కాశీ చూపించిన కంఠుగాడు

సగం ట్రావెలాగ్‌, సగం కథ కలిసిన సమగ్ర కథనం ‘కంఠుగాడి కాశీయాత్ర’. జగన్నాథ శర్మ చేసిన ఈ రచన నవ్య వీక్లీలో ధారావాహికగా వెలువడింది కూడా. కంఠు అనే వ్యక్తి తన స్నేహితులతో చేసిన కాశీయాత్రను వివరించే ఈ రచన కాశీ ప్రాదేశిక ఆధ్యాత్మికతను పిట్టకథల రూపంలో చెప్పడమే కాదు, కాశీయాత్ర గురించి అక్కడి పరిసర ప్రాంతాల గురించీ ఒక ప్రాథమిక అవగాహనను ఏర్పరుస్తుంది. హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన కాశీనగరాన్ని దర్శించి, గంగా నదిలో మునిగి తీరాలనే మొక్కును తీర్చుకొనే క్రమంలో కంఠు అతని మిత్ర బృందం అనుభవించిన సంఘర్షణలూ, పొందిన అనుభూతులనూ నాటకీయత మేళవించి వివరిస్తాడు రచయిత. అదే సమయంలో సమకాలీన కాశీ, దాని పరిసర పర్యాటక ప్రాంతాలలో యాత్రికులు దోపిడీ అయ్యే విధానాలనూ, పద్ధతులనూ వినోదాన్నీ వ్యంగ్యాన్నీ మిళితం చేసి అర్థం చేయిస్తుందీ రచన. ఒక క్రమ పద్ధతిలో విషయాన్ని వివరించి ఉంటే ఇది మరింత మంచి రచన అయి ఉండేది. కథనం చివరలో కాశీయాత్రా చిత్రమాల ఈ పుస్తకానికో అదనపు ఆకర్షణ.
 - డి. లెనిన్‌
 
కంఠుగాడి కాశీయాత్ర 
ఎ.ఎస్‌. జగన్నాథశర్మ
పేజీలు : 80, వెల : రూ.100
ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు