స్థానిక గాయకులకు మిగతావాళ్లకు తేడా ఏంటి?..

‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇళయరాజా

‘‘ఎవరు పాడినా వినసొంపుగా ఉండాలి. స్థానిక గాయకులకు, మిగిలిన వాళ్లకీ తేడా ఏంటి? నా దృష్టిలో అందరూ లోకలే. మిగిలిన వాళ్లు ఆకాశం నుంచి ఊడిపడలేదుగా? వాళ్లేం గంధర్వులు కాదు కదా’’ ..అని అన్నారు మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా. దాదాపు ఆరువేల పాటలను కంపోజ్‌ చేశారు.

‘‘ నన్ను అందరికన్నా ఎక్కువగా ఇష్టపడేది తెలుగు వారే. వారు కొన్ని దశాబ్దాలుగా నా పాటలను రికార్డుల్లోనే వింటున్నారు.’’ అని ఇళయరాజా అన్నారు. దాదాపు అయిదేళ్ల తర్వాత మీడియాకు మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..  

నాలుగు దశాబ్దాల మీ సినీ సంగీత ప్రస్థానాన్ని ఎలా వర్ణిస్తారు..
నేను ఒక సామాన్య మానవుడిని.. నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఎలా? (నవ్వులు).. నా ఉద్దేశంలో నా జీవితం ఒక ప్రస్థానం కాదు. నా సంగీతమే నా ప్రస్థానం. ఈ రెండింటినీ వేరు చేసి చూడలేము.
 
హైదరాబాద్‌తో మీ అనుబంధం గురించి చెప్తారా...
హైదరాబాద్‌తో నాకు గొప్ప అనుబంధం ఉంది. 1970ల్లో సంగీత కచేరీల్లో హార్మోనియం వాయించటానికి హైదరాబాద్‌కు వచ్చేవాడిని. మా గురువుగారు సికింద్రాబాద్‌లో ఉన్న ఒక మ్యూజిక్‌ స్టోర్‌లో వెస్ట్రన్‌ మ్యూజిక్‌ స్కోర్‌ పుస్తకాలు దొరుకుతాయని చెప్పారు. నేను రైల్వే స్టేషన్‌లో దిగి నేరుగా సికింద్రాబాద్‌ వెళ్లి ఆ పుస్తకాలు కొనుక్కునే వాడిని.
 
ఒకప్పటి హైదరాబాద్‌కు..ఇప్పటి హైదరాబాద్‌కు తేడా ఏమిటి?
భౌతికంగా మారి ఉండొచ్చు. కానీ మనుషులు వారేగా! వారితో మనకున్న బంధం బంధమే కదా. మనుషులు మారనంత కాలం ఫర్వాలేదు.
 
మీ సినీ ప్రస్థానంలో మరపురాని సంఘటనలేవైనా చెబుతారా?
బాలచందర్‌ రుద్రవీణ సినిమాలో ‘లలిత ప్రియ కమలం’ అనే పాట ఉంది. ఆ పాట ఎలా పుట్టిందో చెబుతాను. ఆ సినిమాలో హీరోయిన్‌ ఒక రాగంలో పాట పాడి వెళ్లిపోతుంది. ఆ రాగం పేరే ఆ అమ్మాయిది. ఆ రాగాన్ని విని హీరో ఆమె పేరు తెలుసుకోవాలి. అలాంటి పేరున్న రాగంతో పాట చేయమని డైరక్టర్‌గారు అడిగారు. అప్పుడు నేను హిందుస్థానీలో ఉన్న లలితప్రియ అనే రాగంలో పాటను చేశా.
 
ఒక ఆధ్యాత్మికవేత్తగా మీరు ఆధ్యాత్మికతను ఎలా అభివర్ణిస్తారు?

నా దృష్టిలో జీవితం.. ఆధ్యాత్మికత.. సినిమా.. సంగీతం వేర్వేరు కాదు. మనం చేసే ప్రతి పనిలోను ఆధ్యాత్మికత ఉంటుంది. మా దగ్గర బెల్లంతో వినాయకుడిని చేసి పూజిస్తారు. మళ్లీ బెల్లాన్నే ఆయనకు నైవేద్యంగా పెడతారు. అంటే మనం చేసే ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత ఉంటుంది.

మీ కచేరీలో స్థానిక గాయకులు పాల్గొంటారా?
గాయకులనేవారు గంధర్వలోకాల నుంచి కిందకురారు. మన చుట్టుపక్కలే ఉంటారు. అయినా సంగీతానికి స్వ, పర భేదాలేముంటాయి?
 
ప్రస్తుతం సినిమా సంగీతంపై మీ అభిప్రాయం?
ప్రస్తుతం సంగీతం ఉందనుకుంటున్నారా? మీరు ఏది సంగీతమనుకుంటున్నారో.. అది సంగీతం కాదని నేను అనుకుంటున్నా. అలాంటప్పుడు దానిపై నాకు అభిప్రాయం ఎలా ఉంటుంది.. మీరే చెప్పండి..
 
ప్రస్తుతం ఉన్నది సంగీతం కాకపోతే.. మీ ఉద్దేశంలో సంగీతమంటే ఏమిటి?
సంగీతాన్ని ఇలా ఉండాలి అని ఎలా చెప్పగలుగుతా? చేసి వినిపించాలంతే..
 
ఎస్పీ బాలసుబ్రమణ్యంతో విభేదాలకు కారణాలేమిటి?
ఆ విషయాన్ని వదిలేద్దాం.. గొప్పవాళ్ల గొప్పతనం గురించి చెప్పకపోతే తప్పవుతుంది. ఇక విభేదాల విషయానికి వస్తే- ఆయనకు నేను సమాధానం చెప్పాలంటే వేరే విధంగా మాట్లాడాలి. అయినా అది నాకు, ఆయనకు మధ్య ఉన్న వ్యవహారం. అది పబ్లిక్‌కు ఎందుకు?