హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 7, ఆంధ్రజ్యోతి:కేన్సర్‌ రోగులకు సంతోషకరమైన జీవితం అందించేందుకు కృషి చేస్తోన్న స్పర్శ్‌ హోస్పైస్‌కు నిధుల సేకరణలో భాగంగా ఈ నెల 21న శిల్పకళా వేదికలో శంకర్‌ మహదేవన్‌ సంగీత విభావరి నిర్వహించబోతున్నారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ బంజారాహిల్స్‌ నేతృత్వంలో జరుగనున్న ఈ కార్యక్రమ వివరాలను తెలియజేసేందుకు జూబ్లీహిల్స్‌లోని హోటల్‌లో ఓ సమా వేశం ఏర్పాటుచేశారు. సంగీతకారుడు మోహన్‌ ఇమ్మాడి, సంగీత దర్శకులు శశి ప్రీతమ్‌, రఘు కుంచెతో పాటుగా రోటరీ క్లబ్‌ ఆఫ్‌ బంజారా హిల్స్‌ సీఈవో రామ్‌ మోహన్‌ రావు, అధ్యక్షుడు బి.మల్లికార్జున్‌, ట్రస్టీలు సురేష్‌రెడ్డి, మనోహర్‌ రెడ్డి, అమిత్‌ అగర్వాల్‌, డాక్టర్‌ సుబ్రమణ్యం పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రామ్‌ మోహన్‌రావు మాట్లాడుతూ ప్రస్తుతం 14 పడక లతో బంజారాహిల్స్‌లో నడుపుతున్న సదుపాయాన్ని 70 పడకల హోస్పైస్‌ సదుపాయంగా మార్చడంలో భాగంగా నిధుల సేకరణ కోసం ఈ కార్య క్రమం చేస్తున్నాం. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభ మయ్యాయి. త్వరలోనే పూర్తి చేయనున్నాం. ఈ సంగీత కార్యక్రమాన్ని ఇయర్లీ ఈవెంట్‌గా చేయాలనేది ప్రయత్నం. దాదాపు 50 కోట్ల రూపాయల కార్పస్‌ ఫండ్‌ సృష్టించడం ద్వారా రోగులకు పూర్తి ఉచితంగా సకల సదుపాయాలూ అందించనున్నాం అన్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్‌మైషోలో తీసుకోవచ్చని రోటరీ క్లబ్‌ ఆఫ్‌ బంజారాహిల్స్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ అన్నారు.