కథానవలా రచయిత్రి జి.ఎస్‌.లక్ష్మి. ఇప్పటివరకు ఆమె రాసిన 100 కథలు పలు సంపుటిలుగా వచ్చాయి. హాస్యకథలు కూడా రాశారు. ‘అమ్మే కావాలి’, ‘ఇంటింటికొక పూవు’ రెండు కథా సంపుటిలు తాజాగా మార్కెట్లోకొచ్చాయి. 13 కథలున్న ‘అమ్మే కావాలి’ సంపుటిలోవన్నీ అమ్మ గురించిన కథలే. జీవితంలో మనకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మనకు జన్మనిచ్చిన అమ్మను ఎంత బాగా, అపురూపంగా చూసుకోవాలో చాటి చెప్పే కథలు ఇవన్నీ. ఎంతో చలాకీగా ఇంటిని చక్కబెడుతూ మనల్ని తీర్చిదిద్దిన అమ్మ, జీవిత చరమాంకంలో చిన్న పాపాయిలా అయిపోయినప్పుడు మనకు కలిగే ఆవేదన, అమ్మతాలూకూ పూర్వవైభవ జ్ఞాపకాలు, ఆ వెనువెంటే మనల్ని వెన్నుతట్టే మన ప్రస్తుత కర్తవ్యం....గుర్తుచేస్తూ, దేనికదే సాటిగా అనిపించే అమ్మ కథల సమాహారమిది. 

మరో 13 కథల సంపుటి ‘ఇంటింటికొక పూవు’. మన జీవిత విధానం గురించి టీవీల్లో శాస్త్రవేత్తలు చెప్పేమాటల్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తూ ఉంటాం. కానీ ‘ఇంటింటికొక పూవు’ కథలో మాత్రం ఆ భార్యభర్తలు అలా చెయ్యలేదు. వాటిని తమ జీవితానికి అన్వయించుని భావితరాలకు మేలు చేయాలని నిర్ణయించుకున్నారు. అదేమిటో ఆ కథ చదివి తెలుసుకోవాలి. తల్లిదండ్రుల జీవన విధానం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చాటిచెప్పే కథ ‘రెండు నాన్నలు’. ఇలా ప్రతికథా సామాజిక ప్రయోజనాన్ని ఆశించినవే. 

అమ్మే కావాలి

అమ్మ కథల సమాహారం
జి.ఎస్‌.లక్ష్మి
ధర 130 రూపాయలు
పేజీలు 132
ప్రతులకు రచయిత్రి, సెల్‌ 990 864 80 68, అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు