చిక్కడపల్లి, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మికి కళాప్రపూర్ణ డా. తెన్నేటిలత- వంశీ సాహితీ పురస్కారం-2019 ప్రదానం చేయనున్నట్లు వంశీ మేనేజింగ్‌ ట్రస్టీ సుంకరపల్లి శైలజ తెలిపారు. త్యాగరాయగానసభ, వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌, లేఖిని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 30న సాయంత్రం 5 గంటలకు గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ప్రముఖ రచయిత్రి తెన్నేటి లత మేనకోడలు జలంధరా చంద్రమోహన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ప్రముఖ రచయిత్రి డా. వాసా ప్రభావతి సభాధ్యక్షత వహిస్తారు. ఈ సభలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, రచయిత్రి డా. చిల్లర భవానీదేవి, వంశీ సంస్థల అధినేత డా. వంశీ రామరాజు, ప్రముఖ రచయిత్రి డా. తెన్నేటి సుధ పాల్గొంటారన్నారు. అత్తలూరి విజయలక్ష్మి ఇప్పటికి 23 నవలలు, 200కుపైగా కథలు 200 నాటికలు, వ్యాసాలు, రచించారన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ నటించిన చిత్రాలనుంచి సుజారమణ, కళ్ళేపల్లి మోహన్‌, బాపిరాజు సినీ సంగీత విభావరి సమర్పిస్తారని ఆమె వివరించారు.