కాలానికి నిలిచే కథల రచయిత ధనికొండ !

అక్షర తపస్వి ధనికొండ హనుమంతరావు (1919–1989). ఇది ఆయన శతజయంతి సంవత్సరం. బహుముఖీన సాహిత్య వ్యక్తిత్వం ఆయన సొంతం. హాస్యానికీ, వ్యంగ్యానికీ, చమత్కారానికీ పెట్టిందిపేరు. లబ్ధప్రతిష్ఠుడైన కథానవలా నాటక రచయితే కాదు,  ప్రచురణకర్త, ముద్రాపకుడు, పత్రికా సంపాదకుడు కూడా. సామాజిక ప్రయోజనాన్ని ఆశించి సాహిత్య సృజన చేసే శ్రీశ్రీ, చలం, కొ.కు లాంటివారి రెండోతరం సాహిత్యకారుల కోవకు చెందినవారు ధనికొండ. జ్ఞానపీఠ రచయిత రావూరి భరద్వాజ కూడా, ‘‘ఆయనవల్లే ఇంతవాణ్ణయ్యా’’ అని చెప్పుకున్నవారే.      
సామాన్య కుటుంబంలో పుట్టి ఆ కష్టాలను, ఆ జీవితాలను రచనల్లో ప్రతిబింబించారు. 70–80 ఏళ్ళ క్రితమే ఈ కాలపు ఆడ్వాన్స్‌డ్‌ కథలు రాసిన రచయిత ధనికొండ! 
మొపాసా ప్రతిభ, ప్రభావం ఆయన రచనల్లో కనిపిస్తాయి. ఆయన రచనలు నేటికీ సజీవమే. 
అడ్వాన్స్‌డ్‌ ఆలోచనలతో కలం సేద్యం చేసిన రచయిత ధనికొండ. ఆయన రచనల్లో ‘మీ టూ’ ను కూడా వస్తువుగా తీసుకోవడం మనల్ని అబ్బురపరుస్తుంది. ఈనాటి ఆధునిక భావాలు, ధోరణులు ఆయన రచనల్లో కనిపిస్తాయి. పాఠకులు ఊహించని ముగింపు ఆయన కథల్లో, నవలల్లో లుంటాయి.
ఈ శతజయంతి సంవత్సరం వేళ ధనికొండ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆయన కుమారులు పన్నెండు వాల్యూమ్స్‌లో వెలువరించిన సాహిత్యమే ఇదంతా. వీటిల్లో నాలుగు నవలలు, ఐదు కథాసంపుటాలు, రెండు నవలికలు, నాటకాలు, నాటికల సంపుటి ఉన్నాయి. 
వీటిల్లో ఎన్నదగిన ఒక నవల ‘‘జగదేక సుందరి క్లియోపాత్రా’. సహజంగా అధికారంకోసం కుట్రలు, యుద్ధాలు చేసేది రాజులే. కానీ ఆ అధికారం కోసం ఎంతకైనా తెగించగల సాహసి, ఒక ప్రపంచ సుందరి చరిత్ర ఈ పుస్తకం. క్రీస్తుపూర్వంనాటి సంస్కృతి, మానవసంబంధాలు, కుతంత్రాలను కళ్ళకుకట్టే పుస్తకమిది.
మరో నవల ‘దూతికా విజయం’. అవంతీదేశ మహారాజు చిన్నరాణి మాధవీదేవి సంతానకాంక్షతో వీరభద్రుడనే బ్రాహ్మణ ధీరుడి కలయికను ఆశించి అతడి వద్దకు తన చెలికత్తె సరస్వతిని దూతిక (మెసెంజర్‌) గా పంపుతుంది. చివరకు ఆ దూతిక ఎలాంటి నిర్వాకం చేసిందనేదే ఈ నవల. 
ఇంకొక పుస్తకం ‘లోక చరిత్ర’ ఐదు నవలికల సమాహారం. ‘సలహా’, ‘తీర్పు’, ‘జ్జాని’, ‘ప్రమాదాలు’ అనే నవలికలు కూడా ఇందులో ఉన్నాయి. కాగా, ‘ఎర్రబుట్టలు’ అనేది మరో సంకలనం. ఇందులో రెండు నాటకాలు, 13 నాటికలు ఉన్నాయి. పోలీసు వేషాల్లో వచ్చి దోపిడీలు చేసే దొంగల ఇతివృత్తమే ‘ఎర్రబుట్టలు’. 
స్వాతంత్ర్యానికి పూర్వమే దళిత సమస్యను ‘పవిత్రులు’ నాటకంగా తీర్చిదిద్దారు ధనికొండ. మరొక నాటకం ‘మధురకల్యాణం’ తోపాటు 13 నాటికలూ ఉన్నాయి. సుప్రసిద్ధ ఫ్రెంచి రచయిత, టాల్‌స్టాయ్‌ ప్రశంసలు పొందిన వెరైటీ కథల రచయిత, ప్రపంచ కథాచక్రవర్తుల్లో ఒకడు మొపాసా. ప్రపంచంలోని అన్ని భాషల్లోకీ ఆయన కథలు అనువాదమయ్యాయి. ధనికొండ తెలుగులోకి అనువదించిన మొపాసా 31కథల సంపుటి ‘మొపాసా కథలు’. నూరేళ్ళక్రితంనాటి మొపాసా కథలు ఇంకా నిన్నమొన్నటి జీవితాల కథల్లానే ఉంటాయి. ఇవే కాకుండా న్యూజెర్సీ బెర్లింగ్‌టన్‌కు చెందిన నవలాకారుడు, చరిత్రకారుడు జేమ్స్‌ ఫెనిమోర్‌ కూపర్‌ రచించిన ఆమెరికన్‌ క్లాసిక్‌ రచన ‘The Last of The Mohicans ను ‘అంతిమపోరాటం’ నవల, మూడుతరాల స్ర్తీల గురించి రాసిన ‘మగువ మనసు’ నవల, నాలుగు నవలికల సంకలనం ‘సేవిక’, ‘అతను–ఆమె–ఈమె’ టైటిల్‌తో వెలువడిన 36 కథల సంకలనం మరొకటికాగా, 31 కథలతో వెలువడిన మరో సంపుటి ‘గళ్ళరుమాలు’. 32 కథలున్న ‘దేశోద్ధారకుడు’. సంపుటి, ‘ప్రియురాలు’ టైటిల్‌తో వచ్చిన 33కథల సంపుటి ఇంకొకటి ధనికొండ శతజయంతి సందర్భంగా మార్కెట్లోకొచ్చాయి. 

 

దూతికా విజయం
ధనికొండ హనుమంతరావు
ధర 175 రూపాయలు
పేజీలు 320

 
లోక చరిత్ర ‘నవలిక సమాహారం)
ధనికొండ హనుమంతరావు
ధర 200 రూపాయలు
పేజీలు 336
 
జగదేక సుందరి క్లియోపాత్రా
ధనికొండ హనుమంతరావు
ధర 225
పేజీలు 384
 
ఎర్ర బుట్టలు (మరికొన్ని నాటికలు, నాటకాలు)
ధనికొండ హనుమంతరావు 
ధర 200 రూపాయలు
పేజీలు 360
 
మొపాసా కథలు
ధనికొండ హనుమంతరావు
ధర 150 రూపాయలు
పేజీలు 256
ప్రతులకు సాహితి ప్రచురణలు 33–22–2, చంద్రం బిల్లింగ్స్‌, సి.ఆర్‌.రోడ్‌, చుట్టుగుంట, విజయవాడ ఫోన్‌ 0866–2436643