భార‌త ఐతిహాసిక గ్రంథాల్లో రామాయ‌ణం విశిష్ట‌మైన‌ది. రామ‌నామం రామనామాన్ని ఒక్క‌సారి ఉచ్చరించినా, కష్టాలకడలి నుంచి గట్టెక్కినట్టే అంటారు పెద్దలు. మరి అంత‌టి మ‌హిమ గ‌ల రాముడి జీవిత ఇతిహాసమైన రామాయణం భావితరాలకు ఆద‌ర్శ‌ప్రాయం, అనుస‌ర‌ణీయం. ఇప్ప‌టివ‌ర‌కు వాల్మీకి రామాయ‌ణం ఆధారంగా చేసుకొని ఎన్నో రూపాల్లో రామాయణ గ్రంథాలు వచ్చాయి. వినూత్న ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తూ రాసిన ఆ రామాయణ గ్రంథాలు కూడా ఎందరికో మార్గదర్శకాలుగా ఉన్నాయి. కానీ వాల్మీకి రామాయ‌ణాన్ని మ‌రింత స‌ర‌ళీకృతం చేస్తూ రాసిన ఈ ‘కల్పవృక్షము’  విశిష్ట‌మైన‌ది. భాష‌, వాక్య‌నిర్మాణం స‌ర‌ళంగా ఉండి, పిల్ల‌ల నుంచి పెద్ద‌ల దాకా ఆక‌ట్టుకుంటుంది. చ‌దివింప‌జేస్తుంది. రామాయ‌ణాన్ని 180 భాగాలుగా విభ‌జించి బొమ్మ‌ల‌తో, స‌రికొత్త విధానంతో పాఠకులకు అందించారు రచయిత విశ్వనాధ శోభనాద్రి. రామాయ‌ణ ప్ర‌శ‌స్తిని, రాముడి విశిష్ట‌త‌ను మరింత సరళతరం చేసి, చెప్పటంలో విజయం సాధించారు. ఆ విషయంలో రచయిత కల నెర‌వేరింద‌నే చెప్పాలి. ఇలా ఒక ఐతిహాసాన్ని అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా భాగాలుగా విడ‌గొట్ట‌టం చాలా క‌ష్ట‌త‌ర‌మైన కార్యం. ఆ కార్యాన్ని సుసాధ్యం చేసి వాల్మీకి రామాయ‌ణం మొత్తాన్ని 329పేజీల్లో పాఠకులకు అందించారు. ముఖ్యంగా భావిత‌రాలు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. 

 

కల్పవృక్షము
వాల్మీకి రామాయణ కథలు
రచయిత: విశ్వనాధ శోభనాద్రి
పేజీలు: 329
ధర: 500 రూపాయలు
ప్రతులకు: విశ్వనాధ శోభనాద్రి చారిటబుల్‌ ట్రస్ట్‌
16–2–836/B/3, ఎల్‌ఐసి కాలనీ, సైదాబాద్‌,
హైదరాబాద్‌–59.ఫోన్‌: 24166669, సెల్‌: 94406 66669