కవి, కథకుడు, నవలానాటక రచయిత, రేడియో నటుడు, దర్శకుడు బి. మురళీధర్‌. గిరిజన ప్రాంత ప్రజల జీవితాలను కళ్ళకు కడతాయి ఆయన కథలు. క‍థ రాసినా, నవల రాసినా పాఠకులకు కొత్తదనం కనిపించాలి , కథకు సామాజిక ప్రయోజనం ఉండి తీరాలి అంటున్న మురళీధర్‌ ఇంటర్వ్యూ..

అదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం సొనాల గ్రామంలో 1955జూన్‌ 12న జన్మించారు మురళీధర్‌. తండ్రి బోరి లక్ష్మణ్‌. తల్లి చంద్రభాగబాయి. ఊహతెలిసేలోపే ఆయన తల్లి కాలంచేశారు. తర్వాత అమ్మగా వచ్చిన కమలాబాయి కన్నతల్లి తర్వాత తల్లిగా వారిని సాకి పెంచిపెద్దచేశారు. కుటుంబ అభివృద్ధికి తోడ్పడ్డారు. ఉపాధ్యాయుడుగా ఆయన తండ్రి ఎందరో పేద విద్యార్థులను సొంతఖర్చులతో చదివించి తీర్చిదిద్దారు. తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా మురళీధర్‌ ఒక నవల కూడా రాశారు. ఆదిలాబాద్‌జిల్లాతో నాటికీ నేటికీ మురళీధర్‌కు ప్రగాఢమైన అనుబంధం. బిఎస్సీ చదివి అదే జిల్లాలో వ్యవసాయ ‌శాఖ విస్తరణాధికారి (1978–2013) గా 35ఏ‌ళ్ళు పనిచేశారు.

మాతృభాష‌లో చేవ్రాలు పలువురికి స్ఫూర్తితండ్రి ద్వారా పుస్తక పఠనాన్నీ, తెలుగు లెక్చరర్‌ యడవల్లి ఆదినారాయణరావు స్ఫూర్తితో తెలుగు సాహిత్యంపై మమకారాన్నీ పెంచుకున్నారు మురళీధర్‌. ఆయన సమయమంతా కాలేజీ లైబ్రరీలో పుస్తకపఠనంతోనే గడిచిపోయేది. అప్పుడే, కాలేజీ వ్యాసరచనపోటీల్లో విజేతగా నిలిచి 1975తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు కళాశాల ప్రతినిధిగా హాజరయ్యారు. ‘‘ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరుకావడం నా సాహిత్య ప్రయాణంలో ఒక గొప్ప మలుపు’’ అంటారు మురళీధర్‌.

సినారె, ఆరుద్ర, డి.కామేశ్వరి, రామలక్ష్మి, ఆనాటి శ్రీలంక రేడియో అనౌన్సర్‌ మీనాక్షి పొన్నుదొరై లాంటి ఎందరో ప్రముఖులను ఆ సభల్లో ప్రత్యక్షంగా చూసి వారితో మాట్లాడే భాగ్యం పొందారు. సి.నా.రె లాంటి గొప్పవక్తల ప్రసంగాలు విని ఎంతో ప్రభావితుడైన మురళీధర్‌ తన చేవ్రాలును తెలుగులోకి మార్చుకున్నారు. నేటికీ ఆయన చేవ్రాలు తెలుగులోనే. మాతృభాషలో ఎంతో అందంగా సంతకంచేసే ఏకైకవ్యక్తిగా నాటినుంచీ ఆదిలాబాద్‌జిల్లాలో ఆయనకు మంచిపేరు. ఆయన స్ఫూర్తితో ఆ జిల్లాలో ఎంతోమంది తమ సంతకాన్ని తెలుగులోకి మార్చుకున్నారు.కవిత్వం–క‌థకవిశేఖర పానుగంటి లక్ష్మీనరసింహంగారు మురళీధర్‌ అభిమాన రచయిత.

తిలక్‌ ‘అమృతంకురిసిన రాత్రి’ చదివాక, 1977నుంచీ కవిత్వం రాయడం ప్రారంభించారు. ప్రతిష్టాత్మకమైన ‘భారతి’ పత్రికలో కవితలు రాసి కవిగా గుర్తింపు పొందారు. ‘ఆంధ్రజ్యోతి’ కొత్త కలాలు ‌శీర్షికలో ఆయన కవితలు వచ్చేవి. ‘‘ఆంధ్రజ్యోతి వారపత్రికలో తను రాసిన ‘నిన్ను మరచేదెలా’ కవితకు బాపు ఒక పెద్ద బొమ్మ గీయడం, ఆ బొమ్మతో‍సహా ఆ కవితను బాపు తన షష్ఠిపూర్తి సంచికలో ముద్రించుకోవడం తనకో మధురమైన జ్ఞాపకం’’ అంటారు మురళీధర్‌. తెలంగాణ ఉద్యమ కవితలెన్నో రాశారాయన.ఈ మధ్య మళ్ళీ నవ్య వీక్లీ కవితలపోటీల్లో ఆయన కవిత ‘ఆకుపచ్చని సముద్రపురాజు’ నగదు బహుమతి పొందింది.

వృత్తిరీత్యా ఆదిలాబాద్‌జిల్లా ఏజన్సీ గ్రామాల్లో నిరంతరం సంచరిస్తూ, గిరిజన జీవితాలను ప్రత్య‌క్షంగా పరిశీలించిన అనుభవం ఆయన కథారచనకు ఎంతో దోహదపడింది. ఆయన కథల్లో గిరిజన జీవితాలు కళ్ళకు కడతాయి. ‘అడవిపువ్వు’ (1987) ఆయన తొలికథ. కథలపోటీల్లో తన తొలిక‍థకే బహుమతి అందుకున్నారు. మరో కథ ‘భూదేవి’ ‘ఉదయం’ వారపత్రిక కథలపోటీల్లో ప్రథమ బహుమతి పొందింది. ఒక ఐదు రూపాయలు ముగ్గురు ప్రాణాలు కాపాడిన ఈ కథను ప్రముఖ జర్నలిస్టు పురాణం సుబ్రహ్మణ్యశర్మ ఎంతగానో మెచ్చుకున్నారు. గిరిజన వ్యవసాయ కుటుంబాల జీవనస్థితిని చాటిచెప్పే మరో కథ ‘మౌన మెరుపు’ కూడా ఎన్నో ప్రశంసలందుకుంది.