పంజాగుట్ట, డిసెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఋషిపీఠం చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ రచించిన శివపదం కీర్తనలకు దేశ విదేశాలకు చెందిన నృత్య గురువులు తమ శిష్యులతో కలిసి నృత్యాలను ప్రదర్శించనున్నారు. ఈనెల 30న కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో నృత్యరూపకాలను ప్రదర్శించనున్నట్లు ట్రస్టీ మారెపల్లి సూర్యనారాయణ, కార్యనిర్వహణ అధికారి కె. భాస్కర రమణమూర్తి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ప్రవాసభారతీయ నృత్య విద్వాంసులచే కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, తదితర నృత్య రీతులను ప్రదర్శించనున్నారని వారు తెలిపారు. అమెరికా కాలిఫోర్నియా బే ఏరియాకు చెందిన గుండ్లాపల్లి వాణి పర్యవేక్షణలో అమెరికా, సింగాపూర్‌ తదితర ప్రాంతాలకు చెందిన నృత్యగురువులు తమ శిష్యులతో కలిసి ఇక్కడికి విచ్చేసి శివపదంలో పాల్గొంటారన్నారు. 

నృత్య రూపకర్తలు, నాట్య శాస్త్ర అధ్యాపకులు కాలిఫోర్నియా భాస్కర్‌ ఆర్ట్స్‌ అకాడమీకి చెందిన మీనాక్షి భాస్కర్‌, ది టెంపుల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌కు చెందిన చందన వేటూరి, నాట్య తరంగ్‌ కూచిపూడి కళాక్షేత్రానికి చెందిన రాజేష్‌ చావలి, నృత్య కళా డ్యాన్స్‌ స్కూల్‌కు చెందిన రసికా దేశ్‌ పాండే, సింగపూర్‌కు నృత్యాంతర్‌, ఒడిస్సీ డ్యాన్స్‌ అకాడమీకి చెందిన మధులిత మహాపాత్ర, నగరంలోని శ్రీ సాయినృత్య తరంగ్‌కు చెందిన లక్ష్మీ ప్రసున తమ శిష్య బృందాలచే ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు. ఐఏఎస్‌ అధికారి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, ప్రముఖ నర్తకి శోభానాయుడు, ఋషిపీఠం అధ్యక్షుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, గుండ్లాపల్లి వాణి, రవిశంకర్‌లతో పాటు పలువురు హాజరవనున్నారు. సమావేశంలో ట్రస్ట్‌ మేనేజర్‌ శేషసాయి పాల్గొన్నారు.