నాన్న లేని లోకాన్ని ఊహించలేకపోతున్నాం...

పని విషయంలో నాన్న ఎంత సిన్సియారిటీగా ఉంటారో... అందరి దగ్గరా ఆ సిన్సియారిటీ ఆశిస్తారు. పలానా సమయానికి వస్తానంటే ఆ సమయానికి రావాలి. ఒకవేళ ఎక్కడైనా ఆలస్యమైతే ఫోన్‌ చేసి చెప్పొచ్చు కదా, నా పనంతా మానుకుని కూర్చున్నాను అని చిరాకు పడతారు. పని పట్ల నాన్నకి ఉండే నిబద్ధత అలాంటిది. అందరిలోను ఆ నిబద్ధత ఎదురుచూస్తారు. ఉత్తుత్తినే కోప్పడరు. పని మీద శ్రద్ధ లేకపోతేనే కోప్పడతారు. ఎవరైనా ఏదైనా పంపిస్తే అది అందింది లేకపోతే అందలేదు అని ఖచ్చితంగా తెలియజేస్తారు.
 
సుప్రసిద్ధ రేఖాచిత్రకారులు, సినీ దర్శకులు ‘బాపు’ (సత్తిరాజు లక్ష్మీనారాయణ) దూరమై అప్పుడే మూడేళ్లు దాటిపోయింది. తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలా చాటిన ఆ మహానుభావుడి సినీ, కళా ప్రస్థానం జగద్విఖ్యాతం. నేడు బాపు జయంతి సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలను ఆయన కుమార్తె భానుమతి, చిన్న కుమారుడు వెంకటరమణ ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.
 
భానుమతి : నాన్న (బాపు), మామ (రమణ)... మాకు అంతా వాళ్లే. వాళ్లు లేకపోవడం మాకు చాలా పెద్ద లోటు. రమణగారు అకస్మాత్తుగా పోవడం, అమ్మ జబ్బుపడడం, ఆ తరువాత నాన్నగారు... ఇలా ముగ్గురూ వరుసగా దూరం అయ్యేసరికి ఇంకా ఎవ్వరం కోలుకోలేదు.
 

వెంకటరమణ : నాన్న లేరంటే చాలా బాధనిపిస్తుంది. ఎప్పుడూ పైన ఆయన గదిలోనే ఉండేవారు. నేను మొదటి నుండి చివరి వరకు నాన్నతోనే ఉన్నాను. దాంతో ఎప్పుడూ ఇంట్లోనే ఉండే నాన్న ఇప్పుడు లేరు అంటే తట్టుకోవడం కష్టంగా ఉంది.

వారసులు సినిమాల్లోకి ఎందుకు రాలేదంటే...
 
భానుమతి : సినిమాతో మాకసలు సంబంధం లేదని చెబితే ఎవరూ నమ్మరేమో! మామూలుగా మిగతావారి ఇళ్లలో ఎలా ఉంటారో మేమూ అలాగే పెరిగాం. రమణగారిని మామా అని పిలుస్తాం. ఎప్పుడో ఒకసారి సినిమాలకి, ప్రివ్యూలకి వెళ్లేవాళ్లం. ఏదైనా సినిమా బాగుంటే చూడమని చెబుతారు.
 
వెంకటరమణ : ప్రివ్యూలకి నాన్నే తీసుకెళ్లేవారు. ఇప్పుడు కలైవానర్‌ అరంగం ఉన్నచోట అప్పట్లో చిల్డ్రన్స్‌ థియేటర్‌ ఉండేది. అందులో ‘టార్జాన్‌’లాంటి సినిమాలు వస్తే ఆదివారం ఆయనే తీసుకెళ్లేవారు. హాలీవుడ్‌ నటుడు ‘గ్యారీకూపర్‌’ అంటే నాన్నకి అభిమానం. ఎంత ఇష్టమంటే... సినిమాలో విలన్‌ గ్యారీకూపర్‌ని కొడితే ఈయన బాధపడిపోయేవారు. ఇంగ్లీష్‌ సినిమాలు బాగా చూసేవారు. ఫిలిం ఫెస్టివల్‌ జరిగితే ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేవారు. వీడియోలు వచ్చాక ఇంట్లోనే చూడడం అలవాటు చేసుకున్నారు. అయితే నాన్న పక్కన కూర్చుంటే మనం పూర్తిగా సినిమా చూడలేం. ఫార్వర్డ్‌ చేస్తూనే ఉంటారు.
 
భానుమతి : ఆయనకి నచ్చిన సినిమా చెప్పమంటే ఖచ్చితంగా ఒక పేరు చెప్పరు. ఈ సినిమాలో ఇది బాగుంది, ఆ సినిమాలో అది బాగుంది అని సీన్లు చెబుతారంతే. ఫలానా నటుడు ఇష్టమని ప్రత్యేకంగా ఎవరూ లేరు.
 
వెంకటరమణ : ఇంకోటి...చాలామంది నాన్న దగ్గరకి సినిమాల్లో అవకాశం కోసమో, ఇంకో విషయానికో వచ్చేవారు. అయితే సినిమాలంటే చాలు నాన్న అస్సలు ఎంకరేజ్‌ చేసేవారు కాదు. వెళ్లి చదుకోమని చెప్పేవారు.
 

భానుమతి : మా పిల్లల్లోను ఎవరికీ సినిమాలపై ఆసక్తి లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, తమ్ముడికి ఒక కూతురు. రమణగారి ఇంట్లోను ఆడపిల్లలే. ఎవరికీ ఆ దృష్టి లేదు. నాన్న ఖాళీగా ఉంటే పిల్లలందర్నీ దగ్గర కూర్చోబెట్టుకుని కథలు చెప్పేవారు.

అమ్మ కూడా నాన్న బొమ్మలకి మోడలే...
 
వెంకటరమణ : నాన్న బొమ్మలు వేస్తుంటే మేము మోడలింగ్‌ చేసేవాళ్లం.
 
భానుమతి : మోడలింగ్‌ అంటే.. నాన్న గీసే బొమ్మకి కావాల్సిన విధంగా చేతులు, వేళ్లతో పోజులు ఇవ్వడం.
 
వెంకటరమణ : పెన్ను ఇలా పట్టుకో, అలా కూర్చో అని చెప్పేవారు. మా అమ్మ కూడా నాన్న బొమ్మలకి మోడలే. నాన్న అప్పట్లో అడ్వర్‌టైజ్‌మెంట్‌లో ఉండేవారు. ఫోటోలు బాగా తీస్తారు. ఏదో ఒక డ్రింక్‌ యాడ్‌కి, చీరల కంపెనీ కోసం చేసిన యాడ్‌కి అమ్మని చీరలు కట్టుకోమని యాడ్‌కి బొమ్మలు గీసేవారట.
 

భానుమతి : నేను వినలేదుగానీ, నాన్నగారు మౌత్‌ ఆర్గాన్‌ బాగా వాయించేరట. 

బొమ్మలో ఎక్స్‌ప్రెషన్స్‌ నాన్న ముఖంలో కనిపించేవి...

 
వెంకటరమణ : మా చిన్నప్పుడు ఆయన నిద్రపోవడం చాలా తక్కువ. వయసు పెరిగాకే మధ్యాహ్నం పూట కొంచెం విశ్రాంతి తీసుకొనేవారు. పని ముందు.. తరువాతే ఏదైనా. బొమ్మలు గీయడం, పుస్తకాలు చదవడం.. ఏదో ఒక పని. వేకువజామున రెండింటికి, మూడింటికీ కూడా బొమ్మలు వేస్తూ ఉండేవారు.
 
భానుమతి : ఏదైనా పెద్ద ప్రాజెక్టు ఉంటే.. పొద్దున్నే లేచి చేసేవారు. బొమ్మలు వేస్తున్నప్పుడు ఆయన్ని చూడాలి.. భలేగా ఉండేది. బొమ్మలో అమ్మాయి కన్ను ఎలా వేసేవారో ఆ ఎక్స్‌ప్రెషన్‌ నాన్న మొఖంలో కనిపించేది. బొమ్మల్లో ఎక్స్‌ప్రెషన్స్‌ అన్నీ నాన్నలో కనిపించేవి. బొమ్మలు వేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఆయన గదిలోకి వెళ్లి నిల్చున్నా చూడరు. ఎప్పుడైనా నాన్న తల ఎత్తినప్పుడు చూసి పలుకరించాలే తప్ప, లేకపోతే ఆయన పని ఆయనదే.
 
వెంకటరమణ : నాన్న వేసిన బొమ్మలు ఏవి చూసినా మాకు చాలా బాగుండేవి. ఆయనకేమైనా తేడా కనిపిస్తే ఆ బొమ్మ పక్కన పెట్టేసి మళ్లీ గీస్తారు. స్ర్కిప్టులైతే ఇక చెప్పనవసరం లేదు. ఆయన దగ్గర ఎంతమంది అసిస్టెంట్లు ఉన్నా, ఆయన చేత్తోనే రాస్తారు తప్ప, వాళ్లకి పని చెప్పరు.
 
బాపు, రమణ స్నేహం ఎలా కుదిరిందో...
భానుమతి : నాన్నకి, మామకి అంతటి స్నేహం ఎందుకు, ఎలా కుదిరిందో మాకూ తెలీదు. వాళ్ల మధ్య గొప్ప స్నేహం కుదిరింది, అది జీవితాంతం కొనసాగింది.
వెంకటరమణ : అలా మరికొందరు ఉండి ఉండొచ్చు. మనకు తెలిసిన స్నేహితులంటే బాపు-రమణలే. మా చిన్నప్పుడు మైలాపూర్‌, ఆళ్వార్‌పేటలో ఉండేవాళ్లం. ఇప్పుడున్న ఇంటికి 1988లో వచ్చాం.
 
భానుమతి : కింద రమణగారు, పైన మేము ఉండేవాళ్లం. రమణగారి ఇంట్లోనే వాళ్ల అమ్మగారు, అక్కయ్యగారు కూడా ఉండేవారు. పెద్దవాళ్లు కదా.. దాంతో చూడ్డానికి వచ్చేపోయేవాళ్లూ ఎక్కువగానే ఉండేవారు. నాన్న, మామ లేకపోయినా మా రెండు కుటుంబాల్లో ఆ బంధం కొనసాగుతూనే ఉంది. శ్రీదేవిగారు (రమణగారి భార్య) వాళ్లబ్బాయి (వర ముళ్లపూడి-హైదరాబాద్‌) దగ్గరకి వెళ్లకుండా మాతోనే ఉండిపోయారు.
 
బాపు ఆర్ట్‌ కలెక్షన్‌.కామ్‌ ...
భానుమతి : నాన్నకి తెలుగు భాషంటే చాలా ఇష్టం. నా పిల్లలకి తెలుగు చెప్పించలేదని నన్ను సాధించేవారు. నా పిల్లలేమో తెలుగంటే పరుగెత్తుకుని వెళ్లిపోతారు. మీరు పిల్లలకి తెలుగు చెప్పడం లేదని ప్రత్యేకంగా మా ఇంటికి (బాపు ఇంటి వెనుక ఇల్లే) వచ్చి మరీ తిట్టి వెళ్లేవారు. అప్పుడు మామ నవ్వుతూ అనేవారు - అంత చాదస్తం వద్దురా, అన్ని భాషలూ మంచివేలే అని.
 
నాన్న గీసిన బొమ్మలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ‘బాపు ఆర్ట్‌ కలెక్షన్‌ .కామ్‌’ వెబ్‌సైట్‌లో పెడుతున్నాం. ఆయన బిడ్డలుగా పుట్టడం మా అదృష్టం. మేమిద్దరం ఇప్పుడిలా మాట్లాడుతున్నామంటే... నాన్న పైనుండి చూస్తూ ‘వార్నీ... మీరేనా ఇంతలా మాట్లాడుతున్నారు’ అని నవ్వుతూ ఉంటారేమో!
నాన్న దగ్గర సర్జికల్‌ బ్లేడులాంటిది ఉంటుంది. భలే చెక్కుతారు దాంతో. ఇంతదాకా (చూపుడువేలు చూపిస్తూ..) చెక్కుతారు. అయిపోయాక పెన్ను మూతని పెడతారు. అక్కడ రబ్బరు పెట్టారంటే.. అది అక్కడే ఉండాలి.
 
 గనిరెడ్డి అరుణ్‌ కుమార్‌, చెన్నై
ఫోటోలు : కర్రి శ్రీనివాస్‌