-ఫ్రెంచ్‌ సామాజిక పరిశోధకుడు డానియెల్‌ నెజర్స్‌ 

తెలుగు భాష నేర్చుకోవడంతోపాటు..కన్యాశుల్కం, చింతామణి వంటి తెలుగు నాటకాల్ని ఫ్రెంచ్‌ భాషలోకి అనువదిస్తున్నారు ప్యారిస్‌కు చెందిన డానియెల్‌ నెజర్స్‌. తెలుగు భాష మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడటమేతన లక్ష్యమని నెజర్స్‌ చెబుతున్నారు. తెలుగువారికన్నా చక్కగా తెలుగులో మాట్లాడుతున్న ఆయనతో ఇంటర్వ్యూ.. 
 
తెలుగునేలతో మీ తొలి పరిచయం? 
ఇండోఫ్రెంచ్‌ కల్చరల్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా 1986లో తొలిసారి ఆంధ్రయూనివర్సిటీకి వచ్చాను. మా గురువు హెయిరెన్‌ స్మిత ప్రోత్సాహంతో భారతలోని విభిన్నమైన తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు కళలపై పరిశోధన చేశాను. అలా బుర్రకథలు, జంగం కథలు వంటి జానపద కళారూపాల గురించి సుమారు మూడేళ్ల పాటు పెద్దాపురంలో ఉంటూ పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందాను. ఆ సమయంలో తెలుగు నేర్చుకున్నాను. విజయవాడ, నల్గొండ, గుంటూరు ఇలా అన్ని ప్రాంతాలు తిరిగాను. తెలుగు ఫ్రెంచ్‌ నిఘంటువును రూపొందించాలన్నది నా కోరిక..
 
మీ తెలుగు అనువాదాల గురించి చెప్పండి? 
తెలుగులోని 10 బుర్రకథల్ని ఫ్రెంచ్‌లోకి అనువదించాను. ఇప్పుడు చింతామణి నాటకాన్ని అనువదించే ప్రయత్నంలో ఉన్నాను. తర్వాత కన్యాశుల్కం కూడా ఫ్రెంచ్‌ వారికి పరిచయం చేయాలని కోరిక. వాటితోపాటు అమరావతి కథలు, దాట్ల దేవదానంరాజు యానాం కథలు, రావూరి భరద్వాజ కథలు వంటి కథా సాహిత్యం ఫ్రెంచ్‌లోకి అనువదించే ప్రయత్నంలో ఉన్నాను. వేమన పద్యాలు కూడా అనువదిస్తున్నాను. దేశభక్తి గీతాలు, పద్యాలు, గుర్రం జాషువా సాహిత్యం, గరిమెళ్ల, రాయప్రోలు పద్యాలు, శిఖామణి, కె. శివారెడ్డి కవిత్వం, జయధీర్‌ తిరుమల రావు రచనలు వంటివాటినీ తెలుగు నుంచి ఫ్రెంచ్‌లోకి అనువదించాలనేది నా భవిష్యత్తు ఆశ. తెలుగు భాషపై మరింత పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నాను.
 
తెలుగు సాహిత్యంలో మీకు ఇష్టమైనవి...? 
జంగం కథలు చాలా ఇష్టం. కన్యాశుల్కం, చింతామణి నాటకాల్లోని హాస్యం ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. అందుకే తెలుగు, ఫ్రెంచ్‌ సమాజాల నాగరికత వేరైనా, వాటిని ఫ్రెంచ్‌లోకి అనువదించే ప్రయత్నం చేస్తున్నాను. తెలుగు సమాజ సంస్కృతి, కళలు, సంప్రదాయాలపై పరిశోధన చేయాలని కొంతమంది ప్యారిస్‌ విద్యార్థులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే ఒక ఫ్రెంచ్‌ విద్యార్థి తెలంగాణ జానపద పాటలపై తన పరిశోధనని మొదలుపెట్టాడు. తెలుగుభాష సంస్కృతి, సాహిత్యం, కళల్లోని మాధుర్యం ప్రపంచమంతటా తెలియాలి. అందుకోసమే నా ప్రయత్నం. ప్రముఖ చరిత్ర అధ్యయనకారులు జయధీర్‌ తిరుమలరావు వంటివారితో కలిసి గిరిజనుల సాహిత్యం అనే అంశంపై పరిశోధన చేస్తున్నా. అందుకోసం ఏడాదికి రెండు సార్లు ఇక్కడికి వస్తున్నాను. ఈ సారి బుక్‌ఫెయిర్‌ని సందర్శించడం ఆనందంగా ఉంది. 
-ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ