అబ్బాయికి 40.. అమ్మాయికి 16

జిన్నా పెళ్లినాటి వయసు ఇది..  

పెద్దలు ఒప్పుకోలేదు... అప్పట్లోనే వీళ్ల లవ్ స్టోరీ ఓ హాట్ టాపిక్ 

మహమ్మద్‌ అలీ జిన్నా పేరు అందరికీ తెలుసు. మరి, ఆయన భార్య మర్యమ్‌ జిన్నా అలియాస్‌ రత్తనబాయ్‌... రుట్టీ... పెటిట్‌ గురించి? ఈ నలభై రెండేళ్ళ ముస్లిమ్‌ అబ్బాయి... పద్ధెనిమిదేళ్ళ పార్శీ అమ్మాయిల ప్రేమ గురించి? ఆ రోజుల్లో సంచలనమైన ఆ ప్రేమకథ... ఆనక డిప్రెషనలోకి వెళ్ళి ఆ అమ్మాయి చేసుకున్న ఆత్మహత్య గురించి? అవన్నీ తెలియాలంటే, సీనియర్‌ జర్నలిస్టు షీలా రెడ్డి రాసిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ జిన్నా...’ చదవాలి. ఇటీవల సంచలనాత్మకమైన ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు... ‘ఆంధ్రజ్యోతి సాహిత్యం’ పాఠకుల కోసం...

 
రుట్టీ కన్నా జిన్నా ఇరవై నాలుగేళ్ళు పెద్ద. అంతేకాదు... ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి అతనికి తెలుసు. స్నేహితుడి కూతురైన ఆమె పట్ల జిన్నాకు ఒక చిన్నపిల్లతో, పెద్దవాళ్ళకుండే అనుబంధమే అప్పటి దాకా ఉండేది. అలాంటిది ఇప్పుడీ వార్త (మొగ్గతొడిగిన ప్రేమ వ్యవహారం) సర్‌ దిన్షా (రుట్టీ తండ్రి)కు చెప్పడం అంత సులభం కాదు. కానీ, జిన్నా మతాంతర వివాహాల గురించి అభిప్రాయం ఏమిటంటూ, సర్‌ దిన్షాను చాలా అమాయకంగా అడిగినట్లు అడిగాడు. విషయం తెలియని దిన్షా సరిగ్గా వలలో పడ్డారు. మతాంతర వివాహాలు జాతీయ సమగ్రతకు తోడ్పడతాయనీ, మత వైరాన్ని పోగొట్టడానికి తుది పరిష్కారంగా అవి రుజువు కావచ్చనీ చెప్పారు. ఆ తరువాత జిన్నా తాను ఆయన కుమార్తెను పెళ్ళాడాలని అనుకుంటున్నట్లు చల్లగా చెప్పారు. దాంతో, దిన్షా దిగ్ర్భాంతికి గురయ్యారు.
 
ఎక్కడ చూసినా అదే చర్చ
దిన్షా, జిన్నాల మధ్య అప్పుడు ఏం జరిగిందన్నది జిన్నా ఎవరికీ చెప్పలేదు. దిన్షా దాని గురించి పెదవి విప్పలేదు. అయితే, జిన్నా చేసిన ఈ పెళ్ళి ప్రతిపాదన అచ్చంగా కార్చిచ్చులా వ్యాపించేసింది. ...జిన్నా, రుట్టీల పెళ్ళి తథ్యమనీ, కానీ ఆ పిల్ల తల్లితండ్రులు మాత్రం ఒక మహమ్మదీయుడితో తమ కూతురి పెళ్ళికి ఇష్టపడడం లేదనీ బొంబాయి అంతా పొక్కిపోయింది. మైనర్‌ బాలిక రుట్టీ మాత్రం జిన్నానే పెళ్ళి చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉందని అర్థమైంది.
 
ఆడవాళ్ళ వెంట పడడం, అదీ... రుట్టీ లాంటి యువతుల వెంటపడడం జిన్నాకు ఎప్పుడూ అలవాటు లేదు. హాజరయ్యే కొద్దిపాటి విందు వినోదాల్లోనూ ఆడవాళ్ళకు ఆయన దూరంగా ఉండేవారు. నృత్యాలు చేయడం, పాటలు పాడడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. దాని బదులు ఏ మూలకో వెళ్ళి, తన ఒకే ఒక్క ఇష్టమైన రాజకీయాలంటే ఆసక్తి చూపే మగాళ్ళతో కూర్చొని మాట్లాడుతుండేవారు. కానీ, రుట్టీతో ప్రేమలో పడ్డాక కథ మారింది. గుర్రపు పందాలు, పార్టీలు, అందరూ ఆడి పాడడానికి వెళ్ళే విలాసవంతమైన వెల్లింగ్డన క్లబ్‌... ఇలా రుట్టీ ఎక్కడకు వెళితే, అక్కడ జిన్నా ప్రత్యక్షమయ్యేవారు. అందరూ తన వంకే చూస్తున్నా, గుసగుసలాడుతున్నా సరే... బాహాటంగా రుట్టీతో మాట్లాడేవారు.
 
అప్పటి దాకా బొంబాయిలోని సమ్మిశ్రిత సమాజంలో కూడా హిందువులు, పార్శీలు, ముస్లిమ్‌ల మధ్య పెళ్ళిళ్ళ విషయంలో ఉన్న విభజన రేఖను దాటేందుకు ఎవరూ సాహసించలేదు. అందుకే, ఈ వార్త ఇంగ్లీషు మాట్లాడేవర్గాలన్నిటిలో చర్చ అయింది. ‘జిన్నాను రుట్టీ పెటిట్‌ పెళ్ళి చేసుకోవాలనుకోవడంపై బొంబాయిలో పెద్ద చర్చ జరుగుతోందట కదా. నాకు ఇవాళే ఆ వార్త తెలిసింది’ అని బెంగుళూరులో చదువుకుంటున్న సరోజినీ నాయుడు కొడుకు జైసూర్య హైదరాబాద్‌లోని సోదరి పద్మజకు లేఖ రాశాడు.
 
మోతీలాల్‌ నెహ్రూ ఇంటి ప్రేమకథ
దేశంలోని అత్యంత విజయవంతమైన, ధనిక లాయర్లలో ఒకరైన మోతీలాల్‌ నెహ్రూ (జవహర్‌ లాల్‌ నెహ్రూ తండ్రి)కి పాతకాలపు హిందూ పద్ధతుల మీద పెద్ద నమ్మకం లేదు. సొంత వర్గానికే చెందిన సంప్రదాయ స్త్రీని పెళ్ళాడిన ఆయన కసిగా ఆధునిక జీవిత విధానాన్ని అలవరచుకున్నారు. ఆయన తన ఇద్దరు కూతుళ్ళ బాగోగులు చూస్తూ, చదువు నేర్పడానికి ఇంగ్లీషు ఆయాను పెట్టారు. జాతీయ రాజకీయాలకు కేంద్రమైన ఆనంద్‌ భవన ఎప్పుడూ అతిథులైన రాజకీయ నేతలతో కళకళలాడుతూ ఉండేది. అయితే, మోతీలాల్‌ పెట్టిన కొత్త వార్తాపత్రిక ‘ఇండిపెండెంట్‌’కు యువ ఎడిటరైన సయూద్‌ హుస్సేన దాదాపు ఆ ఇంట్లో శాశ్వత అతిథి. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకొని, నున్నగా గడ్డం గీసుకొని కనిపించే యువ ముస్లిమైన సయూద్‌ అభ్యుదయ భావాల గురించి ఆ రోజుల్లో రుట్టీ, ఆమె స్నేహితులు తరచూ ప్రస్తావిస్తుండేవారు. ...విదేశాల్లో చదువుతున్నప్పుడు అక్కడి ఇంగ్లీషు అమ్మాయిలతో అతిగా పోవద్దని చిన్నవాడైన తన కొడుకు (జవహర్‌ లాల్‌ నెహ్రూ)కి చెప్పిన మోతీలాల్‌ తన ఇంట్లోనే అందమైన టీనేజ్‌ పెద్ద కూతురు నాననూ, చురుకైన యువకుణ్ణీ ఉంచితే ఎదురయ్యే పరిణామాలను ఊహించకపోవడం విచిత్రమే.
 
సొంత ఇంట్లో ఏం జరుగుతోందో చివరకు మోతీలాల్‌కు తెలిసింది. ఆ యువ ప్రేమికులే ఆయనకు తమ ప్రేమ కథనూ, సంప్రదాయాలేమీ లేకుండా స్వచ్చందంగా తాము చేసుకున్న రహస్య వివాహం గురించి చెప్పారు.ఆ సంక్షోభ సమయంలో మోతీలాల్‌ తన ఒడుపు, సమయస్ఫూర్తి చూపించారు. ఆట్టే హంగామా లేకుండానే ఆ ప్రేమికులిద్దరినీ తమ బంధాన్ని వదులుకొనేలా చేశారు. తరువాతి రోజుల్లో మోతీలాల్‌ కుమార్తె ఆ సంగతిని వివరిస్తూ, హిందూ ముస్లిమ్‌ ఐక్యత గురించి చెబుతూ వచ్చిన ఆ కాలంలో, మా కుటుంబానికి ఎంతోమంది సన్నిహితులైన ముస్లిమ్‌ స్నేహితులు ఉండేవారు. అందుకే, మా మతానికి చెందని వ్యక్తిని పెళ్ళాడడం అతి సహజమని నేను భావించి ఉంటాను. కానీ, పెళ్ళి లాంటి విషయాల్లో ఆ రోజుల్లో బలమైన కట్టుబాట్లుండేవి. వాటిని తోసిపుచ్చడం తప్పని చివరకు నన్ను ఒప్పించారు అని చెప్పారు.
 
అనారోగ్యానికి అసలు కారణం
(జిన్నా నుంచి దూరంగా వచ్చేశాక) రుట్టీ దాదాపు పూర్తిగా ఒంటరిదైపోయింది. చుట్టూ ప్రపంచంలో ఎంతో ఉన్నా, ఆమె మాత్రం ఏమీ లేని ఒంటరిదైంది అని కొన్ని నెలల తరువాత సరోజినీ నాయుడు అన్నారు. విడిగా ఒక్కతే ఉంటున్నా, రుట్టీ తండ్రి, సోదరుల వైఖరి ఏమీ మారలేదు. (రుట్టీ పుట్టిల్లు) పెటిట్‌ హాలు తలుపులు ఆమెకు తెరుచుకోలేదు. ఆమెను కలవడానికి అడపాదడపా వచ్చే ఒకే ఒక్క బంధువు... లేడీ పెటిట్‌. కానీ, తల్లి వచ్చి వెళ్ళడం వల్ల రుట్టీకి వీసమెత్తు ఉపయోగం లేకపోగా, మరింత చీకాకుకీ, కుంగుబాటుకీ లోనయ్యేవారు. (జిన్నా, రుట్టీల మిత్రుడు) కంజి ద్వారకాదాస్‌ మాత్రం రోజూ వచ్చి రుట్టీని చూసి వెళుతుండేవాడు. 1929 జనవరి, ఫిబ్రవరిల్లో రుట్టీ అనారోగ్యం అలాగే కొనసాగింది. దాంతో, ఆమె మరింత కుంగిపోయింది. అప్పట్లో డిప్రెషన గురించి పెద్దగా తెలీదు. దాంతో, మానసిక క్షోభే ఆమె తీవ్ర అనారోగ్యానికి అసలు కారణమని అతనికి తట్టలేదు. ఆమె బయటకు వెళ్ళడమే మానేసింది కాబట్టి, కాస్తంత అలా కలసి నడుద్దామనీ... ఇలా రకరకాలుగా ఆమెలో మళ్ళీ ఉత్సాహం నింపడానికి ప్రయత్నించాడు. ఆమెకున్న ఆధ్యాత్మిక ఆసక్తిని మళ్ళీ పైకి తీసేందుకు ప్రయత్నించాడు. జిడ్డు కృష్ణమూర్తితో సహా తన దివ్యజ్ఞాన సమాజం మిత్రులందరినీ ఆమె దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆమె ఆరోగ్యం గురించి అడుగుతూ, జిడ్డు కృష్ణమూర్తి కంజికి ఉత్తరం కూడా రాశారు. కానీ, ఎందుకనో రుట్టీ మనసు ఆధ్యాత్మికత సహా, దేని మీదా లేదు. నిద్ర మాత్రల్లో సాంత్వన వెతుక్కుంది.
 
ఊహించని ఫోన కాల్‌
రుట్టీ పుట్టినరోజున ఆమెకు ఫోన చేసి, శుభాకాంక్షలు చెప్పడం జిన్నాకు ఎప్పుడూ అలవాటు లేదు. బొంబాయిలో రుట్టీ ఏ పరిస్థితిలో ఉందో తెలియని జిన్నా ఆ రోజు సాయంత్రం బాగా పొద్దుపోయాక, ఢిల్లీలోని వెస్ట్రన కోర్టులో చమన లాల్‌తో కూర్చొని ఉన్నారు. ఇంతలో బొంబాయి నుంచి ట్రంక్‌ కాల్‌ వచ్చింది. ఆ రోజు రాత్రే బయలుదేరి వస్తానని అవతలివాళ్ళకు చెప్పి, జిన్నా ఫోన పెట్టేయడం చమన లాల్‌ విన్నారు. జిన్నా, చమన లాల్‌ వైపు అడుగులు వేస్తూ వచ్చి, ‘రుట్టీ ఆరోగ్యం అస్సలు బాగా లేదట. ఇవాళ రాత్రే నేను వెళ్ళాలి’ అన్నారు. ఒక్క క్షణం ఆగి, ‘ఫోనలో అవతలి వైపు నుంచి మాట్లాడింది ఎవరో తెలుసా’ అన్నారు. ఆ ప్రశ్నకు చమన లాల్‌ బదులిచ్చే లోపలే, మళ్ళీ జిన్నాయే జవాబు చెప్పారు. ‘మాట్లాడింది మా మామ గారు. రుట్టీతో పెళ్ళి తరువాత మేమిద్దరం మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి’ అన్నారు. తీరా మరునాడు ఉదయం బొంబాయికి ట్రెయినలో ఉండగా వైస్రాయ్‌ నుంచి సంతాప సందేశం టెలిగ్రామ్‌ రావడంతో రుట్టీ ఇక లేదన్న వార్త జిన్నాకు చేరింది.
 
అబ్బాయికి 40.. అమ్మాయికి 16
ప్రపంచానికి పెద్దగా తెలియని మహమ్మద్‌ అలీ జిన్నా జీవిత పార్శ్వానికి అద్దం ఈ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ జిన్నా...’ పుస్తకం. అప్పుడు జిన్నాకు నలభై ఏళ్ళు. స్నేహితుడైన బొంబాయిలోని పార్శీ ధనికుడు సర్‌ దిన్షా పెటిట్‌ కూతురి ప్రేమలో పడ్డాడు. అందంగా, చురుగ్గా ఉండే ఆ అమ్మాయి (రత్తనబాయ్‌... రుట్టీ పెటిట్‌) వయసు పట్టుమని పదహారేళ్ళే. విషయం తెలిసి, అమ్మాయి తండ్రి అగ్గిరాముడయ్యాడు. దిన్షా కోర్టు కెక్కాడు. కానీ, పద్ధెనిమిదేళ్ళు నిండాక ఆ అమ్మాయి మాత్రం జిన్నానే పెళ్ళి చేసేసుకుంది. పెళ్ళికి ముందు ఆ అమ్మాయి రహస్యంగా ఇస్లామ్‌ మతంలోకి మారింది. ఈ వివాహం, ఆ తరువాత వారిద్దరి జీవితాలకు అక్షరరూపం ఇవ్వడానికి రచయిత్రి షీలా రెడ్డి వెలుగులోకి రాని లేఖలనూ, సమకాలికులు చెప్పిన సంగతులనూ ఆధారంగా చేసుకొన్నారు.
 
ఎందుకని సంచలనం?
రెండు వేర్వేరు మతాలు, రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరి వివాహబంధం అది. అందం, ఆధునిక వస్త్రధారణ, చదువు, భారత రాజకీయాల పట్ల అమితమైన ఆసక్తి ఉన్న రుట్టీ, జిన్నాను ఆరాధించింది. అయితే, రాజకీయాల్లో జిన్నా మునిగిపోవడంతో, రుట్టీ డిప్రెషనలోకి వెళ్ళిపోయింది. 1929 ఫిబ్రవరి 20న తన పుట్టిన రోజు నాడే, 29 ఏళ్ళ చిన్న వయసులో తన ఒక్కగానొక్క కూతురు దినాను వదిలేసి, కన్నుమూసింది. ఎప్పుడూ మంచం పక్కనే నిద్ర మాత్రలు పెట్టుకొనే రుట్టీ పుట్టినరోజు నాడే చనిపోవాలని నిద్రమాత్రలు మింగింది. బొంబాయిలోని మజగావ్‌లో ఖోజా ముస్లిమ్‌ వర్గపు గోరీల దొడ్డిలో ఆమె భౌతిక దేహాన్ని ఖననం చేశారు. భావోద్వేగాలకు అతీతుడిగా జిన్నాకు పేరు. ఇంతలో రుట్టీ దేహాన్ని సమాధిలోకి దింపారు. ముందుగా మట్టి వేయడం కోసం జిన్నాను పిలిచారు. అంతే. జిన్నా దుఃఖం కట్టలు తెచ్చుకుంది. పసిపిల్లాడిలా ఆయన విలపించారు. ఆ తరువాత ఆయన మళ్ళీ వేరొకరిని పెళ్ళి చేసుకోలేదు. జిన్నా, రుట్టీల ప్రేమ కథ అచ్చం ప్రసిద్ధ మిల్స్‌ అండ్‌ బూన్‌ ఆంగ్ల నవలల లాగా మొదలై, చివరకు షేక్‌స్పియర్‌ విషాదాంత రచనల తరహాలో ముగిసిపోవడం విచిత్రం.
 
రాసింది మన హైదరాబాదీయే!
‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ జిన్నా...’ పుస్తక రచయిత్రి షీలా రెడ్డి ప్రముఖ జర్నలిస్టు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రసిద్ధ జర్నలిజమ్‌ అండ్‌ మాస్‌ కమ్యూనికేషన శాఖలో 1973 నాటి బ్యాచ విద్యార్థిని. ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న ఆమె మూడున్నర దశాబ్దాల పైగా వివిధ జాతీయ దినపత్రికల్లో, మ్యాగజైన్లలో పనిచేశారు. ఈ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ జిన్నా...’ ఆమె రెండో పుస్తకం. సరోజినీ నాయుడు కుమార్తెలైన పద్మజ, లీలామణి నాయుడు భద్రంగా దాచి ఉంచిన అనేక వ్యక్తిగత లేఖలు ఈ పుస్తకానికి ప్రాథమిక ఆధారమయ్యాయి. నిజానికి, ఇరవయ్యో శతాబ్దపు తొలి అర్ధభాగంలోని సామాజిక చరిత్రకూ, హైదరాబాద్‌ చరిత్రకూ ముడిసరుకైన సరోజినీ నాయుడు, ఆమె కుమార్తె పద్మజ తదితరుల విలువైన రచనలు, లేఖలు, పుస్తకాలు, ఫోటోలు కొన్ని ఇప్పుడు పట్టించుకొనే నాథుడు లేక, మూటలో పడి మూలుగుతున్నాయి. హైదరాబాద్‌ నడిబొడ్డున కోట్ల విలువ చేసే సరోజినీ నాయుడు స్థిరాస్తులను వాడుకుంటున్న హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ సహా ప్రభుత్వ సంస్థలేవీ వీటి గురించి పట్టించుకోవట్లేదని చరిత్ర, సాహిత్య ప్రియులు వాపోతున్నారు.
 
‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ జిన్నా...
ద మ్యారేజ్‌ దట్‌ షూక్‌ ఇండియా’
రచన: షీలా రెడ్డి, ప్రచురణ: పెంగ్విన
పేజీలు: 421, వెల: రూ.699