హైదరాబాద్‌: వరంగల్‌కు చెందిన ‘సృజన లోకం’ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీ వేదికగా ప్రపంచస్థాయి కవిత్వ ఉత్సవం జరగనున్నది. ఈ వేడుకలకు పలు దేశాలకు చెందిన సుమారు 40 మంది ప్రసిద్ధ కవులతోపాటు దేశం నలు మూలల నుంచి మరో 60 మంది కవులు తెలుగు రాష్ర్టాల నుంచి 50 మంది కవులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కవి రామా చంద్రమౌళి మంగళవారం ఈ విషయం తెలిపారు. ఈ వేదిక ద్వారా భిన్న రంగాల ప్రముఖులను సత్కరించనున్నట్లు చెప్పారు. ప్రసిద్ధ కవులు ఆచార్య ఎన్‌.గోపి, పి.శివారెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌, తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, సీఎంవో ఓఎ్‌సడీ దేశపతి శ్రీనివాస్‌, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, నవ్య వారపత్రిక ఎడిటర్‌ ఎ.ఎన్‌.జగన్నాథశర్మ తదితర ప్రముఖ కవులతోపాటు జాతీయస్థాయిలో ప్రసిద్ధులైన కవులు, విదేశీ కవులు ఈ ఉత్సవంలో పాల్గొంటారని తెలిపారు. ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తదితర ప్రముఖులను కూడా వేడుకలకు ఆహ్వానించినట్లు ఆహ్వాన సంఘం కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాసరావు చెప్పారు.