తేటతెలుగు పదాల పాటల రచయిత, గాయకుడు అనంత శ్రీరామ్‌.‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే....చాలే, ఇది చాలే .’ అనే యూత్‌ క్రేజీ సాంగ్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నారు శ్రీరామ్‌.పచ్చబొట్టేసిన పిల్లగాడా..నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా....అంటూ అంతర్జాతీయ ఖ్యాతిపొందారు. . సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు...పాటతో తెలుగువారి హృదయాలను దోచుకున్నారు.‘యంగ్‌ యమా...యంగ్‌ యమా...ఇరగేసుకో...’ అనే సరికొత్త పద ప్రయోగాలతో ఆడియన్స్‌ను అలరించినా, ‘తోబ తోబ, తోబ తోబ, తోడుగుంది దిల్లు రూబ....’అంటూ ఐటెమ్‌సాంగ్‌ తో అల్లాడించినా, ఓం నమో వెంకటేశాయ...అంటూ భక్తి పాటతో పులకింపజేసినా అది శ్రీరామ్‌కే చెల్లింది..ఆయన ఏదో ‘ఒకరకం పాటలకే’ పరిమితం కాలేదు. అన్నిరకాల పాటలూ రాసే ఆల్‌ రౌండర్‌గా దర్శక నిర్మాతల్లో పేరు పొందారు.

రికార్డింగ్‌ థియేటర్లో కూర్చుని ఆన్‌ ద స్పాట్‌లో శరవేగంగా పాట రాయగల దిట్ట. చిత్ర పరిశ్రమలో ఇలాంటి రచయితల్ని వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. లక్షలాది భావాలతో పరవళ్ళు తొక్కే అక్షరాల గండర గండుడు అనంత్ శ్రీరామ్‌. 35ఏళ్ళ వయసుకే వెయ్యి పాటలకు చేరువవుతున్నారు.‘‘నేను రాసిన పాట నాకు సంతృప్తినిచ్చిందంటే, అదే నా ఆఖరి పాట అవుతుంది’’ అంటున్న అనంత శ్రీరామ్‌ ఇంటర్వ్యూ...

వశిష్ఠ గోదావరి పశ్చిమ తీరాన దొడ్డిపట్ల గ్రామంలో పుట్టిన అనంత శ్రీరామ్‌ పచ్చటి పైరులు, మైదానాల్లో ఆటపాటలాడుతూ, సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే శ్రీసరస్వతీ శిశుమందిర్‌లో విద్యాభ్యాసం చేశారు. తండ్రి మార్గదర్శకత్వంలో స్కూల్లో నాటకాలు, ఏకపాత్రాభినయాల ప్రదర్శన, మహాభారతంలోని ‘పడకసీను’, రాయబారం’ లో కృష్ణుడుగా పద్యాలుపాడుతూ నటించడమేకాదు, అవధానాల్లో బాలపృ‌శ్చకుడిగా తెలుగు సాహిత్యాన్ని ఆస్వాదించేవారు.నటనకంటే ఎక్కువగా తెలుగు భాషా మాధుర్యాన్నే ఆస్వాదించేవారు శ్రీరామ్‌. బాపట్లలో ఇంజనీరింగ్‌ థర్డ్‌ ఇయర్‌లో చదువు మానేసి సినీరంగంలో ప్రవేశించారు.

కాదంటే ఔననిలే...

సంగీతదర్శకుడు ఆర్‌. విశ్వనాథసత్యనారాయణ ప్రోత్సాహంతో ‘కాదంటె ఔననిలే’ తొలి సినిమాతోనే సింగిల్‌కార్డ్‌ రచయితగా గుర్తింపు పొందారు. ‘ఒక ఊరిలో’, ఏవండోయ్‌ శ్రీవారూ’, ‘ఏం మాయ చేశావె’ లో పాటలన్నీ ఆయనే రాశారు.‘‘సినీ రచయితగా నేను ఒక్కసారిగా బ్లాస్ట్‌ అవలేదు. నా బిగినింగ్‌ చాలా హంబుల్‌గా జరిగింది’’ అంటారు శ్రీరామ్‌. నిర్మాత కోగంటి రామకృష్ణ సలహాతో మెగాస్టార్‌ చిరంజీవి ‘అందరివాడు’ చిత్రంలో ఆయనకు అవకాశం ఇచ్చారు.ఉదయం పది గంటలకు ట్యూన్‌ తీసుకుని మధ్యాహ్నం మూడు గంటలకి ‘పడుచు బంగారమా, పలుకుమా సరిగమా, చిలిపి ‍శృంగారమా, చిలకవే మధురిమ....’ అనే పల్లవితో పాటరాసిచ్చి చిరంజీవిని ఆశ్చర్యపరిచారు శ్రీరామ్‌. అప్పటినుంచీ ఆయన వెనుదిరిగి చూడలేదు.సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్‌కి అనుగుణంగా పాట రాసి అదే ట్యూన్‌లో పాటపాడి వినిపించి వారిని ఇంప్రస్‌చేయడం, ఆరుద్ర ఆత్రేయ తరహాలో తేలికపదాల్లో లోతైన భావాలు పలికించడం ఆయన ప్రత్యేకత.

అన్యభాషా పదాల్ని ఇష్టపడడు

శ్రీరామ్‌ అన్యభాషాపదాలు ఉపయోగించరు అడిగితే తప్ప. ‘‘నిజంగా నేనేనా...ఇలా నీ జతలో ఉన్నానా...(కొత్త బంగారులోకం), ‘‘అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలీ...(బొమ్మరిల్లు), నాలో ఊహలకు నాలో ఆశలకు.....’’ (చందమామ), ‘‘పరారే పరారే....’’ (స్టాలిన్‌), చిన్నదోవైపు, పెద్దదో వైపు...(బృందావనం), ‘రబ్బరుగాజులు...రబ్బరు గాజులు...రబ్బరు గాజులు తెచ్చానే...’ (యమదొంగ) లాంటి ఎన్నో పాటలు మనల్ని మేఘాల్లో విహరింపజేస్తాయి. ‘‘తాను నేనూ, మొయిలు–మిన్ను, తాను – నేను...కలువ–కొలను...(సా‌హసమే శ్వాసగా సాగిపో) అనే పాట పండిత పామరుల ప్రశంసలందకుంది. దాసరి నారాయణరావు తీసిన ‘యంగ్‌ ఇండియా‌’ సినిమా కోసం రెండు పాటలు రాశారు శ్రీరామ్‌. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ‘శుభప్రదం’ సినిమాలో ఒక పాటను ఎంతో ఇష్టపడి మరీ మరీ అడిగి రాయించుకున్నారు.