బహుగ్రంథ కర్త, ప్రముఖ భాషావేత్త, సుప్రసిద్ధ విమర్శకులు ప్రొఫెసర్‌ వెలమల సిమ్మన్న. విశిష్ట సాహితీవేత్త, ప్రఖ్యాత పరిశోధకులు, ఉత్తమ అధ్యాపకులు, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత. భాషాఐకమత్యం పెంపొందాలంటే మాండలికాలను గౌరవించుకోవాలంటున్నారు ఆయన. మనుగడ కోసం, చైతన్యం కోసం భాషా పాదయాత్రల్ని ఒక ఉద్యమంగా చేపట్టాలనీ, భాషకు పరిపూర్ణత్వం చేకూర్చేందుకు శాస్త్రీయ దృక్పథంతో కూడిన సరికొత్త నిఘంటువుల రూపకల్పనకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలనీ కోరుతున్న సిమ్మన్న ఇంటర్వ్యూ...

శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పుణ్యక్షేత్రం సమీపంలోని తిమడాం గ్రామంలో 1955 మార్చి 1వ తేదీన జన్మించారు సిమ్మన్న. వారిది వ్యవసాయ కుటుంబం. సిమ్మన్న తండ్రి వెలమల కృష్ణమూర్తి. తల్లి ఆరుద్రమ్మ. తండ్రి వెటర్నరీ డాక్టర్‌. రంగస్థల నటుడుగా ఆంజనేయ పాత్రధారిగా ప్రేక్షకులను ఎంతగానో అలరించేవారు. రామాయణ, భారత భాగవత గ్రంథాలు చదువుతూ తన పిల్లలకు చెప్పేవారు. అలా తండ్రి కృష్ణమూర్తికున్న భాషామక్కువను బాల్యం నుంచీ వారసత్వంగా అందిపుచ్చుకున్నారు సిమ్మన్న.ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు ఆడపిల్లలున్న సంతానంలో సిమ్మన్నే పెద్దకుమారుడు. సొంతూరు తిమడాంలోనే చైనులు పంతులుగారి ప్రోత్సాహంతో తెలుగుభాష సహా అన్ని పాఠ్యాంశాలూ శ్రద్ధగా చదివి పదోతరగతి పాసయ్యారు.

తండ్రి ప్రోద్బలంతో ఇంటర్మీడియట్‌లో, బి.ఏలో కూడా స్పెషల్‌ తెలుగే చదువుకున్నారు. విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీలో ఎం.ఏ చేసి, ‘అడివి బాపిరాజు కథలు –కవిత్వం–పరిశీలన’ అనే అంశంపై ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారి సారథ్యంలో పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా తీసుకున్నారు. ఆయన ప్రభావంతోనే అధ్యాపకుడయ్యారు. తను చదువుకున్న ఆంధ్రా యూనివర్సిటీలోనే 1986లో తెలుగుశాఖలో చేరి, 31 సంవత్సరాలు తెలుగుతల్లి సేవలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దిన సిమ్మన్న 2017లో ఆంధ్రవిశ్వకళాపరిషత్‌ దూరవిద్యాకేంద్రం తెలుగు ప్రొఫెసర్‌గా పదవీ విరమణ తీసుకున్నారు. ఎంత సంక్లిష్టమైన విషయాన్నైనా అతి సరళంగా, అర్థమయ్యేట్టు బోధించడం, వివరించడం ఆయన ప్రధాన లక్షణం. నిరంతర గ్రంథ రచన, ప్రచురణలతో సాహిత్యసేవలందిస్తున్నారు.

83 పుస్తకాలు రాశారు

భాష, సాహిత్యం, వ్యాకరణం, భాషాశాస్త్రం, విమర్శ, పరిశోధనా రంగాలకు సంబంధించి 83 గ్రంథాలు రాశారు. 450కి పైగా ఆయన రాసిన పరిశోధనాపత్రాలు ప్రముఖ పత్రికల్లో ముద్రితమయ్యాయి. 160 సెమినార్లలో పాల్గొని పరిశోధనాపత్రాలు సమర్పించారు. 50కిపైగా రేడియో ప్రసంగాలు, వందలాదిసభల్లో ప్రసంగాలు చేశారు. వీరి గైడెన్స్‌లో 28 మంది విద్యార్థులు ఎంఫిల్‌, మరో 16మంది పిహెచ్‌డిలు చేశారు. సిమ్మన్న రచనలపై వివిధ పత్రికల్లో 45వ్యాసాలు వెలువడ్డాయి. భాషా సాహిత్య, వ్యాకరణ విమర్శనాంశాలే ఆయన పుస్తకాలన్నీ. తెలుగుభాషా చరిత్ర (2004), తెలుగు సాహిత్య చరిత్ర (2011), తెలుగు సాహిత్య విమర్శ–సిద్ధాంతాలు(2005), ఆధునిక భాషాశాస్త్రం (2008), బాలవ్యాకరణం–శాస్త్రీయ వ్యాఖ్యానం (2016), యుగకర్త గురజాడ (2018), గిడుగు పిడుగు (2019), నవయుగ వైతాళికుడు వీరేశలింగం (2019) సహా ఆయన పుస్తకాలు తెలుగు విద్యార్థులకు పోటీ పరీక్షలకు, పండితులు, ఆచార్యులకు మార్గదర్శకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఉద్యోగాభిలాషులెవరైనా ఆయన భాషాసాహిత్య పుస్తకాలు తప్పనిసరిగా చదవాల్సిందే.

ప్రపంచభాషల్లో తెలుగు

‘‘ప్రపంచంలో ఆరువేల భాషలున్నాయి. ఈ భాషలను వంశానుగుణం, పదాంశం, భౌగోళికం, ధ్వన్యాత్మకం అనే నాలుగు రకాలుగా వర్గీకరించారు. భారతీయ భాష‌లన్నీ వంశానుగుణ వర్గీకరణలోనే ఉన్నాయి. ఈ భారతీయభాషలను ఇండో–ఆర్యన్‌, ద్రావిడ, ఆస్ర్టో–ఏషియాటిక్‌, టిబుటో–బర్మన్‌ భాష‌లనే నాలుగు రకాలుగా వర్గీకరించారు. వీటిల్లో 23 ద్రావిడ భాషలను ఉత్తర ద్రావిడ, మధ్య ద్రావిడ, దక్షిణ ద్రావిడ భాషలుగా వర్గీకరించారు. ఈ మధ్య ద్రావిడ భాష‌ల్లోనే తెలుగు ఒక భాషగా ఉంటూ మనకు జీవనాడిగా నిలిచింది’’ అని ప్రొఫెసర్‌ సిమ్మన్న చెప్పారు. తెలుగు భాష మూలద్రావిడ భాషనుంచే పుట్టిందితప్ప సంస్కృతం నుంచి కాదని పరిశోధకుడు రాబర్ట్‌ కాల్డ్వెల్‌ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు.