ఉర్దూ సాహిత్యంలో శిఖరమాన రచయిత్రి పద్మశ్రీ జీలానీ బానూ. ఇంగ్లీషు సహా పలు భారతీయ యూరోపియన్‌ భాషల్లోకి ఆమె రచనలు అనువాదమయ్యాయి. అంతకుమించి హైదరాబాద్‌ కథకు అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన అరుదైన రచయిత్రి. 

ఇప్పటికే ఆమె ఉర్దూ నవలలు, కథలు సహా పలు రచనలు తెలుగులోకి వచ్చాయి. జీలానీ బానూ తొలి కథల సంపుటిని ‘కేదారం’ పేరిట దాశరథి రంగాచార్య ఉర్దూ నుంచి తెలుగులోకి అనువదించగా, ఆంధ్రజ్యోతి దినపత్రిక హైదరాబాద్‌ ఎడిషన్‌లో డిప్యూటీ న్యూస్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్న పాత్రికేయుడు పీవీ సూర్యనారాయణమూర్తి, మెహెక్‌ హైదరాబాదీ కలం పేరుతో ఆమె మరికొన్ని ఉర్దూ కథల్ని ‘గుప్పిట జారే ఇసుక’ పేరిట 2016లో తెలుగులోకి తెచ్చారు. ఈ సంపుటికి వచ్చిన ప్రశంసలు, స్ఫూర్తితో ఇప్పుడు ‘అంతా నిజమే చెప్తా...’ శీర్షికతో ఎంపిక చేసిన మరో 21 కథలను రెండో సంపుటిగా వెలువరించారు. ఒకవైపు పాత్రికేయుడుగా రాణిస్తూ, మరోవైపు ఎంతో మక్కువతో ఉర్దూభాషను అధ్యయించి గజల్స్‌ రచయితగా, అనువాదకునిగా ఎదిగారు మెహెక్‌ హైదరాబాదీ.

ఈ సంపుటిలోని కథలన్నింటిలోనూ ముఖ్యంగా ముస్లిం కుటుంబాల సాంఘిక వాతావరణాన్ని ఎంతో నేర్పుతో కళ్ళకు కట్టారు అనువాదకుడు. టైటిల్‌ కథ ‘అంతా నిజమే చెప్తా...’ న్యాయస్థానంలో నిందితులు చేసే ప్రమాణాల్లోని డొల్లతనం, వారి నేరస్థ మనస్తత్వాలనూ ఎండగడుతుంది.  

అంతా నిజమే చెప్తా....
జీలానీ బానూ కథలు
అనువాదం  మెహక్‌ హైదరాబాదీ 
ధర 150 రూపాయలు
పేజీలు 228
ప్రతులకు నవచేతన  బుక్‌హౌస్‌లు , మరియు అనువాదకుడు  మెహక్‌ హైదరాబాదీ , మియాపూర్‌ , హైదరాబాద్‌ –49 మొబైల్‌ 9000 20 9209