హైదరాబాద్,09-12-2016: గుజరాత్ సీఎం మోదీ ఆఫీసు.. ముందు మెటల్‌ డిటెక్టర్‌... అటూ ఇటూ పోలీసులు.. దుస్తుల్లో ఉన్న సీక్రెట్‌ కెమెరాని వాళ్లు పసిగడితే.. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది... ముందుకు వెళ్లాలా.. వద్దా.. 
 
సంచలన పత్రిక తెహల్కా చదివేవారికి రానా అయ్యూబ్‌ సుపరిచితురాలే! నక్సల్స్‌పైన, మానవ హక్కుల ఉల్లంఘనలపైన, గుజరాత్ అల్లర్లపైన ఆమె రాసిన అనేక పరిశోధనాత్మక కథనాలు సంచలనం సృష్టించాయి. ఆమె రాసిన ఒక కథనం- అప్పటి గుజరాత్ హోంశాఖ మంత్రి అమిత్షాను కటకటాల వెనక్కి పంపింది. అలాంటి రానా.. గుజరాత అల్లర్ల వెనకున్న కుట్ర కోణాన్ని తెలుసుకోవటానికి మైథిలీ త్యాగిగా అవతారమెత్తింది. 8 నెలల పాటు అనేకమంది ప్రముఖులను కలిసి.. మాట్లాడి.. సంచలనాత్మక విషయాలను రికార్డు చేసింది. మోదీని రెండోసారి కలిసే ముందే-తెహల్కా ఆమెను వెనక్కి పిలిచింది. రానా రాసిన కథనాలను ప్రచురించటానికి కూడా నిరాకరించింది. వాటిని పుస్తకంగా ప్రచురించటానికి కూడా ఏ ప్రచురణ సంస్థ ముందుకు రాలేదు. దాంతో ఆరేళ్ల తర్వాత- ఈ ఏడాది మేలో ఆమే ఈ పుస్తకాన్ని గుజరాత్ ఫైల్స్‌ పేరిట ప్రచురించింది. మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఈ పుస్తకం గురించి బహిరంగంగా మౌనం వహిస్తున్నా.. పరోక్షంగా ఒత్తిడి పెడుతూనే ఉంది. ప్రస్తుతం 18 భాషల్లోకి అనువాదమైన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ‘నాకు ఎవరి మద్దతు లేదు.. నేను ప్రస్తుతం లోన్‌ రేంజర్‌’ అనే రానాను ‘నవ్య’ పలకరించింది. ఆ విశేషాలు.. 
 
గుజరాత్ ఫైల్స్‌ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది కదా.. ఎలా ఫీలవుతున్నారు..? 
ఇప్పటి దాకా ఇంగ్లీషులో 40 వేల కాపీలు అమ్మాను. తెలుగు సహా 18 భారతీయ భాషల్లో దీనిని అనువదించారు. త్వరలో ఫ్రెంచ్‌, మాండ్రీన్‌లో కూడా అనువదిస్తున్నారు. నన్ను మాట్లాడమని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలకు పిలుస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే క్షణం ఖాళీ లేదు.. ఒకప్పుడు ఈ పుస్తకాన్ని ప్రచురించటానికి ఇష్టపడని సంస్థలు ఇప్పుడు డిసి్ట్రబ్యూషన్‌ కోసం అడుగుతున్నాయి. నా స్టోరీలను ప్రచురించటానికి ఇష్టపడని పత్రికలు ఈ పుస్తకాన్ని తమంతట తామే రివ్యూ చేస్తున్నాయి. గుజరాత్ అల్లర్ల వెనకున్న అసలు రహస్యం ప్రజలకు తెలియాలి. అదే నా ఉద్దేశం. ఇది ఈ పుస్తకం ద్వారా ప్రజలకు చేరుతోందనే భావన చాలా సంతృప్తికరంగా ఉంది.
 
ఇప్పుడు ఇంత ధైర్యంగా పాలకులను, వ్యవస్థను ఎదుర్కొంటున్న రానా ఒకప్పుడు ఎలా ఉండేది? 
నేను చెబితే మీరు నమ్మకపోవచ్చు.. చిన్నప్పుడు చాలా భయంభయంగా ఉండేదాన్ని. ఎనిమిదో తరగతిలో కూడా ప్రతిరోజు మా అమ్మ నన్ను మా క్లాసుకు వచ్చి దిగబెట్టేది. అమ్మ వెళ్లిన వెంటనే భోరుమని ఏడుస్తూ ఉండేదాన్ని. ఒక దశలో మా ప్రిన్సిపాల్‌ అమ్మనాన్నలను పిలిచి- ‘ఈ అమ్మాయికి చాలా సీరియస్‌ ప్రొబ్లం ఉంది. ఎవరైనా కౌన్సిలర్‌కు చూపించండి’ అని చెప్పారు. ఆ తర్వాత నా వ్యక్తిత్వంలో ఒక మార్పు వచ్చింది. దేనినైనా ఎదుర్కోగలననే ధీమా వచ్చింది. సాధారణంగా అందరూ భయపడే విషయాలకు కూడా నేను భయపడటం మానేశా.
 
అసలు మీ బాల్యం ఎలా గడిచింది..? ఆ ప్రభావం మీపై ఉందా? 
మేము ముంబైలో సంపన్నులు నివసించే ఒక ప్రాంతంలో ఉండేవాళ్లం. నాన్న అయూబ్‌ వాకిఫ్‌ పేరున్న రచయిత. స్కూల్‌ హెడ్‌మాస్టర్‌. నాన్న దగ్గరకు అన్ని మతాల వారు సీట్ల కోసం వస్తూ ఉండేవారు. 1992లో జరిగిన బొంబాయి అల్లర్లతో మొత్తం పరిస్థితంతా మారిపోయింది. మేము నివసించే ప్రాంతంలో కూడా అల్లర్లు జరిగాయి. అల్లరి మూకలు మా ఇంటిపై కూడా దాడి చేసే అవకాశం ఉందన్నారు. దీంతో మా ఇంటి పక్కన ఉండే సిక్కు అంకుల్‌ నన్ను, మా అక్కను వాళ్ల చుట్టాలింట్లో ఉంచారు. దాదాపు రెండు నెలల పాటు నేను, మా అక్క అక్కడే ఉన్నాం. అమ్మనాన్నలతో మాట్లాడటానికి కూడా లేదు. రెండు నెలల తర్వాత మళ్లీ తిరిగి వచ్చాం. ఆ ప్రాంతం నుంచి ఇల్లు మారిపోయాం. ఈ సంఘటనల ప్రభావం నాపై చాలా బలంగా పడింది. కేవలం ముస్లిం అనే ఒకే ఒక కారణంతో దాడులు చేస్తారా? న్యాయం అనేది లేదా? అనే ప్రశ్నలు నాలో తలెత్తాయి. కానీ వాటిని వ్యక్తపరిచే వయస్సు కాదు.. దాంతో నాలో నేను కుమిలిపోవటం మొదలుపెట్టా. దీని నుంచి బయటకు రావటానికి చాలా కాలం పట్టింది.
 
గుజరాత్ అల్లర్లపై మీరు చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో- మీరు ఎనిమిది నెలలు మైథిలీ త్యాగిగా కొత్త అవతారం ఎత్తారు? ఆ అనుభవాల గురించి చెప్పండి.. 
స్టింగ్‌ ఆపరేషన్‌ వల్ల ఎలాంటి తీవ్రమైన ఫలితాలు వస్తాయనే విషయం మా ఎవ్వరికీ తెలియదు. తరుణ్‌ (తరుణ్‌ తేజ్‌పాల్‌ ఒకప్పటి తెహెల్కా చీఫ్‌ ఎడిటర్‌) నన్ను గుజరాత్ అల్లర్లపై స్టోరీలు చేయమన్నప్పుడు నాకు సహజంగానే ఆసక్తి కలిగింది. ఎందుకంటే ఇప్పటి దాకా మన దేశంలో జరిగిన అల్లర్ల బాధితులెవ్వరికీ ఇప్పటి దాకా న్యాయం జరగలేదు. న్యాయం జరగాలంటే అల్లర్ల వెనకున్న కథ తెలియాలి. అందుకే నేను మైథిలీ త్యాగిగా అవతారం ఎత్తాల్సి వచ్చింది. నేను రానా అయ్యూబ్‌ననే విషయాన్ని మర్చిపోయి ప్రతి క్షణం మైథిలీ త్యాగిగా వ్యవహరించటమనేది చాలా కష్టం. కానీ నా బాల్యంలో జరిగిన సంఘటనల ప్రభావం వల్ల నేను భయం లేనిదానిగా తయారయ్యా! ఒక రోజు నేను, మైక్‌ అనే ఫొటోగ్రాఫర్‌ మోదీ (అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి) కార్యాలయానికి వెళ్లాం. నా దగ్గర రహస్య కెమెరా ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో సాధారణంగానే గట్టి భద్రత ఉంటుంది. ఆ రహస్య కెమెరా బయటపడితే ఏదైనా జరగవచ్చు. మైక్‌కు చెమటలు పడుతున్నాయి. మోదీతో మాట్లాడి బయటకు వచ్చేసిన తర్వాత మైక్‌ నా దగ్గరకు వచ్చి- ‘‘నువ్వు దేనికీ భయపడవా? నాకు ముచ్చెమటలు పట్టాయి’’ అన్నాడు. ఇదొక అనుభవం. ఇక హాస్టల్‌లో ఉన్నంత కాలం అనుక్షణం ఒత్తిడే! ఎప్పుడు దొరికిపోతామో తెలియదు.. దొరికితే ఏమవుతుందో తెలియదు..
 
మీ కుటుంబం ఎలాంటి మద్దతు ఇచ్చింది? 
అమ్మనాన్నల మద్దతు లేకపోతే నేనేమైపోయేదాన్నో నాకే తెలియదు. మా అమ్మికి 16 ఏళ్లకు పెళ్లైపోయింది. పెద్దగా చదువుకోలేదు. దాంతో తాను చేయాలనుకున్నవన్నీ నేను చేస్తే బావుండుననిపించేది. గుజరాత్ ఫైల్స్‌ పుస్తకం వేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు చాలా మంది సన్నిహితులందరూ వ్యతిరేకించారు. అమ్మి మాత్రం నా వెంటే నిలిచింది. ఇక అబ్బాకు నేను మంచి జర్నలిస్టు కావాలనేది కోరిక. నన్ను రాయమని ప్రొత్సహిస్తూ ఉంటారు. గత శనివారం చాలాకాలం తర్వాత ముంబై వెళ్లా. ఇంటికి నాన్న వచ్చారు. వచ్చి నేను ఎలా ఉన్నానని కూడా అడగలేదు.
‘రెండు నెలల నుంచి ఎన్డీటీవీ బ్లాగ్‌కు రాయటం లేదు.. మళ్లీ ఎప్పుడు రాస్తావు?’ అని అడిగారు.
 
మీరు చేస్తున్న పోరాటానికి ఫలితం ఉంటుందనుకుంటున్నారా? 
నేను దేశంలోనే అతి శక్తిమంతమైన వ్యక్తులతో పోరాడుతున్నానని తెలుసు. ఏ క్షణంలోనైనా నాకు ఏమైనా కావచ్చు. కానీ న్యాయం జరగాలి. ఈ మధ్య నేను పంజాబ్‌ వెళ్లా. అక్కడ వాళ్లు- ఈ పుస్తకం చదువుతుంటే 1984లలో జరిగిన సిక్కుల ఊచకోత గుర్తుకొచ్చింది అన్నారు. అంటే ప్రజలు ఈ పుస్తకంతో కనెక్ట్‌ అవుతున్నారనే కదా.. నా ఉద్దేశంలో 1984 అల్లర్ల బాధితులకు న్యాయం జరిగితే 1992 సంఘటనలు జరిగేవి కావు. 1992 అల్లర్ల బాధితులకు న్యాయం జరిగితే 2001 గుజరాత్ అల్లర్లు జరిగేవి కాదు. ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్న అంశాలు. మీకో ఆసక్తి కలిగించే విషయం చెబుతా. బొంబాయి అల్లర్లపై విచారణ జరిపిన జస్టిస్‌ శ్రీకృష్ణను ఈ పుస్తకానికి ముందుమాట రాయమన్నా. ఆయన ముందు నిరాకరించారు. పుస్తకం చదివిన తర్వాత ఒప్పుకున్నారు. ఆయనకు ఇప్పటికీ నేను మైథిలీనే. మొన్న ఆయన ఫోన్‌ చేసి- ‘మోదీ కవితల పుస్తకాన్ని సంస్కృతంలో వేస్తున్నారట.. దానికి ముందుమాట రాయమన్నారు.. నేను రాయనన్నాను’ అన్నారు. ఎందుకు? అని అడిగాను. ‘నీ పుస్తకానికి ముందు మాట రాసిన తర్వాత ఆ పుస్తకానికి ఎలా రాస్తాను?’ అన్నారు. ప్రస్తుతం నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఆ విషయం నాకూ తెలుసు. కానీ న్యాయానికి ఉన్న బలం ఏ వ్యక్తికి, ఏ వ్యవస్థకు ఉండదు. నేను దానిని బలంగా నమ్ముతున్నాను కాబట్టే పోరాటం చేస్తున్నా!
 
మోదీ వ్యతిరేకులు అనేకమంది ఉన్నారు. అనేక పార్టీలున్నాయి.. వారి మద్దతు ఎందుకు తీసుకోవటం లేదు? 
మోదీకి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రులు కూడా నాకు మిత్రులే! వారు కూడా నాతో మాట్లాడుతూనే ఉంటారు. పుస్తకంలో విషయాలను మెచ్చుకుంటారు. కానీ బహిరంగంగా నాతో మాట్లాడరు. దేశంలోని ముఖ్యమైన పార్టీలన్నీ కూడా నేను ముందుకు వచ్చి మాట్లాడితే మద్దతు ఇస్తామని చెప్పినవారే. కానీ ఈ పుస్తకాన్ని రాజకీయం చేయటం నాకు ఇష్టం లేదు. నేను పోరాడేది న్యాయం కోసం.. రాజకీయ పార్టీల కోసం.. వారి ప్రయోజనాల కోసం కాదు. ఈ పుస్తకం వచ్చి ఆరు నెలలు పైగా అవుతోంది. మోదీ కానీ ఆయన సహచరులు కానీ వారి పార్టీ కానీ ఈ పుస్తకంలో ఉన్న విషయాలను విభేదించలేదు. ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరం నిజమే కాబట్టి! కానీ వారు నాపై రకరకాలుగా ఒత్తిడి పెడుతూనే ఉన్నారు. ఉదాహరణకు ఈ మధ్య ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనటానికి దోహా వెళ్లా. నేను అక్కడకు వెళ్తున్న విషయం ఇండియన్‌ కాన్సులేట్‌ అధికారులకు తెలిసింది. వెంటనే వారు ఆ కార్యక్రమాన్ని రద్దు చేయించారు. చివరకు ఒక చిన్న హోటల్‌లో కార్యక్రమం నడిపించాల్సి వచ్చింది. ఇలాంటి ఒత్తిళ్లు ప్రతి రోజూ ఉంటున్నాయి! 
 
స్టింగ్‌ ఆపరేషన్‌ వల్ల ఎలాంటి తీవ్రమైన ఫలితాలు వస్తాయనే విషయం మా ఎవ్వరికీ తెలియదు. తరుణ్‌ (తరుణ్‌ తేజ్‌పాల్‌ ఒకప్పటి తెహెల్కా చీఫ్‌ ఎడిటర్‌) నన్ను గుజరాత్ అల్లర్లపై స్టోరీలు చేయమన్నప్పుడు నాకు సహజంగానే ఆసక్తి కలిగింది. ఎందుకంటే ఇప్పటి దాకా మన దేశంలో జరిగిన అల్లర్ల బాధితులెవ్వరికీ ఇంకా న్యాయం జరగలేదు. న్యాయం జరగాలంటే ఆ అల్లర్ల వెనకున్న కథ తెలియాలి. అందుకే నేను మైథిలీ త్యాగిగా అవతారం ఎత్తాల్సి వచ్చింది. 
 
 
సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌