ఖాళీ అయిన మౌనం నుండి

కనులు మూయని నిద్ర నుండి
నిండిన నింగి దుఃఖాగ్నిని అద్ది
సమాంతర రేఖలకు ఎర్రని చెమటలు పట్టిస్తాను.
 
కొత్త ఉదయాల్ని చూడని జాడ్యాలను
రూప వివక్షల దుర్మార్గాల చరిత్రపుటలను త్రిప్పి
మనసుల గోడలకు అడ్డం బెడ్తాను
 
మారని మాయాలోకపు రాతిపై
ఆడనో మగనో బేతాళాలు బేతాళాలుగా
ఆశల రెప్పల కుట్లన్నీ చేతిసంచికో
చెప్పుల గూడలకో అతికిస్తాను.
 
రక్తధారల తడిచిన మబ్బుముక్కల్ని
నెర్రెలు బారిన నేలలో పాతి,
నిజాన్ని వెంటేసుకొని, అబద్ధాల్ని ఒక్కటిజేసే అక్షాంశానికి
వాడి నయవంచనను కట్టే ఛిద్రిత శిల్పాన్నౌతాను.
 
ఆగని వేదనల ధారలు ఉప్పొంగుతుంటే
దిక్కుదిక్కున మొరబెట్టుకుంటూ,
ఒకానొక దిశకు నన్ను నేను బదిలీ చేసుకుంటాను.
 
పసికిరణాలను కాల్చే సుడిగుండాల్ని
ఖండఖండాలుగా తెగనరకమని, తూర్పుగాలుల్ని ముద్దజేస్తూ
భువనానికి రుతుగీతాలను నేర్పిస్తాను.
 
ముద్దులు తీరని పసితనానికి ముదిరిన పిశాచహేలల్ని ఉసిగొల్పే
వాడి ద్వంద్వ వైఖరుల్ని పసిగట్టే నిఘానేత్రాన్నవుతాను.
రాలిపడినపువ్వుగా, బూడిదకుప్పగా రెండువైపుల పదునుదేలుతాను.
    
నెలవంకకు దిద్దిన రంగులతో సుదీర్ఘయాత్రకు
హృదయాలు నడిచి వెళ్ళగలిగే వంతెననేసి
కమిలిపోని బింబాల్ని నక్షత్రాలకు గట్టి
దారులేని సంధియుగంగా సాగిపోతాను.
 
రాయని నిర్వచనాల మరణశాసనాల్ని లిఖిస్తూ
చాపచుట్టలో వాడి పాపపు శవాన్ని ఊహిస్తాను.
నేను కాలాన్ని, తిరిగిరాని జీవితాన్ని.
నిస్తేజాన్ని సహించని, అమ్ముల పొదిని.
అందాల వెన్నెలలు లేని అడవి దగ్ధహృదిని!
 
కొండపల్లి నీహారిణి