విచ్చలవిడిగా నవ్వుకోండి

సంతోషంగా ఉండాలనీ, పకపకా పడీ పడీ నవ్వాలని కోరుకోనివాళ్ళెవరూ ఉండరు. పైగా ఇప్పుడు ఇలాంటి సందడినే కోరుకుంటున్నారంతా. అందుకే కార్టూనిస్టులకు విచ్చలవిడిగా డిమాండ్‌ పెరిగిన కాలంగా గణుతికెక్కిందీ 21వ శతాబ్దం. అందుకు తగ్గట్టుగానే కార్టూనిస్టుల కేన్వాస్‌ కూడా విస్తరించింది. విభిన్న జీవన రంగాల్ని వదిలిపెట్టకుండా తమదైన షార్ప్‌ గీతలతో జనాన్ని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు. పాఠకులు కూడా వెరైటీ కార్టూన్లు కోరుకుంటున్నారు. అందుకే కార్టూను ఇష్టుల్ని కవ్వించి, నవ్వించి జీవిత ప్రయాణంలో అలసటలేకుండా చేసేందుకు తాజాగా మార్కెట్లోకి వచ్చిందీ ‘కా6టూనిస్టులు’ పుస్తకం. దిగ్గజాల్లాంటి ఆరుగురు కార్టూనిస్టులు రామకృష్ణ, సరసి, లేపాక్షి, బాచి, దాస్‌, కామేష్‌ ఇలా, ఒకే పుస్తకంలోకొచ్చి 34 కార్టూన్లు చొప్పున 204 రకాల కార్టూన్లతో అందరినీ అలరిస్తున్నారు. వీరంతా అనేక దశాబ్దాలుగా తెలుగు ప్రజలకు పరిచితులే.

వీరిలో ఎం.ఎస్‌. రామకృష్ణ ఐదు దశాబ్దాలుగా పలు భాషా పత్రికల్లో కార్టూన్లు, కామిక్‌ ఫీచర్లు, బొమ్మల కథలు వేశారు. శకంర్స్‌ వీక్లీకి ఆయన వేసిన కార్టూన్లు దేశవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టాయి. ఆయన కార్టూన్లు ఇప్పటికే పలు పుస్తకాలుగా వచ్చాయి. అదేవిధంగా, లేపాక్షి పేరుతో ఇప్పటికీ 15వేలకుపైగా కార్టూన్లు వేశారు లేపాక్షిరెడ్డి. ఆయన కార్టూన్లు పలు పుస్తకాలుగా వచ్చాయి. ఇంకా పేరెన్నికగన్న సరసి, బాచి, కామేష్‌, పద్మాదాస్‌ కార్టూన్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రతి తెలుగుపాఠకుడూ కొనుక్కోవాల్సిన పుస్తకమిది.

 

కా6టూనిస్టులు (204కార్టూన్లు)
కామేష్‌
ధర 100 రూపాయలు
పేజీలు 112
ప్రతులకు ప్రణవ్‌–ప్రణీత్‌ పబ్లికేషన్స్‌, గోకులం అపార్ట్‌మెంట్‌, అలకాపురి, రామకృష్ణాపురం, హైదరాబాద్‌–02 సెల్‌ 98 49 61 92 90