కవితామృతాన్ని ఒలికించిన శతాధిక కవుల ‘పలుకు’

దేశ విదేశాలలో ఒక మంచి ఆంగ్ల కవిగా, మంచి తెలుగు కవిగా, గజల్‌ రచయితగా పేరుపొందిన అంతర్జాతీయ కవి రోచిష్మాన్‌ శ్రమఫలమే 116 మంది కవుల కవితలు, పద్యాలు గజళ్ళ సంకలనమైన ‘పలుకు’. రోచిష్మాన్‌ పిలుపుతో కుల, మత, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా ఎందరో కవులు సృజించిన వచన కవితలు, పద్యాలు, గజళ్ళ సమాహారమే ఈ పలుకు. వర్ధమాన కవులు, యువకవులు, అనుభవజ్ఞులైన కవులతో బాటు పదేళ్ళ పసిప్రాయంలోని బాలకవులకు కూడా ఇందులో సముచితాసనం లభించడం విశేషం.
 
కొత్తగా కవితలు రాయడం ప్రారంభించిన వారితోను, రాయగలమో లేదోనన్న సందేహంతో కొట్టుమిట్టాడుతున్నవారితోను కవితలు పలికించే ఒక నూతన ఒరవడికి ఈ పలుకుతో శ్రీకారం చుట్టారు. రాసే కవిత చాలా గొప్పగా ఉండాలేమో.. తమ కవిత అలా ఉంటుందో లేదోనని భావించినవారిని కూడా, ముందు రాసేయండి మున్ముందు ఇంకెంతో బాగా రాయగలరు.. అని ప్రోత్సహించి ఈ అందమైన పలుకులను అందరికీ అందించడంలో రోచిష్మాన్‌ కృతకృత్యులయ్యారు. ఆయన ఆహ్వానంతో తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 500 మంది కవులు సంప్రదించి తమ రచనల్ని పంపగా, వాటిలోనిభావుకత, మనోభావాలు, భావావేశం, ఆశయాలను గుర్తించి అందులో నేటి సామాజిక స్థితిగతుల్ని ప్రతిబింబించే 116 ఆణిముత్యాల్లాంటి కవితల్ని పలుకు కోసం ఎంచుకున్నారు.
 
అతడు కవియట! అతణ్ణి చిరునవ్వులతో అభిషేకిద్దాం.. అని పిలుపునిచ్చిన డాక్టర్‌ గోపి స్వాగతకవితా ద్వారం గుండా కొత్త కవులకు ఈ పలుకు సాదర స్వాగతం పలికింది. మరో విశేషం ఏమిటంటే 10 సంవత్సరాల పసికవయిత్రులు ఉషా తేజస, పాలకుర్తి సంతోషి తమదైన భాషలో అమ్మ, నాన్నల గురించి రాసిన రెండు కవితల్ని కూడా ఎన్నిక చేసి భావితరాలకు పలుకు పెద్ద పేజీని కేటాయించింది. ఈ కవితలతో పాటుగా మానవ సంబంధాలు, కుటుంబ బంధాలు, జీవన వైవిధ్యం, ప్రకృతి, సంస్కృతి, భాష, కాలం, ప్రేమ, మానవత్వం, మాదకద్రవ్యాలు... ఇలా మన జీవితంతో పెనవేసుకున్న ఎన్నెన్నో అంశాలు ఇతివృత్తంగా నవజాత కవులు, యువకవులు, అనుభవజ్ఞులు సృజియించిన కవితాపుష్పాల్ని పలుకులో ఆస్వాదించవచ్చు.
 
ఏ ఒక్కరి నుంచీ ఆర్థిక సహకారం కోరకుండా తన స్వంత ఖర్చుతో రోచిష్మాన్‌ ప్రచురించిన ‘పలుకు’ కవితా సంకలనం ఆవిష్కరణ 28-01-2018 ఆదివారం నాడు, హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని కళావేదికలో జరిగింది. సాధారణంగా సమ్మేళనాలలో ఏం జరుగుతుందంటే, కవులు చదివిన కవితలన్నీ ఒక సంకలనంగా ఎప్పుడో ప్రచురింతమవుతుంది. అయితే, పలుకు ఆవిష్కరణ మాత్రం ఒక విశేషం. పలుకు ఆవిష్కరణ జరిగిన రోజునే, అదే సభలో కవితాపఠనం చేసిన వెంటనే జన్మనిచ్చిన తల్లి , అపుడే పుట్టిన తన కన్న బిడ్డను కనులారా, ప్రేమగా చూసుకున్నట్టు ప్రతి ఒక్కరూ ఆ పుస్తకంలో తమ పేరును తమ కవితను చూసుకుని మురిసిపోయేలా చేశారు పలుకు సంపాదకులు రోచిష్మాన్‌.
 

వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన రోచిష్మాన్‌ తెలుగు రాష్ట్రంలోనే పుట్టినప్పటికీ, చెన్నై నగరంలో స్థిరపడి, తెలుగు భాషే శ్వాసగా తనదైన శైలిలో ఆంగ్ల, తెలుగు కవితలను, విశేషించి తెలుగులో కూడా గజల్స్‌ వ్రాస్తూ తెలుగుదనాన్ని అందరికీ పంచుతున్నారు. తమిళ భాషలోనూ మంచిపట్టు గల రోచిష్మాన్‌ దేశవిదేశాలలో తన గజల్స్‌, కవితలతో మన బహుభాషీయులను ఆకట్టుకుంటున్నారు.

 

పలుకు ప్రతుల కోసం ఈ పుస్తకానికి సంపాదకులు కూడా అయిన కవి రోచిష్మాన్‌ను +91 94440 12279 ద్వారా సంప్రదించవచ్చు. 

జీ. శ్రీనివాస కుమార్