తెలుగు సాహితీలోకానికి చిరపరిచితులు ఏనుగు నరసింహారెడ్డి. ప్రపంచ తెలుగు మహాసభల(2017–హైదరాబాద్‌) నిర్వాహకులలో ఒకరు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి. ఆయన కవిత్వంలో ఆర్ర్దత కనిపిస్తుంది. నందిని సిధారెడ్డి మాటల్లో చెప్పాలంటే, అంతరంగ వేదనను పొల్లుబోకుండా అక్షరీకరించే కవి నరసింహారెడ్డి. 62 కవితలున్న ఈ సంపుటిలో టైటిల్‌ కవిత ‘మూల మలుపు’ వంకర టింకర దారుల్లో ముళ్ళమీద నడిచే మనిషికి ఓ భరోసాగా నిలుస్తుంది. ‘ఎవరూ ఈ లోకానికి ఎక్కువ కాలం అక్కరలేదు/అందుకే/పొద్దుగూకకముందే/గూట్లో దీపం పెట్టడం మంచిది’ అంటూ కర్తవ్యబోధ చేస్తారు కవి. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసే నాగరిక మనిషిని డబ్బుజెండాలెత్తిన సిమెంటు కీకారణ్యంలో పోల్చుకోవడం ఎవరితరం కాదంటూ వ్యక్తం చేసిన ఆవేదన కవి అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. ఇందులోని కవితలన్నీ మనల్ని బొడ్లో చెయ్యేసి నిలబెట్టి ఆలోచింపజేస్తాయి.

 

మూల మలుపు
ఏనుగు నరసింహారెడ్డి కవిత్వం
ధర 100 రూపాయలు
పేజీలు 152
ప్రతులకు పాలపిట్ట బుక్స్‌, హైదరాబాద్‌–36 ఫోన్‌ 040–27678430