స్వరాష్ట్రం వదిలిన తెలుగువారు ఎక్కడున్నాగానీ, మాతృభాషను పరిపుష్టం చేయడానికి సమైక్య కృషి చేస్తూనే ఉంటారు. మహారాష్ట్ర నవీ ముంబయిలోని వాషిలో 1978లో కూడా ఇదే ఉద్దేశంతో ‘తెలుగు కళా సమితి’ ఏర్పడి అగ్రశ్రేణి సాంస్కృతిక సంస్థల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందింది. 
2006నుంచి నేటివరకు సమితి ఆరు కవితా సంపుటిలు వెలువరించడమేకాదు, విళంబి నామ ఉగాది సందర్భంగా 2018లో సంగెవేని రవీంద్ర సంపాదకత్వంలో ఈ ‘శతాధిక కవుల సంచిక’ ప్రచురించడం అన్నింటికంటే ప్రత్యేకం.
మహారాష్ట్ర12 నగరాలలో ఉన్న శతాధికంగా ఉన్న తెలుగు కవులను వెదకిపట్టుకుని ఎంతో శ్రమకోర్చి ఈ పుస్తకం ప్రచురించడం తెలుగు కళాసమితి చరిత్రలో ఒక మైలురాయి.

105 మంది కవుల వివరాలు, ఫొటోలు సేకరించి ప్రతిష్టాత్మకంగా వెలువరించారు. ఇందులో 102 కవితలు, పది కథలూ ఉన్నాయి. వీరిలో ముగ్గురు కథారచయిత్రులు, మరో 22 మంది కవయిత్రులూ ఉండటం ఒక విశేషం. థామస్‌రెడ్డి ‘పద్యకథ’ ‘నిశ్శబ్ద స్పోటనం’ ఇంకో ప్రత్యేకత.  ఇందులోని కవితలలో వలస బతుకుల్లోని మనోవేదనలు, రాజకీయ, సామాజిక వర్తమాన సంక్షోభాలపై వెలిబుచ్చిన ఆవేదనలు, విలువలకోసం, మనసున్న మనుషులకోసం పడే తపన, సరికొత్త ఉషోదయాన్ని ఆకాంక్షించే ఉగాది కవితలు కనిపిస్తాయి. ఇక పది కథల్లోనూ కొత్త తరానికి స్ఫూర్తినిచ్చేవే. మానవతావాదాన్ని ప్రతిబింబించేవే.

 

మహారాష్ట్ర తెలుగువారి....
శతాధిక కవుల సంచిక
సంపాదకత్వం  సంగెవేని రవీంద్ర 
ధర 250 రూపాయలు
పేజీలు 264
ప్రతులకు  తెలుగు కళా సమితి, ప్లాట్‌ నెం 13, సెక్టర్‌ – 9ఎ, వాషి, నవి ముంబయి – 400 703 మరియు ప్రముఖ పుస్తక దుకాణాలు