ నువ్వు చెప్పవలసిందే’’ స్థిరంగా అన్నాడు మధు.