శేషేంద్ర ఎంత ప్రతిస్పందనాత్మకమైన, విలక్షణమైన వ్యక్తిత్వమంటే ఆయనకు నిద్రపట్టేది కాదు. ఎంతోమందిని కృతక నిద్రాణ స్థితిలోకి తీసుకువెళ్ళి సూచనలివ్వగలిగిన నేను ఒకసారి గంటసేపు ప్రయత్నించినా ఆయన్నించి స్పందన పొందలేకపోయాను; జాగ్రదవస్థ నుంచి తప్పించలేకపోయాను. ఆయన మనస్సు సదా జాగృతంగా ఉండేది. అలా ఉన్నప్పుడు మాత్రం ప్రతి విషయానికీ ఆయన స్పందించేవారు.

1927, ప్రభవ నామ సంవత్సరం, అక్టోబర్‌ 20న జన్మించిన గుంటూరు శేషేంద్ర శర్మ స్వాతంత్ర్యోత్తర తెలుగు సాహిత్యంలో ఒక విలక్షణమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 1927 నాటికే ‘శేషేంద్ర’ అనే వినూత్న నామాన్ని పొందారంటే ఆయన కుటుంబం సాంస్కృతిక చైతన్యం కలదనే విషయం బోధపడుతూ ఉంది. వారింట్లోని విస్తృతమైన గ్రంథాలయంలోని అక్షరసంపద శేషేంద్రని ఎలా తీర్చిదిద్దిందో ఆయనే ఒక వ్యాసంలో వివరించారు. తెలుగు సాహిత్యంలోంచి మాత్రమేకాక సంస్కృత కావ్యాలనుంచి, అలంకార గ్రంథాలనుంచి వందలకొద్దీ ఉదాహరణల్ని గుప్పించి అనర్గళంగా మాట్లాడే శక్తి శేషేంద్రకుండేది. ఇలాంటి ప్రతిభాపాండిత్య సమ్మేళనాన్ని విశ్వనాథ సత్యనారాయణ, పుట్టపర్తి నారాయణాచార్యులవంటి ఏకొద్దిమందిలోనో తెలుగువారు దర్శించారు.
 
‘యుగకవి’, ‘విప్లవ కావ్య విధాత’, ‘అభినవ మల్లినాథుడు’ లాంటి ప్రశంసల జోలికిపోకుండా శేషేంద్ర సాహిత్య ప్రస్థానాన్ని నిర్మొహమాటంగా, వస్త్వాశ్రయంగా విమర్శించిన దాఖలాలు కన్పించటం లేదు. ఆవంత్స సోమసుందర్‌ గారి ‘శేషేంద్రజాలం’ భావుకతతో కూడిన ప్రశంసలాగా అనిపించింది కాని విశ్లేషణా త్మక విమర్శగా అనిపించలేదు.
 
శేషేంద్రను గురించే కాదు; తెలుగులో ఏ రచయితను గురించికూడా ప్రామాణికమైన విమర్శకాని, విశ్లేషణకాని తక్కువ గానే వెలువడింది. శేషేంద్రను గురించి కొన్ని సిద్ధాంత గ్రంథాలు వచ్చాయికాని అవి ఎన్నో వివరాలను ఇవ్వగలిగినా శేషేంద్ర రచనా విధానాన్ని ప్రయోగాత్మకంగా విశ్లేషించినట్లు కనిపించదు. ఆర్‌.ఎస్‌.సుదర్శనం, తుమ్మపూడి కోటీశ్వరరావు, జి.వి.సుబ్రహ్మణ్యం లాంటి విమర్శకులు శేషేంద్ర ప్రతిభాన్విత అభివ్యక్తిని ప్రదర్శించ టానికి ప్రయత్నించారు కాని సుదీర్ఘ చర్చ ద్వారా దాన్ని ప్రతిష్ఠించటానికి పూనుకోలేదు. దీనివల్ల నిజానికి శేషేంద్రలాంటి వైవిధ్యమయ వ్యక్తి సాధించిన సాహిత్య పరిశ్రమను మనం లోకానికి తెలియ జేయలేకపోయామనిపిస్తుంది.
 
శేషేంద్రని గురించి రాసినవారిలో చాలామంది ఆయనతో ఉన్న వ్యక్తిగత పరిచయాన్ని, మాట్లాడే తీరుని, చూపే అభిమానాన్ని పురస్కరించుకొని రాసినవారేకాని, ఆయన రచనల్ని, వాటి నేపథ్యాన్ని, వాటి విజయ వైఫల్యాల్ని విశ్లేషించటం జరగలేదు. ఆయన సుముఖంలో ఎంతోమంది పండితులు, సాహిత్యవేత్తలు గంటలకొద్దీ సాహిత్య చర్చలో పాల్గొనేవారు. ఒక్కరైనా ఆయన రచనల్ని విశ్లేషించి ఏ సందర్భంలో అర్థగాంభీర్యం, అన్వయం అమరిందో, ఏ సందర్భంలో విఫలమయిందో ధైర్యంగా చెప్పిన వారు కానరాలేదు.
 
శేషేంద్రతో వ్యక్తిగతంగా కలిగిన పాతికేళ్ళ పరిచయం, అనుబంధం, ఆత్మీయత అనేక విషయాలలో ఆయనతో చర్చించే అవకాశాన్ని నాకు కల్పించాయి. ఆయనది ఎంత ప్రతిస్పందనాత్మక మైన, విలక్షణమైన వ్యక్తిత్వమంటే ఆయనకు నిద్రపట్టేది కాదు. ఎంతోమందిని కృతక నిద్రాణ స్థితిలోకి తీసుకువెళ్ళి సూచనలివ్వ గలిగిన నేను ఒకసారి గంటసేపు ప్రయత్నించినా ఆయన్నించి స్పందన పొందలేకపోయాను; జాగ్రదవస్థ నుంచి తప్పించలేక పోయాను. ఆయన మనస్సు సదా జాగృతంగా ఉండేది. అలా ఉన్నప్పుడు మాత్రం ప్రతి విషయానికీ ఆయన స్పందించేవారు. ‘కవిసేన మేనిఫెస్టో’ విషయంలో కాని కవితాభివ్యక్తిలో కాని ఒక క్రమాన్ని పాటించి ఉంటే బాగుండేదని, అర్థ వ్యక్తీకరణ మరింత సూటిగా సౌలభ్యంతో కూడి ఉంటే సుకరంగా ఉండేదని నేనెప్పు డైనా అంటే ఆయన అంగీకరించేవారు.
 
శేషేంద్రగారి అసమాన పాండితీ వైభవంతో ఎవరికీ పేచీ లేదు. తంగిరాల సుబ్బారావుగారి ‘అంకమ్మ కథలు’ పుస్తకాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్సభాంగణంలో ఆయన ఆవిష్కరించారు. జానపద సాహిత్యానికి సంబంధించిన పుస్తకాన్ని గురించి ఒక ఆధునిక కవి ఏం మాట్లాడతాడని కొందరు సందేహించి ఉంటారు. కిక్కిరిసిన నాటి సభలో గంటకుపైగా ఉపన్యసించి వేదాల నుంచి, సంస్కృత భారతం నుంచి అలవోకగా శ్లోకాలను ఉటంకిస్తుంటే ఆశ్చర్యపడటం శ్రోతల వంతు. శేషేంద్ర శేముషీ వైభవం అది.
 
శేషేంద్రను అనుభూతి కవిగా, విప్లవ కవిగా, నవ్య సంప్రదాయ కవిగా ముద్ర వెయ్యటం ఆయన పట్ల అన్యాయమే అవుతుంది. ఏ ముద్రా లేకుండా ఒక కవికి ఉండే అభివ్యక్తి సామర్థ్యాన్ని పరీ క్షించటం మనకు అలవాటు లేదనిపిస్తుంది. ఒక కవి ఏయే కాలాలలో ఏయే నేపథ్యాలతో, ఏయే ప్రభావాలతో సృజన శక్తిని ప్రదర్శిస్తాడు అనే విషయాన్ని పరిశీలించి నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. పద్య శిల్పాన్ని చక్కగా నిర్వహించిన శేషేంద్ర వచన కవిత్వానికి ఎందుకు మారారనే విషయాన్ని ఆయన జీవన చరిత్ర నేపథ్యంతో, తర్వాతి కాలంలో ఆయనపై బోదిలేర్‌ లాంటి కవుల ప్రభావాలు, పరిచయాల నేపథ్యంతో పరిశీలించవలసి ఉంటుంది. ‘‘పద్యం ఎందుకు మానేశారు’’ అని నేను ఒక సందర్భంలో అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా జవాబు చెప్పారు: ‘‘నేను గ్రాంథిక భాష నుంచి వ్యావహారికానికి మారాను. ‘ఋతుఘోష’లాంటి కావ్యాలలో నేను సమాజం పట్ల నా స్పృహను ప్రదర్శించినా సమాజపర మైన భావాల వ్యక్తీకరణకు వ్యావహారిక భాషే సరైనదనిపించింది. పద్యాలలో వ్యావహారిక భాష కుదరదు. అందుకే మానేశాను.’’
 
శేషేంద్ర రచనలు అనేక భాషల పాఠకులకు పరిచమయయ్యాయి. ఇతర భాషల్లో చదువరులకు అందినప్పుడు మాత్రమే మన రచనల్లో విశ్వజనీనత స్పష్టమవుతుంది. నేను ‘గొరిల్లా’ కన్నడ అనువాదాన్ని ప్రఖ్యాత కవి, విమర్శకుడు, ఆంగ్లాచార్యులు శంకర మొకాశి పుణేకర్‌కు చూపించినపుడు ఆయన ‘శేషేంద్ర భావాలతో నేను ఏకీభవించను. కాని ఆయన కవితాభివ్యక్తిని మెచ్చుకోకుండా ఉండలేను,’’ అన్నారు.
నా దగ్గర గ్రీకు భాష మాతృభాషగా కల్గిన ఒక విద్యార్థినికి శేషేంద్ర ‘నాదేశం - నా ప్రజలు’ గ్రీకు అనువాదాన్ని బహూకరించాను. ఆవిడ దాన్ని గురించి నాకు ఉత్తరం రాస్తూ నోబెల్‌ పురస్కార గ్రహీతల్లో గమనించిన అత్యున్నత కవితాభివ్యక్తి శేషేంద్రలో ఉందని అభిప్రాయపడింది. ఒక తెలుగు కవిని గురించి ఒక విదేశీ యువతి ఇలాంటి అభిప్రాయం వెలిబుచ్చినందుకు గర్వం కలిగింది.
 
(అక్టోబర్‌ 20న శేషేంద్ర 92వ జయంతి)
 
ఆర్వీయస్‌ సుందరం
98440 15759