ఆకలి అవమానాలు భరించిన నిరుపేద రజక కుటుంబంలోంచి ఎదిగి వచ్చిన రచయిత, జర్నలిస్ట్‌ కె. రాజన్న. హత్యానేరం ఆరోపణపై కారాగారవాసం, దిగువ కోర్టు ఉరిశిక్ష విధించింది, నిస్సహాయతతో ఒంటరితనంతో ‘డెత్‌సెల్‌’లో రోజులు లెక్కబెట్టినవాడు. డిప్యూటీ జైలర్‌ ప్రోత్సాహంతో హైకోర్టుకు అపీల్‌ చేసుకోగా, ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చి తీర్పునిచ్చింది. జైలులోనే విద్యాభ్యాసాన్ని కొనసాగించి ఉన్నత చదువుల్లో డిగ్రీలు సాధించాడు. తన కఠోరమైన జీవితానుభవాలను స్వీయాత్మక రచనగా హిందీలో ‘ఫాఁసీ’ (ఉరి) శీర్షికన నవలగా వెలువరించాడు. బయటి ప్రపంచంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుగా స్థిరపడిపోయాడు. 
 
గత సంవత్సరం రాజన్న ‘ఫాఁసీ’ నవల ఆవిష్కరణ సందర్భంగా హిందీలోని ఆ నవలను ఆసాంతం చదివాను. మన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో, అట్టడుగు స్థాయిలో జన్మించిన చాకలి పిల్లవాడు, కాలాంతరాన ఉరిశిక్ష నీడలోంచి బయటపడి రచయితగా ఎదిగిన సాహస గాథ ఇది. రాజన్న తన దుర్భరమైన బాల్యాన్ని, భూస్వామి ఆగడాలను ఎదిరించి, కఠిన కారాగార శిక్ష అనుభవించిన వృత్తాంతాన్ని నవలగా రూపొందించే ప్రయత్నం చేసాడు. ఇది చదువుతుంటే ఫ్రెంచి నవల ‘పాపిలాన్‌’ వంటి రచనలు గుర్తొస్తాయి. 
 
రాజన్న మాతృభాష తెలుగు, మరాఠీలో ప్రాథమిక విద్య, ఆ తర్వాత యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ సారస్వత పరిషత్తు తెలుగు పరీక్షలు రాసి తెలుగు, ఢిల్లీ జర్నలిజం స్కూలు నుంచి డిప్లొమా, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ (ఓపెన్‌) నుంచి హిందీలో ఎమ్‌.ఎ పట్టా పొందాడు. మరాఠీ, తెలుగు, హిందీతోపాటు ఇంగ్లీష్‌ నేర్చుకొన్నాడు. 
 
టూకీగానైనా ఈ నవల ఇతివృత్తాన్ని తెలుసుకుంటే, మన సామాజిక వ్యవస్థలో నిస్సహాయ జీవులు జైళ్లల్లో చేయని నేరాలకు ఎలా బలైపోతున్నారో అర్థమవుతుంది.  
 
రాజన్న స్వీయాత్మక కథనానికి వస్తే- తెలంగాణ-మహరాష్ట్ర సరిహద్దుగా పెన్‌గంగానది. ఆదిలాబాద్‌ జిల్లా జైనద్‌ మండలంలోని ఆనందపూర్‌ ఆ నదీ తీరాన వుంది. అక్కడే ఒక నిరుపేద రజక కుటుంబంలో జన్మించాడు రాజన్న. తల్లి గంగుబాయి, తండ్రి నానాజీ. మహరాష్ట్రలోని యావత్‌మల్‌లో కాయర్‌ గ్రామంనుంచి ఇక్కడ స్థిరపడిన కుటుంబం. నానాజీకి ఇద్దరు భార్యలు. రజక వృత్తిలోని పేదరికం, సామాజిక వివక్ష, నిరక్షరాస్యతల మూలంగా తాగుడికి బానిసైపోయాడు. ప్రతిరోజు తాగివచ్చి గంగుబాయిని హింసించేవాడు. చివరికి ఒకరోజు రాత్రిపూట వానలోనే, జ్వరంతో ఉన్న గంగుబాయిని, చిన్నపిల్లాడు రాజన్నతోపాటు ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. వానలో తడుస్తూ, నానా కష్టాలు పడి, పడవ యజమాని కాళ్ళావేళ్ళాపడి పెన్‌గంగానది దాటి కాయర్‌ గ్రామం చేరుకున్నది. 
రాజన్న 12వ ఏట కాయర్‌ గ్రామంలోనే మరాఠీ మీడియమ్‌ లోనే ఆరవ తరగతి చదివాడు. అక్కడ చిన్నమ్మ చీత్కారాలు... సకాలంలో తిండిపెట్టకుండా వేధించేది. కొంత కాలానికి రాజన్న తల్లి గంగుబాయి జబ్బు చేసి చనిపోయింది. అనాథగా మిగిలిపోయిన రాజన్నను పెద్దమ్మ వచ్చి తన గ్రామం కరంజీ (ఆదిలాబాద్‌)కి తీసుకెళ్ళిపోయింది. ఆమె రాజన్నను సొంత కొడుకులా ఎంతో ప్రేమగా చూసేది. బట్టలు ఉతుకుతూ, పొలాల్లో పనిచేస్తూ యుక్తవయస్సుకు వచ్చిన రాజన్నకు ఆ గ్రామంలోని పెద్ద భూస్వామి, అతని అనుచరుల దౌర్జన్యాలు అనుభవంలోకి వచ్చాయి. ఆ దశలోనే కరంజీ గ్రామంలోకి తరచుగా ‘పొరకల దొరలు’ (మావోయిస్టులు) వచ్చి ప్రజలకు ధైర్యాన్ని ప్రతిఘటన శక్తిని ఇవ్వగలిగారు. 
 
రాజన్నకు 20వ యేట అక్కడే లత అనే అమ్మాయితో వివాహం జరిగింది. కొంతకాలానికి రాజన్న భార్యను భూస్వామి అనుచరులు వేధించడం ప్రారంభించారు. ఆ దౌర్జన్యాన్ని సవాలు చేసి రాజన్న ఎదిరించాడు. ఫలితంగా భూస్వామి స్వయంగా రాజన్నను హత్య చేయాలని పథకం పన్నాడు. ఇదంతా ముందే పసిగట్టిన రాజన్న తన రక్షణ కోసం దగ్గర ఒక కత్తిని పెట్టుకొనేవాడు. ఒకరాత్రి రాజన్న ఒంటరిగా వెడుతుండగా భూస్వామితోపాటు అనుచరులు వచ్చి దాడి చేసారు. ఆ కుమ్ములాటలో రాజన్న ఆత్మరక్షణ కోసం కత్తిని బయటికి తీసి ఎదిరించే క్రమంలో ఆ కత్తి భూస్వామి గుండెలో దిగిపోయింది. రాజన్న భయంతో పారిపోయి బంధువుల దగ్గరకు వెళ్ళాడు వాళ్ళ సలహాతో వెళ్ళి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. 
 
తాను హత్య చేయాలని చేయలేదని, ఆత్మరక్షణ పెనుగులాటలో జరిగిన విషయాన్ని రాజన్న వివరించాడు. పోలీసులకు అన్ని విధాలా సహకరించాడు. అయినా పోలీసులు దొంగ సాక్ష్యాలు సృష్టించి, రాజన్నపై హత్యానేరం మోపి కోర్టులో ప్రవేశపెట్టారు. తాను చెప్పిన వాస్తవాన్ని తొక్కిపెట్టి, చివరికి తన వకీలు కూడా సహకరించనందువల్ల, రాజన్న విసిగిపోయాడు. తక్కువ కులం కింద తనను మరింత కించపరిచి అబద్ధాలు చెబుతున్నందుకు, రాజన్న తాను కోర్టును బహిష్కరిస్తున్నానని అన్నాడు. జడ్జి రాజన్నను ఒక ప్రమాదకరమైన నేరస్థుడిగా వ్యాఖ్యానించి, ఉరిశిక్ష విధించి, తన కలాన్ని విరిచేసాడు! 
 
ఆ తర్వాత రాజన్న వరుసగా నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జైళ్లు దాటి చంచల్‌గుడా జైలులోకి- అక్కడ ఉరి తీసే ఏర్పాటు లేనందున ముషీరాబాద్‌ జైలుకు చేరాడు. ఉరిశిక్ష పడిన ఖైదీగా, విశాలమైన బ్యారక్‌లో ఒంటరిగా మూడు నెలలపాటు మానసిక వేదనను అనుభవించాడు. రాజన్నను ఎలాగూ ఉరితీస్తారు కాబట్టి, అతని భార్య లతకు రెండో పెళ్ళి చేస్తామని, ఆమోదం తెలపమని బంధువులు నచ్చచెప్పారు. తనతోపాటు ఎన్నో కష్టాలు సహించిన భార్య తన మరణం తర్వాత మరిన్ని యాతనలు పడొద్దని ఆమె రెండో పెళ్ళికి అంగీకరించాడు. కొంత కాలానికి డిప్యూటీ జైలర్‌ మోజెస్‌ ప్రోత్సాహంతో మరణ శిక్ష రద్దు కోసం హైకోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. హైకోర్టు ఉరిశిక్షను రద్దుచేసి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. 
 
ఖైదీ నంబర్‌ 7747గా రాజన్న చంచల్‌గుడా జైలులోకి అడుగుపెట్టాడు. ఈ జైలులో వున్నప్పుడే రాజన్నకు వివిధ దినపత్రికలు, వార మాస పత్రికలతో పరిచయం ఏర్పడింది. అందరితో కలిసిపోయే రాజన్న సరళ స్వభావం చూసి జైలు అధికారులు అతనికి విద్యాభ్యాసం కొనసాగించడానికి అన్ని అవకాశాలు కల్పించారు. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ పరీక్షలలో ఉత్తీర్ణత పొంది, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసాడు.
 
జైలు శిక్ష కాలంలోనే, రాజన్న రెండుసార్లు పెరోల్‌పై వెళ్ళి తన గ్రామాలలోని బంధుమిత్రులను కలుసుకుని రాగలిగాడు. ఆ పెరోల్‌ సమయంలోనే ఆసక్తికరమైన సంఘటన! రాజన్న మాజీ భార్య అప్పుడు (రెండో వివాహం తర్వాత) భర్త, ఇద్దరు పిల్లలతో కాపురం వుంటున్నది. ఆమె భర్త స్వయంగా వచ్చి రాజన్నను స్నేహపూర్వకంగా కలిసాడు. ఇంటికి భోజనానికి రమ్మని కోరగా- ఆనాటి సహచరి ఇప్పుడు మరొకతని భార్యగా సుఖంగా ఉంది, తాను వెళ్ళి కలవరపరిచినట్టు అవుతుంది కాబట్టి రానన్నాడు. కాని అతను బతిమిలాడి రాజన్నను వెంట తీసుకెళ్ళి భోజనం పెట్టించాడు. లత కన్నీళ్ళతో పలకరించింది.  
 
పది సంవత్సరాల జైలు జీవితం తర్వాత, రాజన్నకు 26 జనవరి 1990లో ఆనాటి ప్రభుత్వం క్షమదానం చేసింది. ముఖ్య మంత్రి ఎన్‌టిఆర్‌ సంతకం చేయగా రాజన్న విముక్తుడు కాగలిగాడు. తన జీవితంలోని అమూల్యమైన పదేళ్ళను కారాగారం కబళించేసిందని, అక్కడ తాను ఎంతో కోల్పోయానని, మరెంతో పొందగలిగానని రాజన్న ఈ నవల చివర చెబుతున్నాడు. 
 
రాజన్న విడుదలయ్యాక ‘హైదరాబాద్‌ సమాచార్‌’ పత్రిక సంపాదకుడు శ్రీమునీంద్ర, ఆర్య సమాజ్‌ నాయకుడు పండిత్‌ గంగారామ్‌ అతనికి అన్నివిధాలా సహకరించారు. ముఖ్యంగా మునీంద్రగారు రాజన్నకు తన పత్రికలో ఉపాధి కల్పించి, ఇంటిలో భోజన సౌకర్యం కల్పించాడు. ఆ తర్వాత అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రొ.ఆర్‌.వి.చంద్రశేఖరరావు (వైస్‌ ఛాన్సలర్‌) తోడ్పాటుతో అక్కడ తాత్కాలిక ఉద్యోగిగా చేరిపోయాడు. ఐతే యూనివర్సిటీ రూల్స్‌ మూలానా దాదాపు 10-15సం.ల సర్వీసు ఉన్నా, పర్మనెంట్‌ కాలేక, రూ.480లతో మొదలైన ఉద్యోగం 20 వేలదాకా చేరిన పిదప, ఉద్యోగాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. అయితే ఈలోగా రాజన్న తరచుగా ‘డేలీ హిందీ మిలాప్‌’ దినపత్రికలో రచనలు చేసినందువల్ల, అదే పత్రికలో ఉపసంపాదకుడిగా చేరిపోయాడు. రాజన్నకు 1990లో ఛాయాదేవితో నిరాడంబరంగా వివాహం జరిగింది. ఒక కూతురు, కొడుకు ఉన్నారు. ప్రస్తుతం రాజన్న ‘సాక్షి సమాచార్‌’ హిందీ విభాగం జర్నలిస్టుగా వున్నారు. గతజీవితాన్ని గుర్తు చేసుకుంటూ రాజన్న- ‘‘బాల్యంలోనే అన్నీ కోల్పోయున నేను ఒంటరివాడిని. అదే నా నియతి. అమ్మ చనిపోయినపుడు గుడిసెలో ఒక్కడినే. ఉరిశిక్ష పడినపుడు బ్యారక్‌లోను ఒంటరివాడినే. యావజ్జీవ కారాగార శిక్ష చీకటి కొట్టంలో ఒంటరితనమే నాకు తోడుగా వుంది,’’ అంటాడు. 
 
నిఖిలేశ్వర్‌
91778 81201