సాహితీ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌
‘మా కథలు’ పేరిట వార్షిక సంకలనాలు ప్రచురిస్తూ పాఠకులకు అతి తక్కువ ధరకు తమ సంకలనాలను అందిస్తూ గొప్ప సాహితీసేవలు అందిస్తున్న ‘తెలుగు కథ రచయితల వేదిక’ తాజాగా 43 కథలతో ‘మా కథలు–2017 సంకలనాన్ని కథాప్రియుల ముంగిటకు తెచ్చింది. అంతేకాదు, తెలుగు కథకు, తెలుగు కథకులకు సహకార పద్ధతిలో మంచి ప్రోత్సాహం అందించించేందుకు విలక్షణమైన రీతిలో సాహితీ ప్రియులకు బపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. తాజాగా వెలువడిన ఈ సంకలనంలోని కథలలో నచ్చిన కథను ఎంపికచేసి, ‘నాకు నచ్చిన రచయిత’ అనే పేరుతో వారికి అవార్డు, లేదా వ్యక్తిగత బహుమతిని స్వయంగా వేదికపై అందించే అవకాశాన్ని సాహితీప్రియులకు అందించింది. 2019లో జరిగే ‘మా కథలు–2018 ఆవిష్కరణ సభలో సాహితీప్రియులకు ఈ అవకాశం లభిస్తుందని వేదిక కన్వీనర్‌ శివరామ ప్రసాద్‌ ప్రకటించడం నిజంగా శుభపరిణామం. కథకు మళ్ళీ జీవం పోసేందుకు ఇది దోహదం చేస్తుంది.

ఇక ఇందులో మొదటి కథ ‘అమ్మకు కోపం వస్తే’, నామని సుజనాదేవి కథ తల్లిని చులకనగా చూసే కుటుంబీకులకు చెంపపెట్టు. చంద్రశేఖర అజాద్‌ కథ ‘అ నైతికం’ స్ర్తీ పురుషుల పవిత్రతను, ప్రాముఖ్యాన్ని, అర్థం చేసుకునే తత్వాన్ని చాటి చెబుతుంది. ఇలా ఇందులో భిన్నమైన కథాంశాలు సమాజాన్ని, విలువలను ప్రతిబింబిస్తాయి. పెయ్యేటి శ్రీదేవి, దాసరి శిరీష, శ్రీగిరిరాజు విజయలక్ష్మి, జంధ్యాల మాలతి, పత్తి సుమతి, కొమ్మమూరి సుబ్బలక్ష్మి సహా ఏడెనిమిదిమంది రచయిత్రుల కథలు, సలీం, ఎలక్ర్టాన్‌, ఎన్‌.కె.నాగేశ్వరరావు, జియో లక్ష్మణ్‌, విహారి, సింహప్రసాద్‌, ప్రభాకరజైని, తదితరుల కథలున్నాయి.  

 

మా కథలు 2017
సంకలనకర్త సిహెచ్‌.శివరామ ప్రసాద్‌
ధర 99 రూపాయలు
పేజీలు 326
ప్రచురణ తెలుగు కథా రచయితల వేదిక, హైదరాబాద్‌–72
ప్రతులకు విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవచేతన, నవతెలంగాణ బుక్‌హౌస్‌లు