అమ్మ జ్ఞాపకం అయిపోయినప్పుడు నాన్న అమ్మగా సాకారు. ఇప్పుడు ఆ నాన్న కూడా జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళిపోయారు. ఆ అమ్మానాన్నల గురించీ, వాళ్ళ అనుబంధం గురించీ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, విఖ్యాత కవి సి. నారాయణ రెడ్డి పెద్ద కుమార్తె గంగ మాటల్లో...

నువ్వు వెళ్లిపోయావు
నాకు బాధ లేదు
నీ స్మృతి నాటిపోయావు
అదే బాధ!
అమ్మ మరణించినప్పుడు దుఃఖాన్ని తట్టుకోలేక నాన్న మరుసటి రోజు రాసిన కవితా పంక్తులు ఇవి. ఇప్పుడు నాన్న కూడా వెళ్ళిపోయారు- ఆయన ‘స్మతి’ని మాలో నాటి... బాధను మాలో మిగిల్చి...!
 
అమ్మను నాన్న ఎప్పుడూ ఒకేలా ప్రేమించారు. చాలా చిన్నప్పుడే వాళ్ళ మధ్య పెనవేసుకున్న బంధం అది. వాళ్ళది బాల్య వివాహం. అప్పుడు అమ్మకు తొమ్మిదేళ్ళు. నాన్న వయసు పదకొండేళ్ళు. మా నానమ్మకు నాన్న ఒక్కడే కొడుకు. ఆడపిల్లలు లేరు. పెద్ద వ్యవసాయం. నానమ్మ తాత (అమ్మా వాళ్ళ నాన్న) దగ్గరికి వెళ్లి ‘‘అన్నయ్యా! మీ మూడో అమ్మాయి నా కోడలు. ఎవరికీ మాట ఇవ్వొద్దు’’ అని అమ్మకు మెడలో కంటె పెట్టిందట. (‘కంటె’ అంటే తెలంగాణలో ఒక నగ). ఈలోగా నానమ్మ తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల పెళ్లి తొందరగా చేయాల్సివచ్చింది.
 
అరుదైన అత్తాకోడళ్ళ అనుబంధం!
నానమ్మకు ఆడపిల్లలు లేకపోవటంతో అమ్మను చాలా గారాబంగా చూసుకునేది. పదిమంది ఉన్న వాతావరణంలో అమ్మ పెరిగింది. హనుమాజీపేటలో నానమ్మ ఒక్కతే. దీంతో బెంగపెట్టుకుని, చెప్పకుండా వాళ్ల ఊరికి (లింగంపల్లి) పారిపోయేదట. రెండు ఊళ్లకీ మధ్య వాగొక్కటే అడ్డు కదా! ఆ తర్వాత మామూలే. నానమ్మ వెళ్లి అమ్మను బుజ్జగించి, లాలించి, బతిమాలి వెనక్కి తీసుకొచ్చేదట. అది పెత్తనం కాదు, ఆత్మీయత. ఇలాంటి అత్తాకోడళ్ల అనుబంధం అరుదుగా కనిపిస్తుంది.
 
నమ్మకం లేకపోయినా అమ్మ కోసం!
నాకన్నా ముందు నలుగురైదుగురు పిల్లలు పుట్టగానే పోయారు. అమ్మ చేయని పూజలు లేవు. మొక్కని దేవుళ్లు లేరు. చివరికి గోదావరి (దక్షిణ గంగ) నదికి వెళ్లి నాన్నతో పాటు సరిగంగ స్నానాలు చేసింది. కరీంనగర్‌ జిల్లాలో ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి. నాన్నకు ఇలాంటివేవీ ఇష్టం లేకపోయినా అమ్మ కోసం చేసేవారు. అమ్మ నమ్మకాలనూ, విశ్వాసాలనూ ఎప్పుడూ కించపరచలేదు.
 
నాన్న తట్టుకోలేకపోయారు!
1962లో అమ్మకు పక్షవాతం వచ్చింది. హైదరాబాద్‌లోని డాక్టర్లందరినీ సంప్రతించినా లాభం లేకపోయింది. మిత్రుల సలహాతో నాన్న మద్రాసు తీసుకెళ్ళారు. శంకర్‌మీనన్‌ హాస్పటల్‌లో కాటేజ్‌ తీసుకున్నాం. వంటమనిషి దొరికే వరకు హోటల్‌ భోజనం. ఆ రోజుల్లో నాన్న మానసికంగా చాలా కష్టపడ్డారు. అక్కడ లాభం లేదని రాయవెల్లూరు ఆసుపత్రిలో అమ్మని చేర్చాం. దాదాపు 45 రోజులున్నాము. నాన్న, నేను, పెద్ద చెల్లెలు యమున హోటల్లో ఉండేవాళ్ళం. రోజూ రెండుసార్లు వెళ్ళి అమ్మను చూసేవాళ్ళం. అమ్మకు తోడుగా వంటమనిషి ఆసుపత్రిలో ఉండేది.
 
పదేళ్లకే బాధ్యతలు తీసుకున్నాను!
ఓ పక్క అనారోగ్యంతో అమ్మ, ఇంకో పక్క మేం చిన్నపిల్లలం. నాకు పదేళ్లు వచ్చేవరకూ నాన్న చాలా కష్టపడ్డారు. తరువాత ఇంటి బాధ్యతలు, డబ్బు వ్యవహారం నేను చూసుకోవడం మొదలుపెట్టాను. నాన్నకు ముందునుంచీ డబ్బుకు సంబంధించిన విషయాలు ఇష్టం ఉండేవి కావు. 1964లో అశోక్‌నగర్‌లో ఇల్లు కట్టుకున్నాం.