ఏదీ నోరు తెరచి అడగలేడతను . ఏ రుచి, స్పర్శానుభవం తెలియనివాడు . మానసిక ఎదుగుదల లేనివాడు. తల్లి ఉన్నంతవరకు గడిచిపోయింది . ఇప్పుడామె అవసాన దశకు చేరింది . అందుకే అతడి అన్నలకు కబురంపింది . వీడు మన ఇలవేల్పు , వీడు లేకపోతే మీరు లేరు, తర్వాత మీ ఇష్టం అంటూ ఓ రహస్యం వెల్లడించి కన్నుమూసింది . ఇంతకీ ఆ తల్లి చెప్పిన రహస్యమేంటి ? అతని అన్నయ్యలు ఏం చేశారు?

‘ఇప్పటివరకు నేను ఉన్నాను కాబట్టి, నీకు ఏ సమయానికి ఏం కావాలో నువ్వు అడక్కుండానే అన్నీ చేసి పెడుతున్నాను. నేను పోయిన తర్వాత రేపటి నీ పరిస్థితి తలచుకుంటూ ఉంటే..’’ నోట మాటరాక ఉబికి వస్తున్న దుఃఖంతో గొంతు పొలమారినట్టైంది అన్నపూర్ణకి.మంచం ప్రక్కనే కుర్చీలో కూర్చొని ఉన్నాడు బాలు. సుమారు ఇరవై సంవత్సరాలు ఉంటాయి. అతని మొహం భావరహితంగా ఉంది. జరుగుతున్నదేదీ తనకు సంబంధం లేనట్లున్నాడు. మరణం,దుఃఖం,ఆనందం ఏవీ తెలియనట్లున్నాడు.అన్నపూర్ణ బాలు చేతిని తన చేతిలోకి తీసుకుని ‘‘నన్ను క్షమించరా! మా స్వార్థం కోసం చేసిన పని, నిన్ను జీవమున్న శవంలా చేసింది, దానికి భగవంతుడు పై లోకంలో ఏ శిక్ష విధిస్తాడో’’ కారే కన్నీటిని ఎడమ చెయ్యి ఎత్తి అతికష్టం మీద కొంగుతో తుడుచుకుంది.

తల్లి మాట్లాడే మాటలతో తనకేసంబంధం లేనట్లు బాలు వెర్రిచూపులతో ఆమెనే చూస్తున్నాడు. మనిషి అందంగా ఉంటాడు. వయసు సుమారు ఇరవై సంవత్సరాలుంటాయి కానీ మెదడు ఎదగలేదు. అయిదు సంవత్సరాల బాలుడికి ఉండవలసిన తెలివితేటలు కూడా అనుమానాస్పదమే.ఆ గదిలో ఆ ఇద్దరే ఉన్నారు. ఆ ఇల్లంతా ఇద్దరే ఉంటారు. అంతుబట్టనిజబ్బుతో చిక్కిశల్యమై మంచానికే పరిమితమైపోయింది అన్నపూర్ణ. ఇద్దరి ఆలనాపాలనా చూడటానికి అన్నపూర్ణ తమ్ముడు రాజశేఖర్‌ ఓ మనిషిని ఏర్పాటుచేశాడు. రాజశేఖర్‌ కూడా ఆ ఊళ్ళోనే ఉంటాడు. ఆతనొక వ్యాపారస్థుడు.గుమ్మం దగ్గర అలికిడి అయింది. అన్నపూర్ణ తలతిప్పి చూసింది. గుమ్మంలో రాజశేఖర్‌.