ఆమె : అణువులో బ్రహ్మాండం!

అనేక స్థల కాలాలలో నరేష్‌ నున్నాకు సాక్షాత్కరించిన అనేకానేక ‘ఆమె’లు అతనిలో రగిలించిన మహోద్వేగపు వచన జ్వాల ‘ఆమె’. ఇది ఫేస్‌బుక్‌ మ్యూజింగ్స్‌ వ్యాస సంపుటి. ఆమె సాక్షాత్కారంలో కలిగిన తీవ్రమైన పరవశాన్ని తన జలపాత వేగ వచనంలో ముంచీ, లేపీ, సుళ్లు తిరిగే అనుభూతిని పాఠకుడికి మిగిలిస్తాడు రచయిత. ఈ క్రమంలో ప్రాచ్య, పాశ్చాత్య, పురాణ ప్రబంధాల దగ్గర నుంచీ అనేకానేక కాలీన, సమకాలీన సినిమా పాటలతో, అన్నమయ్య లాంటి భావుకుల, సౌందర్యానుభూతిపరుల పదాలతో, ఆంగ్లాంధ్ర, పండిత, పామర వ్యాఖ్యలతో తన వచనాన్ని దివ్యంగా వెలిగిస్తాడు. సౌందర్యం తన భావాల్లో కలిగించిన భావప్రాప్తిని తన అసమాన శిల్ప విన్యాసంతో పాఠకుల మస్తిష్కాల్లోకి ప్రసారం చేయడంలో శక్తి ‘వంచన’ లేకుండా శ్రమిస్తాడు రచయిత. తెలుగు వచన అభివ్యక్తి సామర్థ్యాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్ళిన వ్యాసాలివి. నిజానికి నిత్య సంక్షుభిత సమాజంలో దీర్ఘకాలం పాటు యవ్వన శృంగార ప్రేమైక భావుకుడిగా కొనసాగడం చాలా కష్టం. ఆ కష్టాన్ని దశాబ్దాలుగా అనునిత్యం అధిగమిస్తూ స్ర్తీ ఆత్మదేహ స్పర్శను అప్పుడప్పుడయినా నిర్విరామంగా వచనీకరించడం రచయిత ప్రత్యేకత. ఇందుకు నరేష్‌ని అభినందించాలి మనం. అత్యాధునికంగా కనిపించే ‘ఆమె’ వ్యాసాల తాలూకు టెక్ట్‌ ్స లోని ప్రతి పదాన్నీ అంతిమంగా ఆధునికత అని మనం అనుకొనేదాన్ని ధ్వంసం చేసేందుకే వినియోగిస్తాడు. ఇందులోని సారాన్ని వివరించలేం, రచన తాలూకు శాబ్దిక సౌందర్యం వెంట అలుపెరగకుండా అనివార్యంగా పరుగుతీయడం తప్ప ఏమీ చేయలేం. ఈ పుస్తకం ముందుమాటలో రాణీ శివశంకరశర్మ అన్నట్టు నరేష్‌ ఆమెలో తన ప్రపంచాన్నే ఆవిష్కరిస్తాడు ... అణువులోనే బ్రహ్మాండాన్ని చూపుతాడు. ‘ఆమె’లో తన తాలూకు కూపస్థ విశ్వరూపం చూపిస్తాడు. ఈ పుస్తకానికి మోషేదయాన్‌ ముఖచిత్రం ఒక మార్మిక ఆకర్షణ.                                                                                                                                                                                                                                                                                                   - డి. లెనిన్‌

 

 

ఆమె - ఫేస్‌బుక్‌ మ్యూజింగ్స్‌

నరేష్‌ నున్నా

పేజీలు : 158,

వెల : రూ.120

ప్రతులకు : విశాలాంధ్ర