కొత్త పుస్తకం
దాసరి నారాయణరావు...రచయిత, నటుడు, నిర్మాత, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. సమస్య ఎవరిదైనా సరే... తన ఇంటి తలుపు తడితే, భుజం మీదకు వేసుకొనే పరిశ్రమ పెద్ద దిక్కు... గురువును మించిన శిష్యులకు... గురువు గారు! పద్మ అవార్డులు రాకున్నా... అంతకు మించిన గౌరవ సంపన్నుడు. కన్నుమూసినా కళ్ళ ముందే మెదులుతున్న ఆయన వృత్తిగత, వ్యక్తిగత జీవితంలోని చాలామందికి తెలియని విశేషాలతో... సీనియర్‌ సినీ జర్నలిస్టు పసుపులేటి రామారావు రాసిన ‘తెర వెనుక దాసరి’ పుస్తకం హైదరాబాద్‌లో హీరో చిరంజీవి తదితర ప్రముఖుల చేతుల మీదుగా విడుదలయింది. ఆ పుస్తకంలోని కొన్ని భాగాలు...

దర్శకుడిగా దాసరి పేరు తీసేసిన నిర్మాత!

దాసరి లాంటి ఒక నూతన దర్శకుడికి ఇచ్చిన మాటకు కట్టుబడి, డిస్ట్రిబ్యూటర్లెవరి సహకారం లేకుండానే ‘తాత- మనవడు’ సినిమా తీసి, రిలీజ్‌ చేయడానికి సిద్ధపడి, షూటింగ్‌ మొదలుపెట్టారు నిర్మాత కె. రాఘవ. అలా ధైర్యంగా దాసరికి తొలి దర్శకత్వ అవకాశం ఇచ్చిన అలాంటి నిర్మాతకు వందనాలు చెప్పాలి. ‘తాత-మనవడు’ అఖండ విజయం సాధించాక రెండో చిత్రం ‘సంసారం-సాగరం’ కూడా దాసరి దర్శకత్వంలోనే రాఘవ తీశారు. అదీ ఘనవిజయమే. మూడో చిత్రం ‘తూర్పు-పడమర’. దానికి మాతృక కె. బాలచందర్‌ తమిళంలో దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగళ్‌’. తెలుగు రీమేక్‌ దాసరి దర్శకత్వంలో పూర్తయింది.
 
ఇంకొక్క పాట చిత్రీకరణ మాత్రం ఉంది. ఈలోగా దాసరికి మరో చిత్రం వచ్చింది. ఆ చిత్ర ప్రారంభానికి దాసరి హైదరాబాద్‌ వెళుతున్నారు. అది తెలిసిన ప్రతాప్‌ ఆర్ట్స్‌ రాఘవ గారు, దాసరి కారుకు అడ్డం వచ్చి, పాటను పూర్తి చేసి హైదరాబాద్‌ వెళ్ళమని గొడవ పెట్టారు. అయితే, అంతకు ముందే దాసరి ఆ పాటను పూర్తి చేయడం లేదని, పోస్టర్స్‌ గుద్దించి, ఆ పోస్టర్‌లో దర్శకుడి స్థానంలో ఆఫీస్‌ బాయ్‌ గోపాల్‌ పేరు వేశారు. అది తెలిసిన దర్శకుడు కె. బాలచందర్‌, రాఘవకు ఫోన్‌ చేసి, గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. ‘ఆ ఆఫీస్‌ బాయ్‌ పేరు తీసేయకపోతే నీ సినిమాయే రిలీజ్‌ కాకుండా చేస్తా’మన్నారు. దాంతో, రాఘవ దిగొచ్చి, తిరిగి దాసరి పేరు వేశారు.
 
 నీ కథ బాగుంది కానీ....
ఎవరైనా కొత్త దర్శకులొచ్చినా, రచయితలొచ్చినా దాసరి భలే ఆనందిస్తారు, గౌరవిస్తారు. నేను వేర్వేరు సందర్భాల్లో ఇద్దరు కుర్రాళ్ళను తీసుకెళ్ళా. మొదటి వ్యక్తి పేరు వెంకటేశ్‌. కథంతా చెప్పాక, దాసరి ‘నీ కథనే నేను మళ్ళీ చెబుతా’ అని మా వెంకటేశ్‌ చెప్పిన కథనే టకటకా మూడు వేర్వేరు కథలుగా చెప్పారు. ఆయన చెప్పిన కథల్లోని పాయింట్‌ వెంకటేశ్‌ చెప్పిన కథలోదే. కానీ, గుండెకు అతుక్కుపోయేలా చెప్పారు. వెంకటేశ్‌ పాదాభివందనం చేసేశాడు. అప్పుడు దాసరి, ‘బాబూ! నా దృష్టిలో కథ ముఖ్యమే. కానీ కథనం ఇంకా ముఖ్యం. జనానికి ఏది నచ్చుతుందని తెలుసుకోవడంలోనే దర్శకుని తెలివితేటలుంటాయి’ అని చెప్పారు. కథను అప్పటికప్పుడు మూడు, నాలుగు రకాలుగా చెప్పడమనే క్రియేటివిటీ ఒక్క దాసరిలోనే చూస్తాం. అందుకే ఆయన 150 సినిమాలకు కథలు రాయగలిగారు. శిష్యులకెన్నో కథలిచ్చారు. కథలు తెచ్చుకుంటే, స్ర్కీన్‌ప్లే రాసిచ్చేవారు.
 
దాసరిపై ‘బొబ్బిలిపులి’ కోపగించిన వేళ...
ఎన్టీఆర్‌ అయితే తరచూ దాసరిది కంప్యూటర్‌ బ్రెయిన్‌ అనేవారు. ఏయన్నార్‌ అయితే ఆయనను బాగా పొగిడేవారు. ఎన్టీఆర్‌, ఏయన్నార్లకు మాత్రమే ఆయన సబ్జెక్ట్స్‌ చెప్పేవారు. లేదా క్యారెక్టర్స్‌ చెప్పేవారు. తక్కిన ఏ హీరోకైనా సింగిల్‌ లైన్‌ స్టోరీ మాత్రమే చెప్పేవారు. అందరూ ఆయన చెప్పిందానికి సరేనని, సినిమా చేసేసేవారు. ఆ ప్రముఖులకూ, నిర్మాతలకూ దాసరి ప్రతిభాపాటవాలపై అంత నమ్మకం ఉండేది! దాసరి తన రెండో, మూడో చిత్రాల నాటి నుంచే సెట్లోనే డైలాగ్స్‌ రాయడం, సీన్లు మార్చడం చేసేవారు. దీనికి మొదటి కారణం బెటర్‌మెంట్‌. రెండో కారణం ఎక్కువ చిత్రాలు ఒప్పుకోవడం... తనే కథ, తనే మాటలు, తనే పాటలు రాసుకోవడం... రోజుకు రెండు మూడు షిఫ్టులు పనిచేయడం. ఎన్టీఆర్‌ ‘బొబ్బిలిపులి’ చిత్రానికీ అదే జరిగింది. అప్పట్లో ఎన్టీఆర్‌ది వెరీ వ్యాల్యుబుల్‌ టైమ్‌. ‘రాజకీయాలకు వెళుతున్నారు రామారావు’ అన్న టాక్‌ అప్పటికే వచ్చింది. తనను కూర్చోబెట్టి, సెట్లో డైలాగ్స్‌ రాయడం ఎన్టీఆర్‌కి నచ్చలేదు. ఇచ్చిన కాల్షీట్స్‌లో సినిమా పూర్తవదనే భావనకు ఎన్టీఆర్‌ వచ్చారు. ఒకసారి ఎన్టీఆర్‌ సెట్‌కు వచ్చేసరికి దాసరి డైలాగ్స్‌ రాస్తున్నారు. ఎన్టీఆర్‌కి కోపం వచ్చి, సెట్‌ నుండి ఇంటికి వెళ్ళిపోయారు. వెంటనే దాసరి, చిత్ర నిర్మాత వడ్డే రమేశ్‌లు ఎన్టీఆర్‌ ఇంటికి వెళ్ళారు. రామారావు గారు కొంచెం శాంతించాక, ఆ రోజున సెట్లో తాను రాస్తున్న కోర్టు సీన్‌ను చదివి, విత్‌ యాక్షన్‌ దాసరి చూపారు.
 
ఎన్టీఆర్‌ కళ్ళ వెంట ఆనందభాష్పాలు. వెంటనే లేచి, అంత లావుపాటి దాసరిని మనసారా కౌగలించుకొని, ‘‘గో ఎహెడ్‌ నారాయణరావు గారు’’ అన్నారు. ఎన్టీఆర్‌ ఎప్పుడైతే కోపగించి వెళ్ళిపోయారో, అప్పుడే ఏ.వి.ఎం. స్టూడియోలోని ఐదు ఫ్లోర్లలో షూటింగులు జరుగుతున్న అన్ని సినిమాల వాళ్ళకూ విషయం తెలిసిపోయి, రకరకాలుగా ప్రచారం మొదలుపెట్టారు. ఇక ఇక్కడితో ఈ సినిమా సరి అంటూ వాగ్బాణాలు విసిరారు. కానీ, మర్నాడు ఏడు గంటలకే ఏ.వి.ఎం. స్టూడియోలోనే, అదే ఫ్లోర్‌లో క్లైమాక్స్‌ స్టార్ట్‌ అయింది. ఎన్టీఆర్‌ డైలాగ్స్‌కు చిత్ర బృందం అడుగడుగునా కొడుతున్న చప్పట్ల హోరు వింటూ రోజంతా బయటే ఉండిపోయాను.
 
 ఒక జర్నలిస్టు కోసం... ‘శివరంజని’!
బాధితుడైన ఒక జర్నలిస్టు కోసం ఏకంగా ఒక పత్రికనే స్టార్ట్‌ చేయడం అన్నది దాసరికే చెల్లింది. ఒక పెద్ద సంస్థ నడుపుతున్న ఫిలిమ్‌ మ్యాగజైన్‌లో ఆ పత్రిక అసోసియేట్‌ ఎడిటర్‌ కొంపెల్ల విశ్వం వ్యక్తిగతంగా మూడు పేజీల ఆర్టికల్‌ దాసరిని పొగుడుతూ రాశారు. దాంతో ఆ జర్నలిస్టును వెంటనే పత్రిక నుంచి తొలగించారు. దాసరి గారి దగ్గరకు విశ్వం వచ్చి, ఈ విషయాన్ని చెప్పుకున్నారు. వెంటనే, ‘శివరంజని’ సినిమా పత్రికను స్టార్ట్‌ చేసి, దాని నిర్వహణ బాధ్యతలను విశ్వానికి అప్పగించారు.
 
 
 కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం
ఉక్కుమనిషి లాంటి దాసరి కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలూ చూశాను. కొన్ని రాజకీయ కారణాల వల్ల... దాసరి ఉండే ‘మద్రాసు బజుల్లారోడ్డులోని 45వ నంబర్‌ ఇల్లు వేలం ఫలానా తేదీన జరుగుతుంది, వచ్చి పాడుకోవచ్చు...’ అని సుప్రసిద్ధ తమిళ దినపత్రిక ‘దినతంతి’లో ఫ్రంట్‌ పేజీలో వచ్చింది. ఒకరికి ఇవ్వాల్సిన బాకీ విషయంలో కుట్రపూరితంగా, పూర్తిగా రాజకీయ కారణాలతో ఆ ప్రకటనను వేయించారు. బజుల్లా రోడ్డులోని ఆ ఇంటి హాలులో దాసరి గారికి ఎదురుగా నేను కూర్చున్నాను. కుర్చీలో కూర్చున్న గురువు గారి కళ్ళలో నీళ్ళు!
 
సంస్మరణ పెట్టిందీ ఆయనే!

నాడు మద్రాసులో మన చిత్రరంగంలో ఎవరు చనిపోయినా, వారింటికి వెళ్ళి పరామర్శించేది, ఏదైనా సహాయం కావాల్సి వస్తే అందించేది, సంతాప సభలు పెట్టిందీ దాసరే! మహాకవి శ్రీశ్రీ చనిపోతే, అన్నానగర్‌లోని ఆయనింటికి చాలా కొద్దిమంది మాత్రమే వచ్చారు. ఆయన రాసిన పాట వల్ల జాతీయ అవార్డును పొందిన నిర్మాతలు కూడా రాలేదు! కొద్దిమంది రచయితలు మాత్రం వచ్చారు. అందరి కంటే ముందు అక్కడకు వచ్చినవారు దాసరి, మాదాల రంగారావు, కె. మురారి. ఆ మహాకవి పాడెను ఒక పక్క దాసరి గారు భుజాన పెట్టుకున్నారు. మరోపక్క రంగారావు పట్టుకున్నారు. వీరిద్దరూ మోయగా ఆ పార్థివ శరీరం అన్నానగర్‌ శ్మశానవాటికకు బయలుదేరింది.

అలాగే, అద్భుత దర్శకుడు టి. కృష్ణ చనిపోతే పట్టించుకున్నవాళ్ళే లేరు. దాసరి నన్ను పిలిచి, ‘‘రామారావ్‌! ఏదైనా హాలు బుక్‌ చెయ్‌. సంతాపసభ పెడదాం. ప్రెస్‌ను కూడా పిలువు...’’ అన్నారు. వెంటనే అలాగే చేశాను... ఆత్రేయ గారు చనిపోతే పట్టించుకున్నవాళ్ళు లేరు. దాసరి గారే తనింటి పక్కనే ఉన్న కల్యాణమండపం బుక్‌ చేసి, సంతాపసభ ఏర్పాటు చేశారు. నిర్మాత మురారి ముందుండి అన్ని పనులూ చూశారు... అలాగే పద్మశ్రీ సంస్థ అధినేత, దర్శకుడు పి. పుల్లయ్య గారు, పేకేటి శివరామ్‌, హాస్య నటుడు కె.వి. చలం తదితరులు చనిపోయినప్పుడు కూడా దాసరే ముందుండి కార్యక్రమాలు నిర్వహించారు.
 
అవార్డులు ఎందుకు రాలేదంటే....
ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక పదవులు, అవార్డుల్లో అధిక భాగం పైరవీలు చేసుకోవడం వల్ల వస్తుంటాయని ఇండస్ట్రీలో బహిరంగ రహస్యం. ‘పద్మశ్రీ’కి కానీ, ‘పద్మభూషణ్‌’కి కానీ ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు నామినేట్‌ చేయాలి. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా దాసరి పేరును ఇటు రాష్ట్ర ప్రభుత్వం నామినేట్‌ చేయలేదు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎం.పి ఎవరికి పదవులు ఇవ్వాలో, ఇవ్వకూడదో కేంద్రంలో ఇందుకు సంబంధించిన విభాగానికి సజెస్ట్‌ చేసేవారట. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఆ ఎం.పి. దయాదాక్షిణ్యాల మీదే రావడం, రాకపోవడం జరిగేవి. ఆం ఎం.పీ గారిని ఒక సీనియర్‌ నటుడు ఈ అవార్డుల విషయంలో అదుపులో పెట్టేవారని అంటుండేవారు. ఈ విషయంపై గురువు గారు కొన్నిసార్లు ఆ ఎం.పీని ముఖంపైనే తిట్టడం జరిగింది. ఆ ఇద్దరి వల్ల అన్యాయం జరుగుతోందని జర్నలిస్టుల దగ్గర, దాసరి బరస్ట్‌ అయ్యేవారు. ఆ కోపం, ఆవేశాలు ఆయా వ్యక్తుల దగ్గరకు చేరేవి. మద్రాసు నుంచి చిత్ర పరిశ్రమ భాగ్యనగరానికి తరలివచ్చినా ఆ తంతు కొనసాగింది. అందుచేతనే ఇన్నేళ్ళుగా దాసరికి ఏ అవార్డూ రాకుండా పోయింది. దాసరి బతికున్నప్పుడు అందరి కోసం, అంటే ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల మీద, ఎవరికైనా వ్యక్తిగతంగా అన్యాయం జరిగినా మీటింగ్స్‌లో ఎలుగెత్తి మాట్లాడేవారు. సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. కానీ, ఇప్పుడు ఆయన కోసం ఎవరైనా ఎందుకు పోరాడతారు? పోరాడరు. ఎందుకంటే, ఆయన కుటుంబంలో స్టార్‌ లేడు. ప్రముఖ నిర్మాత కూడా లేడు!
 ************************
 
పదిమందికీ చెప్పాలనే రాశా!
ఈ పుస్తకం నేను తీసుకొస్తున్న ఎనిమిదో పుస్తకం. నా వ్యక్తిగత కారణాల వల్ల ఈ పుస్తకాన్ని తీసుకొచ్చే పరిస్థితులు లేవు. కానీ, నా లాంటి ఎన్నో లక్షల మంది సినీ శ్రామికులు గురువు గారుగా సంబోధించే ‘మై హీరో’ దాసరి గారి మీద పుస్తకం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, నా 45 ఏళ్ళ సినీ జీవిత ప్రయాణంలో అంతటి పోరాటపటిమ గల దర్శకుడిని చూడడం అదే మొదలు, అదే చివర కూడా! అలాంటి ధీశాలితో 40 ఏళ్ళు జర్నలిస్టుగా జర్నీ చేశా. ఇన్ని పుస్తకాలు రాసి, ఆయనపై పుస్తకం రాయకపోవడమన్నది నా మనసుకు బాధ అనిపించింది. రాస్తే... కావాల్సిన ఆర్థిక సహకారం గట్రా ఎలా లభిస్తుందన్న సందిగ్ధావస్థలో ఉండగా ఎందరో మిత్రుల సహకారం వల్ల ఈ పుస్తకం తీసుకువచ్చా.
 
నిజానికి, పుస్తకం పని కొంత జరిగేసరికి హఠాత్తుగా అనారోగ్యం పాలై, అపోలో హాస్పిటల్లో చేరా. ఇంకా చెప్పాలంటే నన్ను నేను మర్చిపోయాను. ఏదో అలౌకికావస్థలోకి వెళ్ళిపోయి, ఏదేదో మాట్లాడేవాడినట. మాటలు గుర్తులేవు కానీ, ఆ స్థితి గుర్తుంది. మనసులో ఏవేవో ఆలోచనలు. ఆ క్షణంలో దాసరి గారు నా ముందుకొచ్చి మాట్లాడుతూ, ‘రాస్తున్నావా’ అంటున్న అనుభూతి. చిత్రంగా అప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాటా గుర్తుంది. దాసరి గారు చనిపోయిన పదిరోజులకు హాస్పిటల్‌లో నాలో ప్రవేశించి, నన్ను ఆవహించి, నాతో మాట్లాడి మాట్లాడి నాతో పుస్తకం రాయించారనుకుంటున్నా.
 
దాసరి జీవితాన్ని దగ్గర నుంచి చూసిన అనుభవంతో ఇప్పుడీ పుస్తకం రాశా. ముఖ్యంగా ఆయన మద్రాసు జీవితం బ్రహ్మాండమైనది. అలాగే, అది ఎన్నో సమస్యల నిలయం. ఆ జీవితానికి సంబంధించిన వైభవాలు, కష్టాలకు సంబంధించిన విశేషాలనే ఈ పుస్తకంలో రాశా. అలాంటి ధీశాలి గురించి తెలుసుకోవడం వల్ల పాఠకుల్లోనూ ధీరోదాత్తత పెరుగుతుందని, నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి గురించి పదిమందికీ చెప్పడం న్యాయమనే ఈ చరిత్ర రాశా!
 
తెర వెనుక దాసరి
రచన: పసుపులేటి రామారావు
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌, ఫోన్‌: 040- 24652387
రచయిత మొబైల్‌: 9392364031
పేజీలు: 248, వెల: రూ.300