ఆధునిక సమాజ సమస్యలకు బౌద్ధ ధర్మమే పరిష్కారం

తెలుగునాట బౌద్ధ సాహిత్య సృష్టికర్త బొర్రా గోవర్ధన్‌.సంక్లిష్టమైన బౌద్ధ సాహిత్యాన్ని సరళభాషలో ప్రజలకు చేరువ చేశారు. ఆయన 96పుస్తకాల్లో 33పుస్తకాలు బౌద్ధ సాహిత్యమే.. హత్యలు, మానభంగాలతో కునారిల్లుతున్న నేటి భారతవ్యవస్థకు బుద్ధుని బోధలే ఏకైక పరిష్కారం అంటున్న బొర్రా గోవర్ధన్‌ ఇంటర్వ్యూ

మాది గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బొర్రావారిపాలెం. మా నాన్నగారు బొర్రా సత్యనారాయణ. అమ్మ అంజమ్మ. ఇద్దరూ వ్యవసాయ కూలీలే. నాన్న జీవితాంతం నిజాయతీగల కమ్యూనిస్టు కార్యకర్తగా జీవించారు. ‘కమ్యూనిస్టు సత్యం’ గా పేరొందారు.1962మార్చి 15వ తేదీన నేను పుట్టాను. మా తాతగారు వెంకట సుబ్బయ్య. గొప్ప స్టోరీ టెల్లర్‌. అద్భుతమైన జానపద కథకుడు. ఆ సాహిత్య వారసత్వమే నాకూ అబ్బింది. తెలుగుమాస్టారు విశ్వనాథం స్కూల్లో బుద్ధుడు, జాషువాల గురించి అద్భుతంగా చెప్పి నాలో సాహిత్యబీజాలు నాటారు. ‘నగరం’ లోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌లో చదువుతున్నప్పుడు దేశభక్తి గీతాలు రాసేవాణ్ణి. ‘మ్రోగింది మ్రోగింది స్వాతంత్ర్య భేరి, విరిసింది విరిసింది విరజాజి మల్లి...’ అనేది నా మొదటి దేశభక్తిగీతం. స్కూలు ప్రేయర్‌లో వందేమాతరం తర్వాత నా గీతాన్ని ఆలపించేవారు. నా సాహిత్య రచనకు అదే గొప్ప ప్రేరణ. ఆ గీతం రేడియోలోనూ ప్రసారమైంది.

ఆ ఉత్సాహంతో అనేక దేశభక్తిగీతాలు రాశాను.మా నాన్నగారి మిత్రులు జనసాహితి కొత్తపల్లి రవిబాబుగారు, పౌరహక్కుల నాయకుడు సి.భాస్కరరావు, ప్రముఖ హేతువాది టి.ఎల్‌.నారాయణగార్లతో సాన్నిహిత్యంవల్ల, నేను హైస్కూల్లో ఉండగానే, వారి దగ్గరకెళ్ళి వారిచ్చే సాహిత్యం చదువుకునేవాణ్ణి.ఇంటర్మీడియట్‌లో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు వాలంటీర్‌గా 15రోజులు సేవలందించాను. అక్కడే విప్లవగ్రూపులతో పరిచయమైంది. చదువుమానేసి ఐదారేళ్ళు పౌరహక్కుల ఉద్యమాల్లో, జనసాహితిలో పనిచేశాను. విప్లవగీతాలు రాశాను. క్రాంతికిరణ్‌ పేరిట పత్రికల్లో కథలు, కవితలు, పాటలు రాశాను.

అలా 1980లో ‘గుండెమంట’ నా మొట్టమొదటి విప్లవ గీతాల సంకలనం వెలువడింది.నా గీతాలన్నీ ఊరూరా పాడేవారు. గీతాలు రాస్తూ, పాడుతూ, జానపద నృత్యాలుచేస్తూ జనసాహితిలో ఇతర రాష్ర్టాల్లో కూడా రాణించాను. ‘పాములవాడు’ అనే కళారూపకం రచించి నటించేవాణ్ణి. పదహారేళ్ళ వయసులోనే శ్రీశ్రీతో నాకు పరిచయం. ఆయనకు క్యాన్సర్‌ వచ్చినప్పుడు 1982లో సతీసమేతంగా వచ్చి వారంరోజులు మా ఇంట్లో ఉన్నారు. సరోజినిగారిని పిన్ని అని పిలిచేవాణ్ణి. 1985 తర్వాత విప్లవ రాజకీయాల నుంచి వైదొలగి, ‘నగరం’లోనే ‘శాంతినికేతిన్‌’ ప్రైవేటు స్కూల్‌ స్థాపించాను.

గుంటూరుజిల్లావ్యాప్తంగా నవోదయ ఎంట్రన్స్‌ కోచింగ్‌లో మా స్కూలు ఎంతో ఖ్యాతి పొందింది.అలా స్కూలు నడుపుతూ, మరోవైపు వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, షట్‌దర్శనాలు సహా ప్రాచీన భారత సాహిత్యాధ్యయనం చేశాను.బాబ్రీమసీదు ఘటనతో మళ్ళీ కలం పట్టాను. తెనాలి గ్రంథాలయోద్యమ నిర్మాత వెలగావెంకటప్పయ్యగారు నాతో విస్తారంగా బాలసాహిత్యం రాయించి నన్నొక రచయితగా తీర్చిదిద్ది తెలుగు ప్రజలకు పరిచయం చేశారు. ప్రాచీన శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, సైన్సు, గణితం, వ్యవసాయంలపై పుస్తకాలు రాశాను. ‘జీవ వికాసం’, ‘కంప్యూటర్‌ కథ’, ‘క్లోనింగ్‌’, ‘విశ్వం’ పుస్తకాలు రాశాను. ‘గణితబాలశిక్ష’ 13 పుస్తకాల సెట్‌ ఎంతో పాపులరై పునర్ముద్రణలు పొందుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ‘కల్లూరి చంద్రమౌళి’ జీవితాన్ని నవలగా రాశాను. దీనికే 2005లో ‘చక్రపాణి–కొలసాని’ నగదుపురస్కారం లభించింది.