కవి, కథకుడు, సి.ఎస్‌.రాంబాబు. వృత్తిరీత్యా ఆకాశవాణి హైదరాబాద్‌ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌ అయినా, ప్రవృత్తరీత్యా పలు సాహితీ ప్రక్రియల్ని సృజించే రచయిత. ఇప్పటికే ఆయన కథా, కవితా సంకలనాలు వెలువరించారు. మహామనీషి షిర్డి సాయి ఆశీర్వాదబలంతో రాంబాబు వెలువరించిన సాయి కవితా సంకలనమే ఈ ‘నివేదన–సాయి లహరి’. 

గురుపూర్ణిమ నుంచి గురుపూర్ణిమ వరకు ప్రతిగురువారం సద్గురు పాదాలకు రాంబాబు సమర్పించిన కవితాపుష్పాల తోరణమిది. సబ్‌ కా మాలిక్‌ ఏక్‌ హై అంటూ నూరేళ్ళక్రితం ఇలనడచిన పుణ్యపురుషుడు, అత్యున్నతమైన మానవీయ విలువల్ని ఆవిష్కరించిన షిర్డి సాయి స్ఫూర్తిని నింపుకుని నిత్యజీవితంలో ఏ కొంతైనా ఆ విలువల్ని పాటించేందుకు దోహదం చేసే 54 కవితా కుసుమాలు. ‘నిరతాగ్నిహోత్రుడవై/మా పాపాలను కాల్చేస్తావే/మాలోని అహంకార జ్వాలలను ఆర్పేస్తావే.... చిక్కుముడుల చిక్కులు తీసే ధైర్యపు శ్వాసవు నీవే/ఆత్మవిశ్వాసపు ఊపిరి నీవే...కష్టాలు కన్నీళ్ళు కలిసి దాడిచేస్తుంటే/కడలిలో నావలా...రక్షించె రాముడివి నీవె కదా...సద్గురువు నీవె కదా...అనే కవి అంతరంగ నివేదన మనవెంట సాయి తోడుగా నిత్యపాఠమై రక్షిస్తుంది. ఈ కవితలన్నీ మనలో స్థైర్యాన్ని నింపేవే.

నివేదన – సాయి లహరి 

సి.యస్‌. రాంబాబు
ధర 50 రూపాయలు
పేజీలు 104
ప్రతులకు  రచయిత , 202, కీర్తనాహోమ్స్‌ , 11–1–530, మైలారగడ్డ, సికింద్రాబాద్‌ –61 
మొబైల్‌ 9490401005, మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు