తెలంగాణ సాహిత్య చరిత్ర దిశగా...

ప్రత్యేక రాష్ట్రం అవతరించిన తరుణంలో తెలంగాణ సాహిత్యకారులు గత కొంతకాలంగా తమదైన అవగాహనతో... తెలంగాణ సాహిత్యాన్ని, ఉద్యమాల్ని, చరిత్రను పునర్లిఖించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగమే కాసుల ప్రతాపరెడ్డి రాసిన తెలంగాణ సాహిత్యోద్యమాలు పుస్తకం. పాత్రికేయుడిగా, విమర్శకుడిగా ప్రసిద్ధుడైన ప్రతాపరెడ్డి... వివిధ పత్రికల కోసం, సదస్సుల కోసం రాసిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. గత రెండున్నర దశాబ్దాలలో తెలంగాణ సాహిత్యంలో భాగంగా వచ్చిన కథ, కవిత, నవల, విమర్శ... ఇలా విభిన్న ప్రక్రియలపై ఇందులో వ్యాసాలున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నవలకు సంబంధించి రచయిత లోతైన చర్చ చేశారు.

అయితే తెలంగాణ సాహిత్యోద్యమాలు అని పేరుపెట్టిన ఈ పుస్తకంలో... తెలంగాణ ప్రాంతేతరులైన శివారెడ్డి, రహమతుల్లా వంటి వారికి సంబంధించిన వ్యాసాలు కూడా ఉన్నాయి. అవి కనీసం తెలంగాణ సాహిత్యానికో, ఉద్యమానికో సంబంధించినవి కూడా కావు. తెలంగాణ సాహిత్యోద్యమాలకు సంబంధించి ఈ పుస్తకం సమగ్రంగా లేకున్నా... ఆ దిశగా కొంతమేరకు అవగాహన మాత్రం కలిగిస్తుంది. చెప్పాలనుకున్నది ఎటువంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పడం వల్ల... విమర్శతో కూడిన వ్యాసాలైనా కూడా పాఠకులను చదివిస్తాయి.అణచివేత, వనరుల కొరత ఉన్న కాలంలో తెలంగాణ సాహిత్య పరిశోధనకు పరిమితులు ఉండి ఉండవచ్చు. కానీ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన సందర్భంలో భావి అవసరాలకు తగినట్లుగా... లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరముంది. కాసుల ప్రతాపరెడ్డి ఈ పుస్తకంతో ఆ దిశగా మొదటి అడుగు వేశారనే చెప్పవచ్చు.

- చందు

తెలంగాణ సాహిత్యోద్యమాలు, కాసుల ప్రతాపరెడ్డి

పేజీలు : 430, వెల : రూ.275

ప్రతులకు : శ్రీ వెంకటరమణ బుక్‌ డిస్ట్రిబ్యూటర్స్‌,  హైదరాబాద్‌, 96767 99500