కాలం

తను వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది
మెట్లన్నీ అతి కష్టంపై దిగి
ఇక, ఆయాసంతో రొప్పుతో అమ్మ -
 
అగ్నికీలలవలే ఎండ; గాజుపెంకులు ఏవో
రాలినట్లు, దారంతా మెరుస్తో
దిగబడే అంచులు లేని వేసవి కాంతి -
 
గేటు పక్కగా పెరిగిన వేపచెట్టు; ఎన్నెన్నో
ఆకుల్ని రాల్చి, తనలో తానే
వొదిగి వొంగీ, ఇక ముడతలు పడితే
 
పక్షులు కూడా లేవు ఇప్పుడు. ఉన్నవి,
ఖాళీ అయిన గూళ్ళూ, ఎండిన
కొమ్మలూ. ఎప్పుడైనా గాలి వీస్తే రాలే
 
సన్నటి దుమ్మూ, బెరడు చీలికల్లో చేరే
అంతులేని ఒంటరి పగళ్ళూ
తేమ కూడా లేని కరకు రాత్రుళ్ళూ -
***
 
తను వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది
ఇక, పంటి బిగువున మరి
తనని తాను ఆపుకుని, తలని
 
తిప్పుకున్న అమ్మ కళ్ళలో, వణికిపోతూ
పగిలిపోయే నీటి
బుడగలు: గుక్కపట్టే శిశువులు!
 
ముగింపు
ఇక నడవలేదు తను. కొమ్మలు
విరిగే చప్పుడు
మోకాళ్ళల్లో, కళ్ళ నీళ్ళల్లో...
 
పాత గుడ్డలు వేసిన ఓ వెదురు
బుట్ట ఇప్పుడు తను,
మూలగా, నీడల్లో, చీకట్లలో...
 
ఏం ప్రయోజనం నీ కవిత్వంతో?
వెలిగే దీపాలను
చేయగలవా మళ్ళా కళ్ళను?
 
అంతే చివరికి! మడతలు పడిన
దుప్పటీ, నేలపై
ఓ చాపా, తలగడ కింద మరి
 
అమృతాంజనూ, ఓ నిద్రమాత్రా
వొదులైన వక్షోజాల
వెనుక, లీలగా మిణుకుమనే
 
ఓ హృదయ తారక! అంతే, ఇక -
చివరికి. ఓ రాత్రై
ఎటో వెళ్ళిపోతోంది అమ్మ!
 
ఎక్కడ
అమ్మ పుట్టిన రోజు; మరి మబ్బులు పట్టి
వీచే గాలి బయట: దుమ్ము -
ఆవరణలో రాలి, దొర్లుతో వేపాకులు,
 
ఇంటి వెనుక, తీగకు రెపరెపలాడుతో ఒక
ఊదా రంగు చీర: పాతదే,
ఇప్పుడు ఇల్లు తుడిచేందుకు వాడేదే,
(అది అమ్మదే: వెలసిపోయి, చిరిగి...)
 
ఒక జామచెట్టు ఉండేది అక్కడ: ఎన్నెన్నో
పళ్ళను ఇచ్చిన చెట్టు. ఇక
ఇప్పుడు, అక్కడంతా కరకు బండలు
పరచిన నేల. (పగిలిన అరిపాదాలై...)
 
ఎన్నో వెళ్ళిపోయాయి: ఎంతో ఏపుగా సాగి
అల్లుకున్నఒక బీరతీగా, ఊగే
మల్లెపందిరీ, వెన్నెల్లో వొణికిన రాత్రీ...
 
ఎన్నో వెళ్ళిపోయాయి. ఋతువులై కొన్నీ,
అశ్రువుల్లో మునిగిపోయి కొన్ని,
చీరేయబడిన పిల్లిపిల్లలై మరికొన్నీనూ...
***
 
అమ్మ పుట్టిన రోజు ఇవాళ. బయట, మరి
మబ్బులు పట్టి, హోరున
గాలి. ఇల్లంతా ఖాళీ. కళ్ళల్లో దుమ్ము -
 
మరి, ఇక్కడ ఉండాల్సిన అమ్మ ఎక్కడ?
 
**** శ్రీకాంత్‌