‘‘మగాడికి గోచీగుడ్డ ఉంటే చాలు ఎలాగైనా బతికేస్తాడు’’ అనేవారు పూర్వం. 
నిజమే! గోచీ బిగించి గోదాలోకి దిగి గోల్డ్‌మెడల్స్‌ కొట్టేవాళ్ళు, గోపురశిఖరమెక్కి గొప్ప సందేశాలిచ్చినవాళ్ళు, కొల్లాయిగట్టి 
కండలతోపనిలేకుండా, దేశాన్ని కొల్లగొట్టేవాళ్ళని ఖండాంతరాలకు గెంటేసినవాళ్ళు...ఇలా ఎందరో బతికిచూపించి మనిషితత్వాన్ని ఋజువుచేసిన పుణ్యభూమి మనది. 
ఇప్పుడాతత్వాలన్నీ పోయిన కాలమిది. బతుకు బహువిధాల భారమైపోయిన కాలమిది! గ్రాఫ్‌కాగితంమీద చుక్కల్ని కలిపి గీతగీస్తే పరీక్షల్లో పదిమార్కులొస్తాయి విద్యార్థికి. కష్టాలు, కన్నీళ్ళ చుక్కలు కలిపి పైఎత్తుకి పరుగుదీస్తే బతుకు పరీక్షలో ఫస్టుమార్కులొస్తాయి మనిషికి. 
అలాంటి బతుకుకళలో ఆరితేరిన మహనీయులు తమ అనుభవసారాలన్నీ ఆత్మకథల్లో రాసి మనముందుంచారు. 
ఇప్పుడు అందరూ అలాంటి అనుభవాలున్న ఆత్మకథల్నే చదువమని చెబుతున్నారు. ఆ జాబితాలో పుస్తకమే  ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ పుస్తకం. 
ఎదుటివాళ్ళను దూషించడం కోసం కొందరు జీవిత కథలు రాస్తే, కఠోరమైన వాస్తవాలు చెప్పడం ఇష్టంలేక, ఇతరుల్ని నొప్పించడం 
ఇష్టంలేక ఇందిరాగాంధీలాంటి కొందరు ఆత్మకథలే రాయడం మానుకున్నారు. ‘ఆత్మకథ రాయడం స్వీయహననం’ అన్నాడట ఒక ఇంగ్లీషాయన. ఎందుకంటే అందులో నిజాయితీ ఉంటుంది, నిజాయితీతో కూడిన వాస్తవం ఉంటుంది, అరమరికలులేనితనం ఉంటుంది, అలాంటి నిఖార్సైన ఒక తెలుగు పండితవంశీయుడు, సాహితీవేత్త ఆత్మకథ ఇది. 
తన కుటుంబంలో ఉన్న ఆసంతృప్తులూ, తీరనికోరికలు, సంఘర్షణలు అన్నదమ్ముల వ్యక్తిత్వాలు, కోరికలు, బలహీనతలు సహా గుణగణాల వికాసం, పరిణతి, పరిపూర్ణత్వం...ఇలా ఆత్మకథారచనలో తామరాకుపై నీటిబొట్టుతీరున నాణేన్ని రెండువైపులా చూపించి,  ‘అబ్బ! ఎంత దిటవుగుండెతో రాశాడురా’ అనిపించిన ఆరు తరాల చరిత్ర ఇది. 
మహబూబ్‌నగర్‌జిల్లా ఇంద్రకల్‌ గ్రామ నామమే శ్రీకాంతశర్మగారి ఇంటిపేరు. కవిపండితునిగా, సాహిత్యవక్తగా, రచయితగా తండ్రి 
హనుమచ్చాస్త్రి 76ఏళ్ళ సుదీర్ఘజీవన ప్రస్థానం, శ్రీపాద, మునిమాణిక్యం, మధునాపంతుల సత్యనారాయణ, విశ్వనాథ, ఆవంత్స, ఉషశ్రీ, కృష్ణశాస్త్రి, చలం, శ్రీశ్రీ, ఆరుద్ర లాంటివారి పరిచయ సాంగత్యాలు, డెబ్భైఏళ్ళ క్రితమే ‘ఇ’ ఇంగ్లీషు అక్షరం డిజైన్లో నిర్మించిన రామచంద్రపురం జాతీయపాఠశాల భవనంలో ఆడియోవిజువల్‌ క్లాసులు, 16ఎం.ఎం ఫిల్ములతో సంపూర్ణమైన ప్రాతిపదిక సౌకర్యాలను విద్యాబోధనకు ఉపయోగించడం, తన తండ్రికి 30వ దశకంలో లభించిన ఎర్రపెన్ను, జపాన్‌నోట్‌బుక్‌లో తండ్రిరాసుకున్న చిన్ననాటి పద్యాలు ఈనాటికీ శ్రీకాంతశర్మ భద్రపరుచుకోవడం, హోటల్‌కెళ్ళడం రౌడీతనంగా భావించే ఆనాటి ఆలోచనలూ మనల్ని అబ్బురపరుస్తాయి. ప్రముఖ రచయిత్రి జానకీబాలతో వివాహం, ఆంధ్రజ్యోతి, విజయవాడ ఆకాశవాణి ఉద్యోగజీవితం, ఆంధ్రప్రభ సంపాదక బాధ్యతలు, సినీగీత రచయితగా, కథా, నవలా రచయితగా, సాహితీవేత్తగా ఉన్నతశిఖరాలకు ఎదగడం, ఆనాటి ప్రముఖులు, వారి రచనలు, వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, ఆత్మగౌరవ పోరాటం, రాజకీయ పరిణామాలు, ప్రకృతివిలయాలు....ఇలా విస్తారాంశాలతో విలక్షణంగా, ఉత్కంఠభరితమైన నవలలా ఉంటుందీ ఆత్మకథ.
ఆచంట జానకిరాం, తిరుమల రామచంద్ర, శ్రీశ్రీ ‘అనంతం’ లాంటి పుస్తకాల సరసన నిలిచే ఆత్మకథ ఇది. నాలుగున్నర దశాబ్దాల ఆంధ్రదేశ చరిత్ర, సామాజిక పరిణామాలను నిక్షిప్తం చేసిన పుస్తకమిది.